ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుందాం : కోవిడ్-19 సందర్భంగా వచ్చిన అవకాశాన్ని 2025 నాటికి దేశం నుంచి టిబిని పారదోలేందుకు ఎలా మార్చుకోవచ్చునో వివరించిన డాక్టర్ హర్షవర్ధన్
"టిబిని నిర్మూలించడానికి మనం వ్యూహాత్మక లక్ష్యం, ఆలోచనాపరుల నాయకత్వం, సరికొత్త ఆలోచనా ధోరణులతో ముందుకు వచ్చే సామాజిక ఎంటర్ ప్రెన్యూర్లు, శక్తివంతమైన సమాజం, రాజకీయ భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమం చేపట్టాలి"
Posted On:
18 NOV 2020 8:20PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్టాప్ టిబి పార్టనర్ షిప్ బోర్డు 33వ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.
కోవిడ్-19 అంటువ్యాధుల నివారణ విషయంలో దశాబ్దాలు కాకపోయినా కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకుపోయిందని చెబుతూ “ఎన్నో దశాబ్దాలుగా మనం ప్రాణాంతకమైన వైరస్ లపై ఎంతో శ్రమతో సాధించిన విజయాన్ని దెబ్బ తీసింది. టిబి వంటి ఎన్నో ప్రాణాంతక అంటు వ్యాధుల నుంచి శాస్త్రవేత్తల దృష్టిని మరలించింది. లాక్ డౌన్లు రోగులకు దాటడానికి వీలు లేని అవరోధాలు కల్పించాయి. ప్రజలు ఇప్పటికీ కరోనా వైరస్ భయంలోనే జీవితాలు వెళ్లబుచ్చుతున్నారు. గత 10 నెలలుగా మనం చికిత్సల్లో అవరోధాలు గమనించాం, ఔషధాల లభ్యతకు కూడా అంతరాయం కలిగింది, డయాగ్నస్టిక్ సేవలు నిలిచిపోయాయి. వ్యాధుల గుర్తింపు, నిర్ధారణలో జాప్యం జరిగింది. సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగింది. తయారీ సామర్థ్యాలన్నీ దారి మళ్లాయి. వైద్య చికిత్సల కోసం సుదూర ప్రాంతాలు తిరిగే రోగులకు భౌతిక అవరోధాలు ఏర్పడ్డాయి” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా వివిధ దేశాలను సంప్రదిస్తూ టిబి నిర్మూలన కార్యక్రమాలను అమలు పరుస్తున్న స్టాప్ టిబి పార్టనర్ షిప్ ను అభినందిస్తూ స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా నిర్దేశించిన అంతర్జాతీయ లక్ష్యం 2030 నాటికి బదులుగా ఐదేళ్లు ముందుగానే అంటే 2025 నాటికే టిబిని నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన “టిబి హరేగా, దేశ్ జీతేగా” ప్రచారోద్యమం గురించి వివరించారు. టిబి ప్రకటనల కృషిని భారత్ మూడు రెట్లు చేసిందని, “మిస్సింగ్ మిలియన్ టిబి కేసెస్” లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించిందని చెప్పారు.
కోవిడ్ కారణంగా ఏర్పడిన వెనుకబాటు గురించి ప్రస్తావిస్తూ “2020 జనవరి-అక్టోబర్ నెలల మధ్య కాలంలో కేవలం 14.5 లక్షల టిబి కేసులను మాత్రమే గుర్తించి ప్రకటించడం జరిగింది. 2019లో ఇదే సమయంతో పోల్చితే ఇది సగటున 29 శాతం తక్కువ. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, గోవా వంటి కొన్ని రాష్ర్టాల్లో ఈ క్షీణత 35-40 శాతం వరకు కూడా ఉంది” అన్నారు. కాని లాక్ డౌన్ సమయంలో సిక్కిం, తెలంగాణ, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ర్టాల్లో ఈ ప్రభావం 20 శాతం కన్నా తక్కువే ఉండడం ఊరట అన్నారు. “ఈ రాష్ర్టాలన్నీ కోవిడ్ నివారణ చర్యలతో టిబి నివారణ వ్యూహాలను కూడా సమీకృతం చేశాయి” అని తెలిపారు.
కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ టివి-కోవిడ్ స్ర్కీనింగ్ రెండూ ఒకే సారి చేపట్టాలని, ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ కేసుల స్క్రీనింగ్ జరపాలని, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని, నవీకరించిన హెచ్ఆర్, సిబి నాట్, ట్రూనాట్ యంత్రాలను టిబి కార్యక్రమాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలతో టిబి సేవలు తిరిగి ఎలా పుంజుకున్నది కూడా ఆయన వివరించారు. “ఆరోగ్య కేంద్రాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. పరీక్షల కోసం ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు క్లినిక్ లకు వెళ్తున్నారు. సమాజంతో మమేకమై చేపట్టే కార్యక్రమాల సహాయంలో కేసుల గుర్తింపు సంఖ్య కూడా పెరిగింది. కోవిడ్ చికిత్సల కోసం తరలించిన సిబ్బంది అందరూ క్రమంగా తిరిగి సాధారణ ఆరోగ్య కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కౌన్సెలింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, పోషకాహార సరఫరా వంటివి పెంచారు” అని చెప్పారు.
సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునేందుకు భారతదేశం అనుసరిస్తున్న వ్యూహం గురించి డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. ఆరోగ్య వ్యవస్థలను పటిష్ఠం చేయడం, అంటువ్యాధుల అదుపు వంటి చర్యల ద్వారా టిబి నిర్మూలన కార్యక్రమాలను విస్తరించే అవకాశం కోవిడ్-19 అందించింది అని చెప్పారు.
i. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రత్యేకంగా అంటు వ్యాధుల చికిత్స ఆస్పత్రులు అధిక సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ టిబి సంరక్షణ, అదుపు కార్యక్రమాలకు ఎంతో దోహదపడుతున్నాయి.
ii. దేశంలో మాలిక్యులార్ డయాగ్నస్టిక్ సామర్థ్యాలు ఎన్నో రెట్లు పెరిగాయి. కాట్రిడ్జ్ లు, చిప్ ఆధారిత టెక్నాలజీలతో ప్రవేశపెట్టిన ఈ బహుళ డివైస్ ల సహాయంతో టిబి డయాగ్నస్టిక్ సేవల వికేంద్రీకరణ జరిగింది.
iii. దగ్గు నివారణ, మాస్కుల వినియోగం, భౌతిక దూరం వంటి అంశాల్లో చోటు చేసుకున్న ప్రవర్తనాపరమైన మార్పు సహాయంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధి అయిన టిబి వ్యాప్తి కూడా తగ్గింది.
iv. కరోనా సమయంలో పెరిగిన టెలీ మెడిసిన్, టెలీ కన్సల్టేషన్ సేవలు టిబి కన్సల్టేషన్ కు కూడా ఉపయోగపడుతున్నాయి.
ఆరోగ్య సంరక్షణపై పెట్టుబడులు పెంచడం, టిబి వంటి ప్రాణాంతక వ్యాధుల కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోవడంపై చైతన్యం పెంపు వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వ విధానాల దిశ మార్చడంలో ఆరోగ్య రంగంలోని వారు చూపిన చొరవ గురించి డాక్టర్ హర్షవర్ధన్ ప్రస్తావించారు. “వ్యాధి నిర్మూలన దిశగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించినట్టయితే టిబిని అంతం చేయడం అంత కష్టం ఏమీ కాదు. అందుకు వ్యూహాత్మక మద్దతు, ఆలోచనాపరులైన వారి నాయకత్వం, నవ్యపంథాలో పయనించే సామాజిక ఎంటర్ ప్రెన్యూర్లు అవసరం. అలాగే ప్రజా సమీకరణ, ఉధృతమైన ప్రచారాలు, శక్తివంతమైన భాగస్వామ్యాలు, లోతైన కట్టుబాట్లు అవసరం. అన్నింటి కన్నా మిన్నగా శక్తివంతమైన సామాజిక, రాజకీయ కట్టుబాటు అవసరం” అన్నారు.
ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ వికాస్ సీల్, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1673936)
Visitor Counter : 208