రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కోవిడ్ -19 కార‌ణంగా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్వ‌హ‌ణ‌లో చేప‌ట్టిన చ‌ర్య‌లతో వెలుగులోకి వ‌స్తున్న సృజ‌నాత్మ‌క విధానాలు : రాష్ట్ర‌పతి శ్రీ కోవింద్‌

సుప్రీంకోర్టు రాజ్యాంగ దినోత్స‌వ సంబరాల‌ను విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి.

Posted On: 26 NOV 2020 7:44PM by PIB Hyderabad

రాజ్యాంగ దినోత్స‌వ ( నవంబ‌ర్ 26, 2020) సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌ప‌తి శ్రీ రామ్ నాధ్ కోవింద్ విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ప్రారంభించారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకొని  ఈ న‌వంబ‌ర్ 26కు 71 ఏళ్లు అవుతుంది. ఆ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఆధ్వ‌ర్యంలో సంబ‌రాలు నిర్వ‌హించారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన రాష్ట్ర‌ప‌తి... క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో సుప్రీంకోర్టు ప‌ని చేసిన విధానాన్ని ప్ర‌శంసించారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌, ఎల‌క్ట్రానిక్ ఫైలింగ్ లాంటి విధానాలు ప్ర‌వేశ‌పెట్టి సాంకేతిక ప‌రిష్కారాల‌ద్వారా కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించి న్యాయ‌ప్ర‌క్రియ స‌జావుగాసాగేలా చూశార‌ని కితాబిచ్చారు. అంద‌రికీ న్యాయం క‌ల‌గ‌జేయాల‌నే ల‌క్ష్యంతో బార్‌, బెంచ్‌, ఇంకా ఇత‌ర అధికారులు అంద‌రూ క‌లిసి క‌రోనా వైర‌స్ పై పోరాటం చేస్తూ త‌మ విధుల‌ను నిర్వ‌హించార‌ని రాష్ట్ర‌ప‌తి త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో చేప‌ట్టిన చ‌ర్య‌లద్వారా సృజ‌నాత్మ‌కంగా ఆలోచించి ప్ర‌జ‌ల‌కు న్యాయం అంద‌డానికి వీలుగా ప‌ని చేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు. 
ఉన్న‌త‌మైన ప్ర‌మాణాల‌కు, మ‌హోన్న‌త ఆద‌ర్శాల‌కు మ‌న సుప్రీంకోర్టు ప్ర‌సిద్ధి చెందింద‌ని రాష్ట్ర‌ప‌తి స్ప‌ష్టం చేశారు. సుప్రీంకోర్టు ప‌లు సంద‌ర్భాల్లో ఇచ్చిన విశిష్ట‌మైన తీర్పులు దేశంలోని న్యాయ వ్య‌వ‌స్థ‌ను, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేశాయ‌ని ఆయ‌న అన్నారు. మ‌న బెంచ్‌, బార్ అనేవి మేధస్సులోను, న్యాయ‌ప‌ర‌మైన పాండిత్యంలోను పేరు గ‌డించాయ‌ని ఆయ‌న అన్నారు. న్యాయ వ్య‌వ‌స్థ రక్ష‌ణ‌లో సుప్రీంకోర్టు ఒక గార్డులాగా ఎప్ప‌టికీ త‌న క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హిస్తూనే వుంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
భార‌త రాజ్యాంగ డాక్యుమెంట్ పొడ‌వైన‌ద‌ని, కానీ అది స‌మ‌స్య కాద‌ని అందులోని అంశాలు ఎంతో గొప్ప‌వ‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు. రాజ్యాంగ ప్ర‌వేశిక స్ఫూర్తిని ఆయ‌న త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. కేవ‌లం 85 ప‌దాల్లోనే స్వాతంత్ర్య స‌మరానికి కార‌ణ‌మైన విలువ‌ల్ని, స్వాతంత్ర్యానికి కార‌ణ‌మైన మ‌హానుభావుల దార్శ‌నిక‌త‌ను, ప్రతి భార‌తీయుని క‌ల‌ల్ని ఆకాంక్ష‌ల్ని ప్ర‌వేశిక‌లో చూడ‌వ‌చ్చ‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు. ప్ర‌స్తుతం మ‌న ముందున్న క‌ర్త‌వ్యం ప్ర‌వేశిక‌లోని ఆ విలువ‌ల్ని మ‌న జీవితంలో భాగం చేసుకోవ‌డ‌మేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పౌరులంద‌రికీ సామాజిక‌, ఆర్దిక‌, రాజ‌కీయ న్యాయం జ‌రిగేలా చూడాల‌ని ప్ర‌వేశిక చెబుతోందని రాష్ట్ర‌ప‌తి అన్నారు. అంద‌రికీ న్యాయం జ‌రిగిన‌ప్పుడే న్యాయ‌వ్య‌వ‌స్థ సంర‌క్ష‌ణ జ‌రుగుతుంద‌ని అన్నారు. 
ప్ర‌జా జీవితంలో ఎలా న‌డుచుకోవాల‌నేదానిపైన దేశ మొద‌టి రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ చెప్పిన గొప్ప మాట‌ల‌ను ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ‌నాధ్ కోవింద్ ప్ర‌స్తావించారు. అభినంద‌న‌లు స్వీక‌రించ‌డానికి ప‌ద‌వీ ప్రమాణ స్వీకార స‌మ‌యం స‌రైనది కాదు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన స‌మ‌యంలో...మ‌నం ఆ ప‌ద‌వికి ఎంత వ‌న్నె తెచ్చామో తెలుపుతూ వ‌చ్చే అభినంద‌న‌ల స్పంద‌నే అస‌లైన‌ద‌ని డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ చెప్పిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి శ్రీకోవింద్‌ గుర్తు చేశారు. రాజ్యాంగప‌రైమ‌న ప‌ద‌వుల్లో వున్న‌వారు రాజేంద్ర‌ప్ర‌సాద్ చూపిన మార్గాన్ని ఆద‌ర్శంగా తీసుకొని త‌మ త‌మ‌ రాజ్యాంగ విధుల‌ను నిర్వ‌హించాల‌ని అంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌కంగా నిల‌వాల‌ని, రాగ‌ద్వేషాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. ప‌ద‌వీ బాధ్య‌తల నిర్వ‌హ‌ణ ప‌ట్ల శ్రీ రాజేంద్ర ప్ర‌సాద్ చెప్పిన మాట‌లు మ‌నంద‌రికీ వ‌ర్తిస్తాయ‌ని రాష్ట్ర‌పతి శ్రీ కోవింద్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత‌ల ఆద‌ర్శాలకు అనుగుణంగా న‌డుచుకుందామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

 

****


 



(Release ID: 1676408) Visitor Counter : 198