ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ నెల 17 న జరిగిన బ్లూంబర్గ్ న్యూ ఇకానమి ఫోరమ్ 3 వ వార్షిక సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
17 NOV 2020 7:31PM by PIB Hyderabad
శ్రీ మైకల్ బ్లూంబర్గ్, మేధావులు, పరిశ్రమ రంగ ప్రముఖులు, బ్లూంబర్గ్ న్యూ ఇఎకనామిక్ ఫోరమ్ లోని ఇతర విశిష్ట భాగస్వాములారా,
బ్లూంబర్గ్ ఫిలాంత్రపీస్ లో శ్రీ మైకేల్, ఆయన బృందం చేస్తున్న అద్భుత కృషి ని ప్రశంసిస్తూ నేను ప్రసంగాన్ని మొదలుపెడుతున్నాను. ఈ బృందం భారతదేశ స్మార్ట్ సిటీస్ మిశన్ రూపకల్పన లో అందించిన మద్దతు చాలా బాగుంది.
మిత్రులారా,
మనం చరిత్ర లో అత్యంత కీలక ఘట్టం లో ఉన్నాం. ప్రపంచ పౌరుల్లో సగం మంది కి పైగా ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాబోయే రెండు దశాబ్దాల కాలం లో భారతదేశం, కొన్ని ఆఫ్రికా దేశాల్లో భారీ ఎత్తున పట్టణీకరణ జరుగనుంది. ఇటీవల చెలరేగిన కోవిడ్-19 ప్రపంచానికి పెను సవాలు ను రువ్వింది. మన వృద్ధి కి చోదక శక్తులైన నగరాలు మన బలహీన ప్రాంతాలు కూడా అని ఈ మహమ్మారి చాటింది. ప్రపంచ మహా మాంద్యం అనంతరం తొలిసారి గా ప్రపంచం లోని పలు నగరాలు అత్యంత దారుణమైన ఆర్థిక తిరోగమనం లో పడినట్టు ప్రకటించుకున్నాయి. నగర జీవనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత కీలక వ్యవస్థలు అన్నీ ప్రశ్నార్ధకం గా మారాయి. సామాజిక కార్యక్రమాలు, క్రీడల కార్యక్రమాలు, విద్య, వినోద కార్యక్రమ సంబంధి వసతులు ఇంతకు ముందు ఉన్నట్టుగా లేవు. కుదేలైన వ్యవస్థలన్నిటిని తిరిగి ఎలా ప్రారంభించాలా అనేది యావత్తు ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద ప్రశ్న గా ఉంది. మార్పు లేకుండా మళ్లీ ప్రారంభించడం సాధ్యం కాదు. మనిషి ఆలోచన ధోరణి లో మార్పు, విధానాల్లో మార్పు, ఆచరణల్లో మార్పు...అన్నీ కీలకమే.
మిత్రులారా,
రెండు ప్రపంచ యుద్ధాల తరువాత జరిగిన పునర్నిర్మాణం మనకు అనేక పాఠాలను నేర్పింది. ప్రపంచ యుద్ధాల అనంతరం యావత్తు ప్రపంచం సరికొత్త ప్రపంచ వ్యవస్థ దిశ గా కృషి చేసింది. కొత్త కొత్త విధానాలకు రూపకల్పన జరిగింది. ప్రపంచం అంతా మారిపోయింది. అదే తరహా లో ప్రతి ఒక్క రంగం లో సరికొత్త విధానాలను ఆవిష్కరించేందుకు కోవిడ్-19 మనకు అవకాశాన్ని అందించింది. భవిష్యత్తు లో ఎలాంటి ఆటుపోట్లను అయినా తట్టుకోగల స్థాయి లో వ్యవస్థలను అభివృద్ధి చేయాలంటే ఈ అవకాశాన్ని ప్రపంచం అందుకోవాలి. కోవిడ్ అనంతర శకం లో ప్రపంచ అవసరాల గురించి మనం ఆలోచించాలి. ప్రధానంగా మన పట్టణ కేంద్రాలను పునరుజ్జీవింపచేయడం ఈ దిశ గా మంచి ప్రారంభం అవుతుంది.
