ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్ ,లక్సెంబర్గ్ దేశాల మధ్య వర్చువల్ ద్వైపాక్షిక సదస్సులో ప్రధాని ప్రారంభ వ్యాఖ్యల ప్రసంగ పాఠం

Posted On: 19 NOV 2020 6:01PM by PIB Hyderabad

ఎక్సలెన్సీ , నమస్కారం !

మొట్టమొదట, COVID-19 మహమ్మారి వల్ల  లక్సెంబర్గ్ లో ప్రాణాలు కోల్పోయిన వారికి , నా తరపున ,  130 కోట్ల మంది భారత ప్రజల తరఫున నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ నైపుణ్యం కలిగిన నాయకత్వాన్ని కూడా  నేను అభినందిస్తున్నాను.

ఎక్సలెన్సీ ,

నేటి వర్చువల్ సదస్సు నా దృష్టిలో చాలా ముఖ్యమైనది. మీరు , నేను వివిధ అంతర్జాతీయ వేదికలలో చాలా సార్లు సమావేశమవుతున్నాము, అయితే ఇది గత రెండు దశాబ్దాలలో భారత్,  లక్సెంబర్గ్ దేశాల  మధ్య జరుగుతోన్న మొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం.


ఈ రోజు ప్రపంచం కోవిడ్ -19 మహమ్మారి కి సంబంధించిన ఆర్ధిక, ఆరోగ్య సవాళ్లతో ముడిపడి  ఉంది , భారత్ –లక్సెంబర్గ్ దేశాల భాగస్వామ్యం రెండు దేశాలతో పాటు రెండు ప్రాంతాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యం, చట్ట పాలన, స్వేచ్ఛ వంటి ఉమ్మడి ఆదర్శాలు మన సంబంధాలను, పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తాయి. భారత్, లక్సెంబర్గ్ దేశాల మధ్య ఆర్థిక మార్పిడులను పెంపొందించే సామర్థ్యం చాలా ఉంది. 

మనం ఇప్పటికీ ఉక్కు, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ డొమైన్ వంటి రంగాలలో మంచి సహకారం కలిగి ఉన్నాము - కాని దానిని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం మా అంతరిక్ష సంస్థ లక్సెంబర్గ్ కి చెందిన  నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించినందుకు నేను సంతోషిస్తున్నాను. అంతరిక్ష రంగంలో కూడా మనం పరస్పర మార్పిడిని పెంచుకోవచ్చు. 

అంతర్జాతీయ సౌర కూటమి - ISA లో లక్సెంబర్గ్ చేరిన ప్రకటనను మేము స్వాగతిస్తున్నాము. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమిలో చేరాలని మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను.

ఈ ఏడాది ఏప్రిల్‌లో  జరగాల్సిన రాయల్ హైనెస్ గ్రాండ్ డ్యూక్ భారత పర్యటన COVID-19 కారణంగా వాయిదా పడింది. త్వరలో వారిని భారతదేశానికి స్వాగతించాలని కోరుకుంటున్నాము. మీరు కూడా త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని నేను కోరుకుంటున్నాను.

ఎక్సలెన్సీ,

ఇప్పుడు, మీ ప్రారంభ వ్యాఖ్యలకై నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

***


(Release ID: 1674230) Visitor Counter : 187