ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఉగ్రవాదమే తమ విధానంగా వ్యవహరిస్తున్న దేశాల తీరుపై ఉపరాష్ట్రపతి ఆందోళన

• ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమే

• అలాంటి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఏరివేసేలా అంతర్జాతీయ చట్టాలు రావాల్సిన అవసరముంది

• కరోనా అనంతర కొత్త ప్రపంచాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు రావాలి

• నేటి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా బహుముఖ సంస్కరణలపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత

• మన ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా వ్యాపార నిబంధనలను సరళీకరించుకునేలా అన్నిదేశాలు చొరవ తీసుకోవాలి

• ఎస్.సి.ఓ. సభ్యదేశాలన్నీ కలిసి అంకుర సంస్థలు, నవకల్పన తదితర అంశాలపై ప్రత్యేక బృందంగా కృషిచేయాలని పిలుపునిచ్చిన భారత్

• సంప్రదాయ వైద్యంపై నిపుణుల బృందం ఏర్పాటుచేసే విషయంలో మిగిలిన సభ్యదేశాలకు సహకారం అందిస్తాం

• వార్షిక ఎస్.సి.ఓ – ఎం.ఎస్.ఎం.ఈ. బజార్ ఏర్పాటు, ఎం.ఎస్.ఎం.ఈ. రంగంలోని ఉత్తమపద్ధతులను పంచేందుకు సంసిద్ధత

• షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) మండలి సభ్యదేశాల 19వ సదస్సు సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు వెల్లడి

Posted On: 30 NOV 2020 4:51PM by PIB Hyderabad

ఉగ్రవాదానికి మద్దతునిస్తూ ఉగ్రవాదాన్నే తమ విధానంగా మార్చుకుని ముందుకెళ్తున్న దేశాల తీరుపై భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దేశాలపై కఠినమైన చర్యలు తీసుకుని ఉగ్రవాద స్వర్గధామాలను, వారి మౌలికవసతులను, ఆర్థిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సభ్యదేశాలు ఈ దిశగా ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎస్.సి.ఓ. సభ్యదేశాల 19వ సదస్సుకు అధ్యక్షత వహిస్తూ్.. సభ్యదేశాల అధినేతలనుద్దేశించి మాట్లాడుతూ ఉగ్రవాదం ఏ రూపంలో దాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, ‘మానవాళికే సవాల్‌గా మారిన ఉగ్రవాదానికి అన్నిరకాలుగా మద్దతిస్తూ ఉగ్రవాదమే తమ విధానంగా ముందుకెళ్తున్న దేశాలు అనుసరిస్తున్న తీరు ఆందోళనకరం. ఇది ఎస్‌సీవో స్ఫూర్తికి, నిబంధనలకు పూర్తి విరుద్ధం’ అని పేర్కొన్నారు. అభివృద్ధి జరగాలంటే ముందుగా శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఉగ్రవాదమే ప్రధాన అవరోధంగా మారిందన్నారు. మరీ ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు సభ్యదేశాలన్నీ సంయుక్తంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఉగ్రవాదాన్ని అంతమొందించినపుడే.. సభ్యదేశాలన్నీ తమ శక్తి సామర్థ్యాలను పంచుకుంటూ పరస్పర సమన్వయంతో ఆర్థికంగా, సుస్థిరమైన అభివృద్ధిని సూచించేందుకు వీలవుతుందన్న ఉపరాష్ట్రపతి, కరోనా మహమ్మారి కారణంగా సభ్యదేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి నెమ్మదించిన విషయాన్ని ప్రస్తావించారు. కరోనాపై పోరాటంతోపాటు దేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చేందుకు భారతదేశం చూపించిన స్ఫూర్తి కారణంగానే ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజాసాధికారత, ప్రజాకేంద్రిత విధానాల కారణంగానే అత్యంత తక్కువ మరణాలరేటు భారత్ లో నమోదైందని స్పష్టం  చేశారు.

