మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వర్చువల్ విధానంలో "ఎన్‌పవరింగ్ త్రూ జీరో-శూన్య సే శశక్తికరన్" సదస్సులో ప్రసంగించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ విద్యావిధానాన్ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రశంసించడంతో పాటు విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రిని అభినందించింది.

పాఠ్యాంశాల బోధన మరియు విద్యా సంస్కరణలపై ఎన్‌ఈపి-2020 దృష్టి పెడుతుంది: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం

Posted On: 25 NOV 2020 4:22PM by PIB Hyderabad

2020 నవంబర్ 24 న శ్రీ అరబిందో సొసైటీ నిర్వహించిన 'జీరో- శూన్య సే శశక్తికరన్ ద్వారా సాధికారత' అనే వర్చువల్ జాతీయ సదస్సులో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రసంగించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వినూత్న పద్ధతుల్లో సేవలందించిన 40 మందికి పైగా విద్యాశాఖాధికారులను, 26 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో డిజిటల్ విధానంలో శ్రీ పోఖ్రియాల్ సత్కరించారు.  'ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ కేస్‌బుక్ - కోవిడ్ ఎడిషన్' ను కూడా మంత్రి ప్రారంభించారు. విద్యాశాఖాధికారులు మరియు ఉపాధ్యాయుల వినూత్న ప్రయత్నాలు, ప్రయోగాలు ఈ ఈ-పుస్తకంలో ఉంటాయి.

శ్రీ అరబిందో ఘోష్‌ను గుర్తుచేసుకుంటూ శ్రీ పోఖ్రియాల్..భారతదేశం యొక్క విద్యా వారసత్వాన్ని, అద్భుతమైన గతాన్ని పునరుద్ఘాటించారు. ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలైన నలంద మరియు తక్షశిలలు భారత్‌లో అభివృద్ధి చెందాయని  ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులను ఆ విశ్వవిద్యాలయాలు 'వసుదైక కుటుంబకం' నినాదంతో ఆహ్వానించాయని తెలిపారు.

ఈ దేశ విద్యా చరిత్రలో ఎన్‌ఇపి 2020 అత్యంత సమగ్రమైన, భవిష్యత్‌ విధానమని కేంద్ర మంత్రి అన్నారు. పిల్లల సామర్థ్యాలు, నైపుణ్యాలు మరియు విమర్శనాత్మక ఆలోచనల అభివృద్ధిపై దృష్టి సారించిన ఎన్‌ఇపి..కొత్త  భారత్‌కు పునాది వేసిందని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలనే సంకల్పంతో ప్రజలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'ఆత్మనిర్భర్ భారత్' మరియు 'ఏక్ భారత్ శ్రేష్ఠ్‌ భారత్' వంటి కార్యక్రమాలను ప్రారంభించినందుకు నిర్వాహకులను శ్రీ పోఖ్రియాల్‌ను అభినందించారు. విద్యారంగంలో భారతదేశ పాత్రను శ్రీ పోఖ్రియాల్ సారధ్యం మరింత ముందుకు తీసుకువెళ్తుందని నిర్వాహకులతో పాటు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రతినిధి మిస్టర్ రాడ్ స్మిత్ ఆకాంక్షించారు.

భారతదేశ విద్య చరిత్రపై కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్‌ గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రాడ్ స్మిత్ మాట్లాడుతూ " విద్య మరియు పరిశోధనలు ప్రపంచంలోనే ముఖ్యమైన సాధనాలు.  భారతదేశ విద్యా వ్యవస్థకు సుదీర్ఘమైన మరియు విశిష్టమైన చరిత్ర ఉంది.  ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం క్రీ.పూ 700 లో స్థాపించబడింది. ఆసియాలో మొదటి మరియు పురాతన మహిళల కళాశాల కోల్‌కతాలో స్థాపించబడింది.  త్రికోణమితి, కాలిక్యులస్ మరియు బీజగణితానికి సంబంధించిన అధ్యయనాలు భారతదేశంలోనే పుట్టాయని" చెప్పారు.

ప్రపంచంలో ప్రముఖ విశ్వవిద్యాలయమైన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం భారతదేశ జాతీయ విద్యా విధానాన్ని ప్రశంసించింది. సమర్ధవంతమైన విద్యావ్యస్థను నిర్మించడానికి తీసుకువచ్చిన విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ను అభినందించింది. జాతీయ విద్యా విధానం 2020 ద్వారా సుస్థిర విద్యపై చేసిన నిబద్ధతకు కృషిచేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఆయన ప్రశంసించారు.

గత ఏడు దశాబ్దాలుగా భారతదేశం ఎక్కువగా విద్యావ్యవస్థ సంస్కరణలపై దృష్టి పెట్టిందని ఆయన అన్నారు.  ఇటీవల ప్రారంభించిన ఎన్‌ఈపి-2020 ద్వారా ప్రస్తుతం పాఠ్యాంశాలు, బోధన సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. బట్టి పద్దతిని పక్కన పెట్టి విద్యా వ్యవస్థను నిజమైన అవగాహన వైపు నడిపించడానికి ఇది దోహద పడుతుందని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన మరియు ఉన్నతమైన విద్యావ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కేంబ్రిడ్జ్ పార్టనర్‌షిప్ ఫర్ ఎడ్యుకేషన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయి.


 

******



(Release ID: 1676000) Visitor Counter : 115