ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన దినోత్సవం

మరణానంతర అయయవదానంపై ప్రతిన బూనిన 79,572మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రశంసలు

12,666 అవయవ మార్పిడి చికిత్సలతో దేశం ప్రపంచంలోనే 3వ స్థానం సాధించినందుకు నోట్టో సంస్థకు అభినందనలు

దేశంలో మరణానంతర అవయవదానంపై కోవిడ్ భారీగా ప్రతికూల ప్రభావం చూపిందని వెల్లడి

తమిళనాడులో 76 ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స పొందిన రోగుల్లో ఎక్కువ మంది కోవిడ్ బాధితులే

Posted On: 27 NOV 2020 5:40PM by PIB Hyderabad

జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ రోజు జరిగిన పలు కార్యక్రమాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. అవయవదానంపై కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సి.ఆర్.పి.ఎఫ్.) జవాన్లలో అవగాహనకోసం 2020 నవంబరు 14న ప్రారంభించిన స్వచ్ఛంద కార్యక్రమం ముగింపు సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను ఉద్దేశించి మంత్రి హర్షవర్ధన్ ప్రసంగించారు. దాదాపు మూడున్నల లక్షలమంది సి.ఆర్.పి. జవాన్లలో అవగాహనకోసం జాతీయ వైద్య విజ్ఞాన అధ్యయన సంస్థ (ఎయిమ్స్-ఎ.ఐ.ఐ.ఎమ్.ఎస్.), ఆర్గాన్ రిట్రైవల్ బ్యాంకింగ్ సంస్థ (ఒ.ఆర్.బి.ఒ.)ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  

 

   ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, సి.ఆర్.పి.జవాన్లు పాల్గొన్న ఈ కార్యక్రమం,.. చివరి జవానువరకూ సానుకూల సందేశం అందించేందుకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. 'అంగదన్ యుద్ధవీరులు'గా సి.ఆర్.పి.ఎఫ్. ధ్రువీకరించిన 79,572మంది సైనికులు తమ మరణానంతరం తమ కళ్లు, చర్మం, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, పాంక్రియాస్, మూత్రపిండాలు, గుండె కవాటాలు, అన్నవాహికల దానం చేయడానికి ప్రతిజ్ఞాపత్రాలను భర్తీ చేసినట్టు గుర్తించామని కేంద్రమంత్రి చెప్పారు.

 

   అవయవాలు సరిగా పనిచేయకపోవడంవల్లనే దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని,  అసలు అవసరమైన అవయవాలు అందుబాటులో లేక ప్రతి ఏడాదీ 5లక్షలమంది మరణిస్తున్నట్టు జాతీయ ఆరోగ్య వెబ్ పోర్టల్ పేర్కొన్నదని కేంద్రమంత్రి చెప్పారు. అవయవదానం వంటి పవిత్ర కార్యక్రమంలో వయస్సు, కులం, మతం, వర్గం, విశ్వాసం వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆటంకాలు కాకూడదని భావిస్తున్నట్టు చెప్పారు. పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తి అవయవం దానం చేయాలని అనుకుంటే, తన తల్లిదండ్రుల, లేదా సంరక్షకుల అనుమతితో ఆ పనిచేయవచ్చన్నారు. అవయదానంపై జనంలో ఉన్న భయం తొలిగిపోయేలా, వెబినార్లు, సెమినార్లు, చర్చాగోష్టులతో తగిన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యంకావాలని మంత్రి అన్నారు.

 

జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు ధోరణులు, మధ్య భారతావనిలో వామపక్ష తీవ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కొనడంలో, జాతీయ స్థాయి, రాష్ట్రాల స్థాయి ఎన్నికలను నిష్పాక్షికంగా, సమర్థంగా నిర్వహించడంలో సి.ఆర్.పి.ఎఫ్. జవాన్ల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. సి.ఆర్.పి.ఎఫ్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎ.పి. మహేశ్వరి, ఎయిమ్స్ (న్యూఢిల్లీ) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ సింగ్ గులేరియా, ఒ.ఆర్.బి.ఒ. చీఫ్ ఫ్రొఫెసర్ ఆరతీ విజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సి.ఆర్.పి.ఎఫ్. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ భరత్ భూషణ్ వైద్ కూడా హాజరయ్యారు.

  ఆ తర్వాత, జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (నోట్టో-ఎన్.ఒ.టి.టి.ఒ.) ఆధ్వర్యంలో కూడా 11వ జాతీయ అవయవ దాన దినోత్సవం జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో నోట్టో నిర్వహిస్తున్న పాత్రను, ప్రాంతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో నోట్టో అనుబంధ సంస్థల అందించే సేవలను కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు. మరణించిన దాతల అవయవాలను భద్రంగా సేకరించడం, అవసరమైన వారికి వాటిని సకాలంలో అందించడం తదితర కార్యక్రమాలకోసం ఆసుపత్రులు, కణజాల మార్పిడి బ్యాంకులతో ఒక వ్యవస్థను నిర్వహించడంలో ఈ సంస్థల పాత్ర ఎంతో ప్రశంసనీయమని హర్షవర్ధన్ అన్నారు.