మిత్రులారా,
భారతీయ నగరాల గురించిన సానుకూలమైన కోణాన్ని కూడా ఈ సందర్భం లో మీకు వెల్లడించాలనుకొంటున్నాను. అత్యంత క్లిష్టమైన ప్రస్తుత వాతావరణం లో భారతీయ నగరాలు అసాధారణ ఉదాహరణ ను మన ముందు ఉంచాయి. ఈ కల్లోలం నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ చర్య ల పట్ల ప్రపంచ వ్యాప్తం గా పలు నగరాలు ప్రతిఘటన ను కనబరచాయి. అయితే నిషేధాజ్ఞలను భారతీయ నగరాలు కట్టుదిట్టంగా పాటించాయి. మా నగరాలు ఒక్క కాంక్రీటు తో నిర్మాణమైనవే కాక చక్కని సమాజం తో నిర్మాణమైనవి కావడమే దీనికి కారణం. సమాజానికే కాకుండా వ్యాపారాలకు కూడా అతి పెద్ద వనరు ప్రజలే అన్న విషయాన్ని ఈ మహమ్మారి మనందరికీ చాటి చెప్పింది. ఈ కీలకమైన, మౌలిక వనరు ను ఆలంబన చేసుకుని నిర్మాణం చేపట్టడం కోవిడ్ అనంతర ప్రపంచం లో అత్యంత కీలకం. నగరాలు వృద్ధి కి చోదక శక్తులు, సమాజానికి అవసరమైన మార్పునకు దారి ని చూపగల శక్తి కేంద్రాలు.
నగరాలు ఉపాధి ని అందిస్తాయి గనుకనే ప్రజలు తరచు గా నగరాలకు వలస పోతారు. అలాంటి నగరాలు ప్రజల కోసం పని చేసేలా చేయవలసిన బాధ్యత మనపై ఉంది కదా ? ప్రజలు నివసించడానికి మరింత అనువైనవి గా నగరాలను తీర్చి దిద్దడానికి విధానాల్లో వేగం పెంచే అవకాశాన్ని కోవిడ్-19 మనకు ఇచ్చింది. మంచి గృహ వసతి, మంచి పని వాతావరణం, తక్కువ దూరం ప్రయాణం వంటి మార్పులు చాలా అవసరం. లాక్ డౌన్ కాలం లో పలు నగరాల్లో సరస్సులు, నదులు, చివరకు గాలి కూడా స్వచ్ఛం గా మారాయి. గతంలో లేని విధంగా పక్షుల కిలకిలారావాలను మనలో చాలా మందిమి వినగలిగాం. ఏదో గాలివాటం గా దొరికే అవకాశం మాదిరిగా కాకుండా ఈ లక్షణాలన్నీ శాశ్వతంగా కనిపించే స్థిరమైన నగరాలను మనం నిర్మించలేమా ? నగరాల్లో ఉండే సౌకర్యాల తో పాటు గ్రామాల్లో ఉండే స్ఫూర్తి కి ఆలవాలం అయిన పట్టణ కేంద్రాలను నిర్మించడం మా లక్ష్యంగా ఉంది.