ప్రపంచ వ్యాధినిరోధక టీకాల్లో 60శాతానికి భారతదేశంలోనే తయారవుతున్నాయన్న ఉపరాష్ట్రపతి, కరోనా సమయంలో ప్రపంచ ఫార్మా కేంద్రంగా భారత్ తనసామర్థ్యాన్ని చాటుకుందని.. భారతదేశంలోని ప్రపంచస్థాయి ఫార్మాసూటికల్ పరిశ్రమకు ఈ గౌరవం దక్కుతుందని వెల్లడించారు.

ప్రపంచమంతా లాక్‌డౌన్‌‍లో ఉన్న సమయంలోనూ ఎస్.సి.ఓ సభ్య దేశాలు సహా 150 దేశాలకు భారతదేశం మందులు సరఫరా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, కరోనాపై పోరాటంలో ఈ మండలి సభ్యదేశాలతో కలిసి తమ సంప్రదాయ వైద్య విధానాన్ని, తమ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి తర్వాత అంతర్జాతీయ సంస్థల బలహీనత, డొల్లతనం ప్రపంచానికి తెలిసిందని తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతర్జాతీయ సంస్థలన్నింటిలోనూ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, కరోనానంతర ప్రపంచాన్ని పునరాభివృద్ధి చేసుకునేందుకు ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఇందుకోసం నేటి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా సంస్కరణలతో కూడిన బహుముఖ వ్యూహాలను అమలుచేయాలి. ప్రతి ఒక్కరికీ తమ వాదనను వినిపించే అవకాశం ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితులను, సవాళ్లను పరిష్కరించుకోవాలి. ప్రతి విధానపరమైన నిర్ణయం, ప్రతి ఆలోచనా మానవాళి శ్రేయస్సు కేంద్రంగానే ఉండాలి’ అని ఉపరాష్ట్రపతి భారతదేశ అభిప్రాయాన్ని సదస్సుకు వెల్లడించారు.

ప్రపంచ యవనికపై భారతదేశం ఆర్థిక శక్తిగా అభివృద్ధిని సాధిస్తోందన్న ఉపరాష్ట్రపతి, 2025 నాటికి దేశ జి.డి.పి. 5 ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుందని తెలిపారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు భారతదేశం వినూత్న ఆర్థిక వ్యూహాలను కొనసాగిస్తోందన్న ఆయన ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఆర్థిక బలం, స్థితిస్థాపకత మరియు మెరుగైన సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ అభివృద్ధిలో విశ్వసనీయ మరియు విలువైన భాగస్వామిగా తన పాత్రను నిర్వహించేందుకు సిద్ధమౌతోందని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్ని దేశాలు కలిసి పని చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టి ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు భారతదేశం వాణిజ్యం, మరియు పెట్టుబడుల మీద దృష్టి పెట్టిందని, ఈ దిశగా ముందుకు సాగేందుకు ఇందులో భాగస్వాములు సైతం అదే నమ్మకాన్ని, పారదర్శకతను కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని దేశాలు బహుపాక్షిక వాణిజ్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని తెలిపారు.

2021-25 కాలానికి బహుపాక్షిక వాణిజ్య మరియు ఆర్థిక సహకార కార్యక్రమం అమలు కోసం కార్యాచరణ ప్రణాళికను ఆమెదించిన ఎస్.సి.ఓ. ఆర్థిక మంత్రులను అభినందించిన ఉపరాష్ట్రపతి, సంస్థలో చురుకైన, సానుకూల మరియు నిర్మాణాత్మక పాత్ర పోషించడం ద్వారా ఎస్.సి.ఓ.లో తన సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్ళడానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.

అంకుర సంస్థలు, మరియు నవకల్పనకు సంబంధించిన ఓ నూతన కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదిస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఆలోచనలు పంచుకోవడం, వర్క్ షాప్ ల నిర్వహణ, యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, పెట్టుబడి దారులకు సౌకర్యాల కల్పన, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం లాంటి కార్యక్రమాల ద్వారా ప్రారంభంలోనే వారికి అనుకూల వాతావరణాన్ని సృష్టించే వ్యవస్థ అభివృద్ధి కోసం ఇది ఉపయోగపడుతుందని అదే విధంగా ఎస్.సి.ఓ. సభ్యదేశాల బహుపాక్షిక సహకారానికి ఇది పునాది వేస్తుందని తెలిపారు. స్టార్టప్ ఇండియా ప్రారంభించిన నాటి నుంచి భారతదేశంలోని మొత్తం 590 జిల్లాల్లో 38 వేల కన్నా ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్ లు భారతదేశంలో ఉన్నాయని, ఇవి దాదాపు 4 లక్షల ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాయని ఆయన వివరించారు.

