ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్.. పీఎం-జేఏవై.. నేషనల్ డిజిటల్ హెల్త్మిషన్ (ఎన్డీహెచ్ఎం) అమలుపై డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష
Posted On:
26 NOV 2020 5:35PM by PIB Hyderabad
ప్రతిష్టాత్మక ప్రజారోగ్య సంరక్షణ పథకాలైన ‘ఆయుష్మాన్ భారత్… ప్రధానమంత్రి-జనారోగ్య యోజన (ఏబీ.. పీఎం-జేఏవై), నేషనల్ డిజిటల్ హెల్త్మిషన్ (ఎన్‌డీహెచ్‌ఎం)లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం కోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ)ని సందర్శించారు. రెండు పథకాల అమలుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రి అనేకమంది అధికారులతో చర్చిస్తూ ముఖ్యమైన అన్ని అంశాలపైనా పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ- మొత్తం 130 కోట్లమంది పౌరులకు ఎక్కడైనా, ఎప్పుడైనా అవసరం మేరకు సకాలంలో- చౌకగా, సురక్షిత ఆరోగ్య సంరక్షణ అందుబాటును విస్తరిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారి దార్శనిక నాయకత్వాన “ది నేషనల్ డిజిటల్ హెల్త్‌మిషన్” ప్రారంభించబడిందని చెప్పారు. దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య పర్యావరణాన్ని సృష్టించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను ఎన్‌డీహెచ్‌ఎం డిజిటలీకరిస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యవస్థవల్ల రోగులు తమ ఆరోగ్య రికార్డులను భద్రంగా, అందుబాటులో ఉంచుకోవడంతోపాటు తమ సమ్మతితో తాము కోరుకున్న ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, డాక్టర్లతో వాటిని పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కాగా- జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) సీఈవో డాక్టర్ ఇందుభూషణ్ ‘ఎన్‌డీహెచ్‌ఎం’లో కీలకమైన “హెల్త్ ఐడీ, డిజిడాక్టర్, హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ, ఈహాస్పిటల్, పేషెంట్ హెల్త్ రికార్డ్స్, కన్సెంట్ మేనేజర్”వంటి వ్యవస్థల పనితీరును సీనియర్ అధికారుల సమక్షంలో మంత్రికి సచిత్రంగా చూపారు.
అనంతరం తాను పరిశీలించిన అంశాలపై తన అభిప్రాయాలను డాక్టర్ వర్ధన్ వారితో పంచుకుంటూ- “నేనివాళ ఎన్‌డీహెచ్‌ఎంను సమీక్షించిన నేపథ్యంలో- ఈ పథకం ప్రయోగాత్మక దశలోనే కేవలం మూడు నెలల్లో 6 కేంద్రపాలిత ప్రాంతాలు… అండమాన్-నికోబార్, చండీగఢ్, దాద్రా-నాగర్‌హవేలీ-దమన్/దయ్యూ, లదాఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరిలకు విస్తరించి గణనీయ పురోగతి సాధించడం, త్వరలోనే దేశమంతటా అమలుకు సిద్ధం అవుతుండటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో పౌరులు-ప్రజారోగ్య రంగంలోని వైద్యుల దృక్కోణం నుంచి వ్యక్తిగత గోప్యత, భద్రతతో కూడిన రక్షణ ఉంటుంది. ఆ మేరకు సమ్మతి ప్రాతిపదికన డాక్టర్లు-రోగుల మధ్య ‘పరీక్ష నివేదికలు, స్కాన్లు, ప్రిస్క్రిప్షన్లు, రోగ నిర్ధారణ నివేదికల’ రూపేణా ఆరోగ్య సమాచార ఆదానప్రదానం విశ్వసనీయంగా సాగుతుంది. తద్వారా తదుపరి పర్యవేక్షణ సమయానుకూలంగా, సురక్షితంగా, నిరాటంకంగా కొనసాగుతుంది” అన్నారు.