మిత్రులారా,
ఈ మహమ్మారి కాలం లో మన పనుల్లో మనం నిమగ్నం కావడానికి సాంకేతిక విజ్ఞానం చాలా సహాయకారి గా నిలచింది. వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం వంటి అద్భుత సాధనం సహాయంతో అనేక సమావేశాల్లో నేను పాల్గొన్నాను. దూరాన్ని తగ్గించుకొని మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని అది నాకు ఇచ్చింది. కానీ ఇది కోవిడ్ అనంతర ప్రపంచానికి సంబంధించి ఒక ప్రశ్న ను కూడా మన ముందుకు తీసుకువచ్చింది. కోవిడ్ అనంతర జగతి లో కూడా మనం ఇదే తరహా వీడియో కాన్ఫరెన్సింగ్ విధానాన్ని కొనసాగించవచ్చా, లేక సమావేశాల్లో పాల్గొనేందుకు సదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలా ? పట్టణ వ్యవస్థలపై ఒత్తిడి ని తగ్గించే అవకాశం మన ఎంపిక పైనే ఉంటుంది.
మనకు లభించిన ఈ అవకాశం పని- వ్యక్తిగత జీవిత సమతూకానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రజలు ఎక్కడ నుంచైనా పని చేసే, ఎక్కడైనా జీవించే, ఎక్కడ నుంచైనా ప్రపంచ సరఫరా వ్యవస్థలను ఉపయోగించుకునే అవకాశాలలో సాధికారితను వారికి అందించడమనేది నేటి నవతరం లో అత్యంత కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేం సాంకేతిక విజ్ఞానం, మేధో సంపత్తి ఆధారిత సేవల రంగానికి సరళతర మార్గదర్శకాలను ప్రకటించాం. ఇది ‘ఇంటి నుంచే పని చేయడాని’ కి, ‘‘ఎక్కడ నుంచైనా పని చేయడాని’’కి అవకాశాలను ప్రసాదిస్తుంది.
మిత్రులారా,
తక్కువ ఖర్చు తో కూడిన నివాసాలు లేకుండా మన నగరాలు సుసంపన్నం కాలేవు. ఈ అంశాన్ని గుర్తించి, 2015 వ సంవత్సరం లో మేం అందరికీ గృహ వసతి పథకాన్ని ప్రారంభించాం. ఆ కార్యక్రమానికి నిర్దేశించుకొన్న లక్ష్యాన్ని చేరే దిశ లో మేం పురోగమిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నిర్దేశిత 2022వ సంవత్సరం లక్ష్యం లోపే సొంత ఇళ్లను ఆశిస్తున్న 10 మిలియన్ కుటుంబాలకు మేం గృహాలను అందించబోతున్నాం. కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులను పరిగణన లోకి తీసుకొని అందుబాటు ధరల్లో అద్దె ఇళ్ల నిర్మాణాన్ని కూడా మేం చేపట్టాం. స్థిరాస్తి నియంత్రణ చట్టాన్ని తీసుకు వచ్చాం. ఈ చట్టం స్థిరాస్తి రంగం ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఆ రంగం వినియోగదారు ప్రాధాన్య రంగంగా, పారదర్శక రంగం గా మారింది.
మిత్రులారా,
ఎలాంటి విపత్తులను అయినా సరే తట్టుకు నిలబడగల నగరాల నిర్మాణానికి ఆధారపడదగ్గ రవాణా వ్యవస్థ కీలకం. ఇందులో భాగం గా 27 నగరాల్లో మెట్రో రైల్వే వ్యవస్థ నిర్మాణం పనులు పురోగతి లో ఉన్నాయి. 2022 వ సంవత్సరానికల్లా 1000 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థ మైలురాయి ని చేరేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యం రవాణా వ్యవస్థల్లో దేశీయ సామర్థ్యాల అభివృద్ధి కి దారి తీసింది. ఇది ఆధారపడదగ్గ రవాణా వ్యవస్థ ల లక్ష్యాన్ని చేరడానికి మాకు ఎంతో సహాయకారి గా నిలచే అంశం.