అంకుర సంస్థలు, మరియు నవకల్పనల కోసం ప్రత్యేక కార్యాచరణ బృందాలను ప్రతిఏటా నిర్వహించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన ఉపరాష్ట్రపతి,  దీనితో పాటు సంప్రదాయ వైద్యంపై నిపుణుల బృందం ఏర్పాటు విషయాన్ని కూడా భారత్ ప్రతిపాదించిందని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆధునిక వైద్యానికి ధీటుగా సంప్రదాయ వైద్యం సాధించిన విజయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు. ‘కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచమంతా నిశ్చేష్టులై చూస్తున్న సమయంలో భారతీయ సంప్రదాయ వైద్యం తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చి లక్షలాది ప్రాణాలకు కాపాడింది’ అని ఆయన పేర్కొన్నారు. సమగ్రమైన వైద్య విధానాన్ని బలోపేతం చేసేందుకు భారతీయ సంప్రదాయ వైద్యాన్ని యురేషియా (యూరప్+ఆసియా) ప్రాంతంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిపుణుల బృం్దాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమేనన్నారు. ప్రజలజీవితాల నాణ్యతను పెంచేందుకు యోగ, ఆయుర్వేదం కీలకపాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ వార్షిక సదస్సును నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

అన్ని దేశాల్లో ఆర్థికాభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. భారతదేశం ఈ రంగంలో అనుసరిస్తున్న ఉన్నతమైన పద్ధతులను సభ్యదేశాలతో పంచుకునేందుకు సిద్ధమేనని ఉపరాష్రపతి తెలిపారు. ఈ రంగం ఆర్థికాభివృద్ధితోపాటు భారీస్థాయిలో ఉపాధి కల్పన, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల సాధికారతకు మార్గం వేస్తుందని, ఇందుకోసం వార్షిక ఎస్‌సీవో ఎమ్మెస్ఎమ్ఈ బాజార్ ను నిర్వహించేందుకు ఫిక్కీ సిద్ధంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కజకిస్తాన్ ప్రధాని శ్రీ అస్కర్ మమీన్, చైనా స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్ శ్రీ లి. కెకియాంగ్, కిర్గిస్తాన్ ప్రధాని శ్రీ ఆర్టెమ్ ఎడ్యువర్డోవిచ్ నోవికోవ్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీ అంద్లీబ్ అబ్బాస్, రష్యా ప్రధాని శ్రీ మిఖాయిల్ మిషుస్తిన్, తజకిస్తాన్ ప్రధాని ప్రధాని శ్రీ కోహిర్ రసుల్‌జోడా, ఉజ్బెకిస్తాన్ ప్రధాని శ్రీ అబ్దుల్లా నిగమతోవిచ్ అరిపోవ్, ఎస్‌సీవో సెక్రటరీ జనరల్ శ్రీ వ్లాదిమిర్ నోరోవ్, ఎస్‌సీవో ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్రీ జుమఖోన్ గియోసోవ్, అఫ్ఘనిస్తాన్ మొదటి ఉపాధ్యక్షుడు శ్రీ అమ్రుల్లా సలేహ్, బెలారస్ ప్రధాని శ్రీ గొలోవ్‌చెంకో రోమన్, ఇరాన్ తొలి ఉపాధ్యక్షుడు శ్రీ ఇషాక్ జహంగీరీ, మంగోలియా ఉపప్రధాని శ్రీ సోద్‌బాతర్ యాంగుంగ్, ప్రత్యేక అతిథి - తుర్క్‌మెనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి శ్రీ రషీద్ మెరెదోవ్, ఎస్‌సీవో బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ సెర్గే కేటిరిన్, ఎస్‌సీవో ఇంటర్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ ఇగోర్ షువలోవ్ తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1677247) Visitor Counter : 167