నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

అండ‌మాన్ అండ్ నికోబార్, ల‌క్ష‌దీవుల్లో హ‌రిత ఇంధ‌న వినియోగ‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌లు

మాల్దీవుల దేశం నిర్వ‌హించిన‌ మూడవ గ్లోబ‌ల్ రీ ఇన్వెస్ట్ కార్య‌క్ర‌మంలో పేర్కొన్న కేంద్ర మంత్రి ఆర్‌.కె.సింగ్

పునర్‌ వినియోగ శ‌క్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి మాల్దీవుల‌కు పూర్తిస్థాయిలో స‌హ‌కార‌మందిస్తామ‌ని పేర్కొన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి

Posted On: 28 NOV 2020 7:31PM by PIB Hyderabad

పున‌ర్‌  వినియోగ శ‌క్తి ప్రాజెక్టుల‌ను ప్రోత్స‌హించే విష‌యంలో మాల్దీవుల‌కు పూర్తిస్థాయిలో స‌హ‌కార‌మందిస్తామ‌ని ఆ దేశానికి భార‌త‌దేశ విద్యుత్‌, పునర్   వినియోగ శ‌క్తి శాఖ మంత్రి శ్రీ ఆర్ కె. సింగ్ హామీనిచ్చారు. మూడవ గ్లోబ‌ల్ రీ ఇన్వెస్ట్ సంద‌ర్భంగా మాల్దీవులు దేశంతో నిర్వ‌హించిన స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న ‌భార‌త‌దేశంలోని ద్వీపాల‌ను కూడా పూర్తిస్థాయిలో హ‌రిత ఇంధ‌న ద్వీపాలుగా మారుస్తామ‌ని అన్నారు. దీనికి సంబంధించి ఆయా ద్వీపాల్లో హ‌రిత ఇంధ‌న వినియోగానికి సంబంధించి పున‌ర్ వినియోగ ఇంధ‌న వ‌న‌రుల మీద ఆధార‌ప‌డేలా ఆదేశాలిచ్చి ల‌క్ష్యాల‌ను నిర్దేశించామ‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. 
వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించి రెండుశాతం లోపే వుండేలా పెట్టుకున్న లక్ష్యాన్ని భార‌త‌దేశం చేరుకుంద‌ని అలా ల‌క్ష్యం ప్ర‌కారం చేరుకున్న కొన్ని దేశాల్లో భార‌త‌దేశం ఒక‌టని కేంద్ర‌మంత్రి అన్నారు. ఇప్ప‌టికే భార‌త‌దేశంలో ఒక ల‌క్షా 36 వేల మెగావాట్ల ఆర్ ఇ ( రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ) సామర్థ్యాన్ని పొందింద‌ని, మ‌రో 57వేల మెగావాట్ల విద్యుత్ శ‌క్తి సామ‌ర్థ్యం అద‌నంగా వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అన్నారు. 
విద్యుత్ శ‌క్తిని స‌మ‌ర్థ‌వంతంగా వాడుకోవ‌డానికిగాను శ‌క్తివంత‌మైన కార్య‌క్ర‌మాన్ని భార‌త‌దేశం అమ‌లు చేస్తోంద‌ని దేశంలో 11 మిలియ‌న్ లెడ్ బ‌ల్బుల‌ను వీధిదీపాలుగా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని కేంద్ర‌మంత్రి అన్నారు. ప‌ర్యావ‌ర‌ణ హిత ఇంధ‌న వ‌న‌రుల‌ద్వారా కార్బ‌న్ డ‌యాక్స‌యిడ్ ఉద్గారాల‌ను త‌గ్గించుకోవ‌డం త‌మ‌కు అత్యంత ముఖ్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఎంతో సుంద‌ర‌మైన మాల్దీవులు కూడా పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల‌ వినియోగానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు. 
పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల రంగంలో భార‌త‌దేశం అమ‌లు చేస్తున్న విధానాల‌ను కేంద్ర‌మంత్రి శ్రీ సింగ్ వివ‌రించారు. ప‌ర్యావ‌ర‌ణానికి ప‌రిర‌క్ష‌ణ‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. 
2030 నాటికి నాలుగు ల‌క్ష‌లా యాబైవేల మెగావాట్ల ఆర్ ఇ సామ‌ర్థ్యాన్ని సాధించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని శ్రీ సింగ్ పేర్కొన్నారు. భూగోళం వేడెక్క‌డంవ‌ల్ల ద్వీప‌దేశాలు, ద్వీప ప్రాంతాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయ‌నే ఆందోళ‌న‌ల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. కాబ‌ట్టి మాల్దీవుల్లో పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. 
 ఈ సమావేశంలో మాల్దీవులకు చెందిన మంత్రి హుస్సేన్ ర‌షీద్ హాస‌న్ మాట్లాడారు. చ‌మురు దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించుకుంటున్నామ‌ని పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని అన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విధానాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని త‌ద్వారా ఆర్ ఇని ప్రోత్స‌హిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డానికిగాను పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల‌కు ప్రాధాన్యాత‌నిచ్చేలా 2013నుంచి మాల్దీవులు ప్రభుత్వం చ‌ర్య‌లు చేపట్టింది. త‌ద్వారా దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు కూడా మేలు జ‌రుగుతోంది. ఈ రంగంలో ఆ దేశం పెట్టుకున్న తొమ్మిది ముఖ్య‌మైన విధానాల్లో ఒక‌టి ప్రైవేటు రంగంలో పున‌ర్ వినియోగ శ‌క్తి ఉత్ప‌త్తిని ప్రోత్స‌హించ‌డం. 2023 నాటికి త‌మ దేశ శ‌క్తి వినియోగంలో 20శాతం పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల‌నుంచి వ‌చ్చేలా ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. 

 

****


(Release ID: 1676961)