“ఈ డిజిటల్ విభజన యుగంలో భారతీయుల జీవన వాస్తవాలను పూర్తి పరిగణనలోకి తీసుకోవడం ఈ ‘జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం’ (ఎన్‌డీహెచ్‌ఎం) కీలకాంశాలలో ఒకటి. ప్రజానీకంలో చాలామందికి స్మార్ట్ ఫోన్లు లేకపోయినప్పటికీ కోట్లాది పౌరులకు లేదా అనుసంధాన సమస్యలుగల మారుమూల గిరిజన ప్రాంతాలవారికి ‘ఎన్‌డీహెచ్‌ఎం’ తన ఆఫ్‌లైన్ మాడ్యూళ్ల ద్వారా ఆరోగ్య సంరక్షణ పొందగల వెసులుబాటు కల్పిస్తుంది” అని చెప్పారు. “ఆరోగ్య సంరక్షణ సమాచార లభ్యత మెరుగుద్వారా దేశంలో సమర్థ, ప్రభావశీల, పారదర్శక ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదానానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ఎన్‌డీహెచ్‌ఎం లక్ష్యం. విస్తృతశ్రేణి గణాంకాలు, సమాచారం, మౌలిక సేవల కల్పనద్వారా ఒక జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ సృష్టించబడుతుంది. ఇందుకోసం సార్వత్రిక, పరస్పర నిర్వహణపూర్వక, ప్రమాణ ఆధారిత డిజిటల్ వ్యవస్థల తోడ్పాటు ఉంటుంది. అదే సమయంలో వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి సంబంధించిన భద్రత, విశ్వసనీయత, వ్యక్తిగత గోప్యతలకు భరోసా కూడా లభిస్తుంది. మొత్తంమీద ‘హెల్త్ ఐడీ రూపకల్పనసహా డాక్టర్లు/ఆరోగ్య సంరక్షణ సంస్థలకు విశిష్ట గుర్తింపు, వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు, టెలి-మెడిసిన్, ఈ-ఫార్మసీ తదితరాలన్నిటి సమాహారంగా ఒక ‘జాతీయ డిజిటల్ ఆరోగ్య మౌలిక వ్యవస్థ’ను సృష్టించడమే ఎన్‌డీహెచ్‌ఎం ప్రధాన ధ్యేయం.
ఈ ఏడాది సెప్టెంబరు 23వ తేదీతో రెండేళ్లు పూర్తిచేసుకున్న ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై అమలుపైనా ఆరోగ్యశాఖ మంత్రి సమీక్షించారు. అనంతరం పథకం పురోగతిని అభినందించిన డాక్టర్ వర్ధన్- “ప్రస్తుత అనూహ్య పరిస్థితుల నడుమ ‘ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై’ కింద నిరుపేదలకు రూ.17,500 కోట్లకుపైగా విలువైన 1.4 కోట్ల చికిత్సలకు తోడ్పడినట్లు తెలుసుకుని నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రపంచ మహమ్మారి సవాలు విసిరిన వేళ, దేశంలో ఇతరత్రా తీవ్ర అనారోగ్యాలతో బాధపడేవారికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటుపై కేంద్ర ప్రభుత్వం ఎంతో జాగ్రత్త వహించింది. దీనివల్ల ప్రజలకు దాదాపు రూ.35,000 కోట్లు ఆదా అయ్యాయి. మహమ్మారి పరిస్థితుల నడుమ తీవ్ర అనారోగ్యంతో అత్యంత ఒత్తిడికి లోనవుతున్న లక్షలాది కుటుంబాలకు మద్దతు, భద్రత కల్పించడంలో ఈ ఆరోగ్య భరోసాద్వారా లభించే సేవలే అతిపెద్ద వనరులని మేం గ్రహించాం” అన్నారు.
ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జనారోగ్య యోజన (ఎబి-పీఎంజేఏవై) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి. దీనికింద ప్రతి కుటుంబానికీ ఎంపిక చేసిన ఆస్పత్రులలో ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు పొందడం కోసం ఏటా రూ.5 లక్షల వంతున సహాయం లభిస్తుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అర్హులైన 10.74 కోట్ల కుటుంబాలకు (సుమారు 50 కోట్లమంది లబ్ధిదారులు) ఆరోగ్య సేవలు లభిస్తున్నాయి. తదనుగుణంగా సేవాప్రదాన ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో లబ్ధిదారులకు నగదురహిత, పత్రాలతో నిమిత్తంలేని సేవలను పీఎం-జేఏవై అందుబాటులో ఉంచింది. ఈ పథకం కింద వివిధ ఆరోగ్య లబ్ధి ప్యాకేజీల రూపంలో నిర్దిష్ట ధరలతో 1,592 రకాల వైద్య చికిత్సలు లభిస్తాయి. లబ్ధిదారులకు చక్కని ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం కోసం దేశవ్యాప్తంగా 24,000కుపైగా ఆస్పత్రులతోపాటు ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాన సంస్థలు నమోదు చేయబడ్డాయి.
ఏబీ-పీఎంజేఏవై కింద (26/11/2019నాటికి) ప్రగతి:
- ప్రస్తుతం 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పీఎం-జేఏవైని అమలు చేస్తున్నాయి
- ఆస్పత్తులలో ప్రవేశాలు = 1.4 కోట్లు
- ప్రవేశాలపై ఆమోదించిన చెల్లింపుల మొత్తం = రూ.17,535 కోట్లు
- వైద్య సేవలందించే ఆస్పత్రుల సంఖ్య = 24,653 (ప్రభుత్వ, ప్రైవేట్ నిష్పత్తి = 54:46)
- జారీచేసిన ఇ-కార్డులు = 12.7 కోట్లు
- బదిలీచేసిన కేసులు = 1.5 లక్షలు
- ప్రతి నిమిషం ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య =14
- ప్రతి నిమిషం ధ్రవీకరణ పొందే లబ్ధిదారుల సంఖ్య = 13
- రోజువారీగా నమోదవుతున్న ఆస్పత్రుల సంఖ్య = 8
***
(Release ID: 1676325)
Visitor Counter : 263