ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ నవజాత శిశువుల వారోత్సవాలు

శిశు మరణాల తగ్గింపు లక్ష్యం

నవజాత మరణాలను తగ్గించడానికి మాజీ ప్రధాని వాజపేయి సేవలను ప్రశంసించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
' జన్మించిన ప్రతి శిశువు జీవించి పెరగాలి'

' నవజాత మరణాలను సాధ్యమంతగా తగ్గించాలి'..... హర్షవర్ధన్

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2020 4:08PM by PIB Hyderabad

జాతీయ నవజాత శిశువుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. నవజాత శిశువుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య రంగంలో ​ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏడాది నవంబర్ 15 వ తేదీ నుంచి 22వ తేదీవరకు వారంరోజులపాటు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఏడాది ఈ వారోత్సవాలను ' నవజాత శిశువులకు ప్రతి ప్రాంతంలో నాణ్యమైన, సమానమైన ఆరోగ్య సేవలు' అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ ' ప్రపంచంలో తొలిసారిగా నవజాత శిశువుల మరణాలను అరికట్టి సాధ్యమైనంతగా తగ్గించడానికి భారతదేశం 2014లో నవజాత శిశువుల కార్యాచరణ పథకాన్ని ప్రారంభించింది' అని అన్నారు.

నవజాత శిశువుల ఆరోగ్యానికి మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికలను అమలు చేశారని మంత్రి తెలిపారు. వాజపేయి తీసుకున్న నిర్ణయాల వల్ల నవజాత శిశువుల మరణాల శాతం తగ్గిందని ఆయన అన్నారు. వాజపేయి ఆశయాల మేరకు నవజాత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. వాజపేయి రూపొందించిన పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ కాలానుగుణంగా వీటిలో మార్పులు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు,

దేశంలో నవజాత మరణాలు తగ్గాయని తెలిపిన మంత్రి ఒక్క శిశువు చనిపోయినా ఆ కుటుంబానికి కడుపుకోత మిగులుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ' జన్మించిన ప్రతి శిశువు జీవించి పెరిగి సమాజానికి ఉపయోగపడి దేశాభివృద్ధిలో పాల్గొనేలా చేసే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి అన్నారు. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపిన మంత్రి ' నవజాత శిశువు ఆరోగ్యపరమైన ఏ చిన్న సమస్యను ఎదుర్కొకోకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం' అని స్పష్టం చేశారు. నవజాత శిశువులకు పౌష్టిక ఆహరం అందేలా చూడడానికి పోషన్ అభియాన్ పధకం కింద అన్ని చర్యలను తీసుకుంటున్నదని మంత్రి చెప్పారు.

ప్రభుత్వపరంగా అమలు జరుగుతున్న చర్యలను వివరించిన మంత్రి ' మరణాలను తగ్గించడానికి అన్ని చర్యలను తీసుకోవాలి' అని అధికారులను ఆదేశించారు. 2017 వరకు నిర్ణయించిన ప్రధాన లక్ష్యాలను సాధించామని తెలిపిన మంత్రి నవజాత మరణాలను 24కి తగ్గించామని అన్నారు. 2020 నాటికి ఈ సంఖ్య 19కి తగ్గాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో నవజాత మరణాలు 100లో 23గా ఉన్నాయని సర్వేలలో వెల్లడయింది వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి నవజాత వారోత్సవాలపై మరింత అవగాహన కల్పించి, ఆలోచనా సరళిలో మార్పు తీసుకుని రాడానికి రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకోసం రూపొందించిన శిక్షణా కార్యక్రమాలను కూడా మంత్రి ప్రారంభించారు. శిశు మరణాలను అరికట్టే అంశంలో సహకరిస్తున్న ఇండియన్ అసోసియేషన్ అఫ్ పేడియాట్రిక్స్, నేషనల్ నియో నాటాలజి ఫోరమ్, ఫెడరేషన్ అఫ్ ఒబెస్ట్ట్రిక్,కళావతి శరన్ ఆస్పత్రి, యూనిసెఫ్ , బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తదితర సంస్థలను మంత్రి అభినందించారు.

***

 

 

 


(రిలీజ్ ఐడి: 1674568) సందర్శకుల సూచీ సంఖ్య : : 227
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil