కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శబరిమల 'స్వామి ప్రసాదం'ను భక్తుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లి అందించేందుకు తపాలా విభాగం నిర్ణయం ప్రజల నుంచి భారీ స్పందన; ఇప్పటివరకు దాదాపు 9 వేల ఆర్డర్లు

Posted On: 01 DEC 2020 5:49PM by PIB Hyderabad

శబరిమల 'స్వామి ప్రసాదం'ను భక్తుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లి అందించేందుకు తపాలా విభాగం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులను దృష్టిలో ఉంచుకుని, సమగ్రమైన బుకింగ్‌, పంపిణీ ప్యాకేజీని రూపొందించింది. దేశవ్యాప్తంగా విస్తరించిన తన భారీ నెట్‌వర్క్‌ ద్వారా దేశంలోని మూలమూలకూ ప్రసాదాన్ని చేర్చనుంది. ఇందుకోసం ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డుతో కేరళ తపాలా విభాగం ఒప్పందం చేసుకుంది. ఒక్కో ప్యాకెట్‌కు రూ.450 చొప్పున చెల్లించి, దేశవ్యాప్తంగా ఉన్న ఏ తపాలా కార్యాలయం నుంచైనా 'స్వామి ప్రసాదం'ను బుక్‌ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్‌లో ప్రసాదం, నెయ్యి, విభూతి, కుంకుమ, పసుపు, అర్చన ప్రసాదం ఉంటాయి. ఒక్కో భక్తుడు ఒకేసారి 10 ప్యాకెట్ల వరకు బుక్‌ చేసుకోవచ్చు. స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ప్రసాదాన్ని బుక్‌ చేసిన వెంటనే, భక్తుడి మొబైల్‌కు స్పీడ్‌ పోస్ట్‌ సంఖ్యతో సందేశం వస్తుంది. ప్రసాదం రవాణా స్థితిని తపాలా వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

    గత నెల 6వ తేదీ నుంచే ఈ సేవ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాగా, ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9 వేల ఆర్డర్లు వచ్చాయి. రోజురోజుకు ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. 

    మండలం పూజల కోసం గత నెల 16వ తేదీ నుంచి శబరిమల ఆలయాన్ని తెరిచారు. కొవిడ్‌ కారణంగా భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే ఆలయం వద్దకు అనుమతిస్తున్నారు. దేవస్థానం విధించిన కఠిన ఆంక్షలను పాటించని కారణంగా, పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోలేకపోతున్నారు.

***


(Release ID: 1677548) Visitor Counter : 187