మిత్రులారా,
ఎలాంటి ప్రతికూలతలను అయినా తట్టుకొనే సుసంపన్న ఆకర్షణీయ నగరాలకు సాంకేతిక విజ్ఞానం కీలకమైన పునాది. నగరాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు, అనుసంధానిత సమాజాల నిర్మాణానికి సాంకేతిక విజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, శాపింగ్, ఆహార రంగాలన్నిటిలో అధిక శాతం ఆన్ లైన్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండే భవిష్యత్తు నిర్మాణం కోసం మేం ఆసక్తి గా ఎదురుచూస్తున్నాం. మన నగరాలు ఇటు భౌతిక, అటు డిజిటల్ ప్రపంచాల సమ్మిళిత స్థితి కి సమాయత్తం కావలసిన అవసరం ఉంది. మా ‘డిజిటల్ ఇండియా’, ‘స్టార్ట్- అప్ ఇండియా’ కార్యక్రమాలు ఈ రంగాల్లో సామర్థ్యాల నిర్మాణానికి దోహదపడుతున్నాయి. రెండంచెల విధానం ద్వారా మేం 100 స్మార్ట్ నగరాలను ఎంపిక చేశాం. సహకారాత్మక, స్పర్ధతత్వంతో కూడిన సమాఖ్య సిద్ధాంతం తో జాతీయ స్థాయి లో పోటీ ని ప్రోత్సహించే చర్య ఇది.
ఈ నగరాలన్నీ కలసి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు, లేదా 30 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నాయి. వాటిలో దాదాపుగా ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు, లేదా 20 బిలియన్ డాలర్ల విలువ గల ప్రాజెక్టులు పూర్తి కావడమో, లేదా పూర్తి అయ్యే దశ లోనో ఉన్నాయి. సాంకేతిక విజ్ఞానం శక్తి ని పూర్తి స్థాయి లో వినియోగించుకొనేందుకు పలు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పలు నగరాల్లో కోవిడ్ పరిస్థితి ని పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాలే ఇప్పుడు వార్- రూములు గా కూడా ఉపయోగపడుతున్నాయి.
చివరగా, మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. పట్టణీకరణ లో పెట్టుబడులను పెట్టడానికి మీరు వేచి ఉన్నట్లయియితే గనక భారతదేశం ఆకర్షణీయమైన అవకాశాలను అందిస్తోంది. రవాణా వ్యవస్థ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, భారత్ లో అపార అవకాశాలు ఉన్నాయి. నూతన ఆవిష్కరణ రంగం లో పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటే, భారతదేశం అపార అవకాశాల గని గా ఉంది. మీరు స్థిరమైన పరిష్కార మార్గాలలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారతదేశం ఎంతో ఆకర్షణీయమైనటువంటి గమ్యంగా ఉంది. హుషారైన ప్రజాస్వామ్యం, వ్యాపారానుకూలమైన వాతావరణం, అతి పెద్ద విపణిల తో ఈ అవకాశాలు మీ ముంగిట నిలచాయి. అలాగే భారతదేశ ప్రభుత్వం దేశాన్ని ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడుల కేంద్రం గా మార్చేందుకు అందుబాటు లో ఉన్న ఏ అవకాశాన్ని వదలివేయాలని అనుకోవడం లేదు.
మిత్రులారా,
పట్టణ పరివర్తన బాట లో ఇప్పటికే భారతదేశం పురోగమిస్తోంది. ఇందులో కీలక పాత్ర ను పోషించగలిగిన రంగాలు, పౌర సమాజం, విద్య బోధన సంస్థ లు, పరిశ్రమ, అన్నిటి కన్నా ముఖ్యం గా పౌరులు, సమాజాల భాగస్వామ్యం తో ఎలాంటి ప్రతికూలతలను అయినా తట్టుకోగలిగిన, సుసంపన్నమైన ప్రపంచ నగరాల నిర్మాణం కల ను మేం సాకారం చేసుకోగలమనడం లో ఎలాంటి సందేహం లేదు.
మీకు ఇవే ధన్యవాదాలు.
***
(Release ID: 1673653)
Visitor Counter : 263
Read this release in:
Punjabi
,
Gujarati
,
Assamese
,
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Kannada