 

   “అవయవదానం, కణజాల మార్పిడికి సంబంధించి దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య ప్రాంతాలకు సేవలందించేందుకు చండీగఢ్, కోల్కతా, ముంబై, చెన్నై, గువాహటి ప్రాంతాల్లో ఐదు ప్రాంతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఆర్.ఒ.టి.టి.ఒ.)లను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దీనికితోడు, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, జమ్ము కాశ్మీర్, హర్యానా, గుజరాత్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, బీహార్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 12 రాష్ట్రస్థాయి అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎస్.ఒ.టి.టి.ఒ.)లు కూడా ఏర్పాటయ్యాయి.” అని అన్నారు.

   అవయవ దానంపై ప్రతిజ్ఞా పత్రాన్ని ఆన్ లైన్ ద్వారా సులభంగా భర్తీ చేసే సదుపాయం నోట్టో వెబ్ సైట్ (www.notto.gov.in)  ద్వారా అందుబాటులోకి వచ్చిందని మంత్రి చెప్పారు. కోవిడ్-19 వ్యాప్తి సంక్షోభం నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా అవయవ దానం చేయడానికి పౌరులు ఈ వెబ్ సైట్ ను సందర్శించవచ్చని,, నోట్టో సంస్థకు చెందిన ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ పేజీలను కూడా సంప్రదించవచ్చని సూచించారు.

  అవయవ దానం, అవయవ మార్పిడికి సంబంధించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) వెబ్ సైట్ సమాచారం ప్రకారం 2019లో దేశంలో 12,666 అవయమార్పిడి చికిత్సలు జరిగాయని, ప్రపంచంలో ఇది 3వ ర్యాంక్ కావడం సంతోషదాయకమని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఆరోగ్య రక్షణ నిపుణులు అందించిన సేవలను ప్రతి దశలోనూ ప్రోత్సహించాల్సి ఉందని అన్నారు. ప్రజల్లో అవయవదానంచేసే ధోరణి పెరిగేందుకు ఇది దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ప్రాంతీయస్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో మరిన్ని అవయవ, కణజాల మార్పిడి సంస్థలను ఏర్పాటు కోసం జాతీయ అవయవ మార్పిడి పథకం (ఎన్.ఒ.టి.పి.) ఆర్థిక సహాయం అందస్తుందన్నారు. అవయవ మార్పిడి చికిత్సా కేంద్రాల స్థాయి నవీకరణకు, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో బయోమెటీరియల్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ మార్పిడి చికిత్స చేయించుకున్న దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద రోగుల రోగనిరోధక శక్తిని పెంపెందించే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కూడా ఎన్.ఒ.టి.పి. దోహదపడుతుందన్నారు.

  మరణించిన వారి అవయదానంపై కోవిడ్-19 మహమ్మారి భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపిందని మంత్రి అన్నారు. “భారతీయ అవయవదాన దినోత్సవం వంటి జాతీయ కార్యక్రమాలను,. ఆరోగ్యరక్షణకు, మానవాళికి మరణించిన వ్యక్తులు అందిస్తున్న సార్థరహిత సేవలుగా మనం గుర్తిస్తున్నాం”. అని ఆయన అన్నారు. పలువురి జీవితాల్లో తిరిగి వెలుగులు నింపిన  వివిధ రాష్ట్రాల ఆవయవ దాతల పేర్లను మంత్రి పేరుపేరునా చదవి వినిపించారు.

 కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మాట్లాడుతూ, శరీరం పంచభూతాల సమాహారమని, మరణంతో అది తిరిగి ప్రకృతిలోనే కలిసిపోతుందని, హిందూ శాస్త్రాల ప్రకారం మరణానంతరంకూడా  శారీరక భాగాలతో కలసి ఉండాలనుకోవడం వట్టి భ్రమ మాత్రమేనని అన్నారు. మరణానంతరం దాతల శరీరంనుంచి అవయవాలను సేకరించడం, వాటిని అవయవ మార్పిడి చేయించడం వంటి కార్యకలాపాల్లో మెరుగైన సమన్వయంకోసం జాతీయ డిజిటల్ పోర్టల్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.

 

   దేశం పశ్చిమ ప్రాంతానికి చెందిన ప్రాంతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ,..దేశంలోనే ఉత్తమ సంస్థగా గుర్తింపు పొందింది. తమిళనాడుకు చెందిన రాష్ట్రస్థాయి అవయవ, కణజాల మార్పిడి సంస్థ ఉత్తమ సంస్థగా అవార్డుకు ఎంపికైంది. తమిళనాడులో భారీ ఎత్తున ఏకంగా 295 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. వాటిలో 76 చికిత్సలు కోవిడ్ బాధితుల ఊపిరి  తిత్తుల మార్పిడికి సంబంధించినవే ఉన్నాయి. అవయయ మార్పిడికి సంబంధించి, చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్య, పరిశోధనాసంస్థ (పి.జి.ఐ.ఎం.ఇ.ఆర్.) ఉత్తమ ఆసుపత్రిగా ఎంపికైంది.

పశ్చిమ ప్రాంతానికి చెందిన అవయవ, కణజాల మార్పిడి సంస్థకు లభించిన విశేష గుర్తింపుపట్ల మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే, తమిళనాడు సంస్థ తరఫున ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. విజయ భాస్కర్ సంతోషం వ్యక్తంచేశారు. అవయ మార్పిడితో ప్రయోజనం పొందిన వారు తమ అనుభవాలను వివరిస్తూ, అయయవ దాతలకు తమ కృతజ్ఞతలు తెలిపారు. తమలాగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతరులను అవయవదానం ద్వారా ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం చివర్లో కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అందరిచేత అవయవదాన ప్రతిన చేయించారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

************



(Release ID: 1676630) Visitor Counter : 263