సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ 13 వ శతాబ్దం నాటి రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి యొక్క కాంస్య విగ్రహాలను తమిళనాడు ఐడల్ వింగ్ కు అందజేశారు.

Posted On: 18 NOV 2020 5:57PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ఎఎస్‌ఐ హెడ్‌క్వార్టర్స్‌, దరోహర్‌ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్‌) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ .. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి  కాంస్య విగ్రహాలను తమిళనాడు ప్రభుత్వ ఐడల్ వింగ్ కు అందజేశారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఎఎస్ఐ మరియు తమిళనాడు ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 



2020 సెప్టెంబర్ 15 న ఈ కాంస్య విగ్రహాలను లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయానికి లండన్‌ మెట్రోపాలిటన్ పోలీసులు అప్పగించారు. 1958 లో చేసిన ఫోటో డాక్యుమెంటేషన్ ప్రకారం, ఈ విగ్రహాలు తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న శ్రీ రాజగోపాల్ విష్ణు ఆలయానికి (విజయనగర కాలంలో నిర్మించిన ఆలయం) చెందినవిగా గుర్తించారు. తమిళనాడు పోలీసుల విగ్రహ విభాగం నిర్వహించిన దర్యాప్తు ప్రకారం ఈ విగ్రహాలను శ్రీ రాజగోపాల్ విష్ణు ఆలయం నుండి 23/24 నవంబర్ 1978 న దొంగిలించారు.

రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి యొక్క ఈ కాంస్య విగ్రహాలు భారతీయ లోహకళకు చెందిన ప్రాచీన కళాఖండాలు. ఇవి వరుసగా 90.5 సెం.మీ, 78 సెం.మీ మరియు 74.5 సెం.మీ. ఎత్తు ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం ఈ శిల్పాలు క్రీ.శ 13 వ శతాబ్దానికి చెందినవి.

ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిని మంత్రి.." ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 నుండి మొత్తం 40 పురాతన వస్తువులు విదేశాల నుండి భారతదేశానికి తిరిగి రప్పించబడ్డాయి. 1976 నుండి 2014 కి ముందు కేవలం 13 పురాతన వస్తువులు మాత్రమే భారతదేశానికి తిరిగి రప్పించబడ్డాయి" అని వివరించారు.

ప్రాచీన విగ్రహాలను దేశానికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, స్పెషల్ ఐడల్ వింగ్, తమిళనాడు ప్రభుత్వం, డిఆర్ఐ మరియు భారత హైకమిషన్ ఆఫ్ లండన్‌ను మంత్రి  అభినందించారు.

భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్వాతంత్ర్య ఉద్యమం, స్వాతంత్య్ర సమరయోధుల జీవితం, భారతీయ సంప్రదాయాలు, వారసత్వం మరియు సంస్కృతి, పర్యాటక అభివృద్ధి మరియు ప్రమోషన్ మరియు ఇతర అంశాలలో పనిచేస్తున్న ఏజెన్సీలు / దరఖాస్తుదారులకు దేశంలోని వివిధ స్మారక కట్టడాలలో (ప్రపంచ వారసత్వ ప్రదేశాలు / ఐకానిక్ సైట్లు మినహా) షూటింగ్ / ఫోటోగ్రఫీ ఫీజు / ఛార్జీల చెల్లింపుల నుండి మినహాయింపు లభిస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. భారతదేశ దివంగత ప్రధాని శ్రీ అటల్ బిహరీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా 25 డిసెంబర్ 2020 నుండి 15 ఆగస్టు 2021 వరకూ ఈ మినహాయింపు లభిస్తుంది. ఇటువంటి షూటింగ్ పనులు నిర్వహించడానికి దరఖాస్తుదారులు / ఏజెన్సీలు అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


నేపథ్యం:

తమిళనాడులోని విజయనగర కాలంలో నిర్మించిన ఆలయం నుండి ఇతర దేశాలకు (యునైటెడ్ కింగ్‌డమ్‌ అయ్యే అవకాశం) దొంగిలించబడిన 4 పురాతన విగ్రహాలు (శ్రీ రామ, సీత, లక్ష్మణ మరియు హనుమ)కు సంబంధించిన సమాచారం ప్రైడ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా భారతదేశం యొక్క హై కమిషన్‌కు  ఆగస్ట్‌, 2019 అందించబడింది.

ఈ మూడు లోహ శిల్పాలకు సంబంధించిన ఫోటో డాక్యుమెంటేషన్ జూన్ 1958 లో తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలోని శ్రీ రాజగోపాల్ విష్ణు ఆలయంలో (ఆలయం విజయనగర కాలంలో నిర్మించబడింది) జరిగింది. ఈ చిత్రంలో  శ్రీ రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడు విగ్రహాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఈ విగ్రహాలు 1958 వరకు ఆలయంలో ఉన్నాయి. ఆ తర్వాత దొంగిలించబడ్డాయని తెలుస్తోంది.

విగ్రహాలను సంబంధిత రికార్డులతో ధృవీకరించిన తర్వాత ఆ విషయాన్ని లండన్ మెట్రోపాలిటన్ పోలీసుల ఆర్ట్ అండ్ పురాతన యూనిట్‌తో పాటు తమిళనాడు పోలీసుల విగ్రహ విభాగానికి తెలియజేశారు. 1978 నవంబర్ 23/24 న శ్రీ రాజగోపాల్ విష్ణు ఆలయం నుండి ఈ విగ్రహాలు చోరీకి గురయ్యాయని  ధృవీకరిస్తూ తమిళనాడు పోలీస్ విభాగం సమగ్ర నివేదికను పంపింది. అనంతరం నేరస్థులు కూడా పట్టుబడ్డారు. ఫోటో ఆధారంగా ఈ విగ్రహాలను పరిశీలించగా, శ్రీ రాజగోపాల్ విష్ణు ఆలయం నుండి దొంగిలించబడిన ఈ విగ్రహాలేనని వెల్లడయింది. తమిళనాడు పోలీసుల ఐడల్ వింగ్ కూడా విగ్రహాల మ్యాచ్ గురించి నిపుణుల అభిప్రాయాన్ని ఐఎఫ్‌పి ఫోటో ఆర్కైవ్‌తో అందించింది. సరైన దర్యాప్తు జరిపిన తరువాత లండన్లోని భారత హైకమిషన్కు సమగ్ర నివేదిక పంపబడింది.

విగ్రహాలకు చెందిన యజమానుల నుండి తమకు అందిన పత్రాలు, సమాచారం ఆధారంగా ఈ ఆంశంపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు చెందిన ఆర్ట్ అండ్ యాంటిక్ విభాగం దర్యాప్దు చేసింది. అందులో వెల్లడైన ఆంశాల ఆధారంగా ఈ విగ్రహాలు భారతదేశంలోని ఆలయానికి చెందినవిగా గుర్తించారు. ఆ విగ్రహాలను తిరిగి ఇవ్వమని మిషన్‌ అభ్యర్ధనను అంగీకరించిన అనంతరం వాటిని లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి సెప్టెంబర్ 15, 2020 ను అందించబడ్డాయి.

భారత పురావస్తు శాఖ, ప్రత్యేక విగ్రహాల విభాగం, తమిళనాడు ప్రభుత్వం మరియు లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం నిరంతర ప్రయత్నాల ఫలితంగా, ఈ విగ్రహాలు ఇప్పుడు దేశానికి తిరిగి వచ్చాయి.

1976 నుండి 2020 వరకు విదేశాల నుండి భారతదేశానికి తిరిగి పొందిన పురాతన వస్తువుల జాబితాను పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి..

 


(Release ID: 1673890) Visitor Counter : 168