శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రాజ్ఘాట్లోని గాంధీ దర్శన్వద్ద 360 డిగ్రీల కోణంలో వీడియో వీక్షణానుభవ వృత్తాకార గోపురాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
గాంధీ దర్శన్లో మహాత్మాగాంధీపై డిజిటల్ ప్రదర్శనాంశాల ఆవిష్కరణ
మెరుగైన, సముచిత సమాజ సృష్టికోసం గాంధీజీ బోధనలను
అనుసరించాలని యువతకు డాక్టర్ హర్షవర్ధన్ పిలుపు
మహాత్ముని బోధనలకు... ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి దిశగా
నేటికీ ఎంతో ఔచిత్యం ఉంది: శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
Posted On:
06 NOV 2020 4:52PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లోగల గాంధీదర్శన్ ప్రదర్శనశాలలో 360 డిగ్రీల కోణంలో వీడియో వీక్షణానుభవం ఇవ్వగల వృత్తాకార గోపురాన్ని, గాంధీజీకి సంబంధించిన డిజిటల్ ప్రదర్శనాంశాలను కేంద్ర శాస్త్ర-సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సాంస్కృతికశాఖ (స్వతంత్ర బాధ్యతగల) సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇవాళ ప్రారంభించారు. రెండేళ్లపాటు నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ రాఘవేంద్ర సింగ్, గాంధీ స్మృతి-దర్శన్ సమితి డైరెక్టర్ శ్రీ దీపాంకర్ జ్ఞాన్, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ- గాంధీజీ వ్యక్తిత్వం ఎంతో గొప్పది కనుకనే నేడు కూడా ప్రపంచ మానవాళికి స్ఫూర్తినిస్తూనే ఉందని చెప్పారు. గాంధేయ తత్త్వశాస్త్రం మానవ జీవనంలోని అన్ని అంశాలనూ స్పృశించిందని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ సదా సుస్థిర ప్రగతి గురించి నొక్కి చెప్పేవారని పేర్కొన్నారు. గాంధీజీ ప్రబోధించిన విలువల వ్యాప్తి కోసం డిజిటల్ సాధనాలను అభివృద్ధి చేయడంలో కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ చేసిన కృషిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మెరుగైన, సముచిత సమాజ సృష్టికోసం గాంధీజీ బోధనలను అనుసరించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.


అనంతర శ్రీ ప్రహ్లాద్‌సింగ్ పటేల్ ప్రసంగిస్తూ- గాంధీజీ ప్రబోధాలు శాస్త్రీయ దక్పథంతో కూడిన సాంస్కృతికపరమైన ఆలోచనల సమ్మేళనమని పేర్కొన్నారు. మహాత్ముని బోధనలకు... ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి దిశగా నేటికీ ఎంతో ఔచిత్యం ఉందని ఆయన అన్నారు. గాంధీజీ సందేశాన్ని దేశ యువతకు చేరవేయడంలో వర్చువల్ రియాలిటీ (విఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్) వంటివి శక్తిమంతమైన సాంకేతిక సాధనాలని తమశాఖ నిర్ణయించినట్లు శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తన ప్రసంగంలో వెల్లడించారు. అందుకే స్మారకోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా గాంధీ దర్శన్‌వద్ద వృత్తాకార గోపురంలో 360 డిగ్రీల కోణంలో మహాత్మాగాంధీ జీవితం ఆధారిత చిత్రాల వీడియో-వీక్షణానుభవం ఇవ్వగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా మహాత్ముని జీవితంపై రూపొందించిన నాలుగు (హిందీ-ఆంగ్ల) చిత్రాలను సమ్మిళితం చేసి, ఒక సంపూర్ణ చిత్రంగా తయారుచేశారు. అవేమిటంటే:-
“మోహన్ టు మహాత్మ”
“ది లాస్ట్ ఫేజ్”
“ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్”
“గాంధీ ఫరెవర్”
వీటితోపాటు పురావస్తు భాండాగారం నుంచి గాంధీజీ సంబంధిత ఫొటోలు, వీడియోలు, ఆడియో ఇంటర్వ్యూలు తదితరాలను ఎక్కడైనా, ఎప్పుడైనా వాడుకోగలిగేలా డిజిటల్ రూపంలోకి మార్పిడి చేశారు. ఇక 360 డిగ్రీల కోణంలో వీడియో వీక్షణానుభవం ఇవ్వగల సాంకేతిక పరిజ్ఞాన ప్రాజెక్టును ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూపొందించి, సాకారం చేసింది. అటుపైన నాలుగు చిత్రాల సమ్మిళిత వీడియోను పరీక్షించి, తగువిధంగా రూపొందించి, తుది మెరుగులు దిద్దిన తర్వాత రాజ్‌ఘాట్‌లోని గాంధీదర్శనవద్ద ప్రదర్శన కోసం వీడియో డోమ్‌తో సంధానించింది. ఇక శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తిగల ‘విజ్ఞాన్ ప్రసార్’ సంస్థ మహాత్మాగాంధీకి సంబంధించిన డిజిటల్ ప్రదర్శనాంశాల ఏర్పాటును విజయవంతంగా పూర్తిచేసింది. వీటిని న్యూఢిల్లీలోని రెండు ‘గాంధీ దర్శన్-స్మృతి’ కేంద్రాలతోపాటు దేశంలోని 17 ప్రదేశాలుసహా జాతీయ శాస్త్రవిజ్ఞాన ప్రదర్శన శాలల మండలి కిందగల 15 ప్రదర్శనశాలల్లో ప్రదర్శిస్తారు. మహాత్మాగాంధీ జీవితం, ఆయన ప్రబోధాలను వివరించే ఈ ప్రదర్శనాంశాల ప్రదర్శన కోసం సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిధులు మంజూరు చేస్తుంది.

డిజిటల్, వర్చువల్ ప్రదర్శన/ప్రదర్శనాంశాల కోసం ఉపయోగించిన సరంజామాను సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జీఎస్‌డీఎస్ పర్యవేక్షణలో రూపొందించారు. ఈ మేరకు కింద పేర్కొన్న వివిధ రకాల ప్రదర్శనాంశాలను ఉపయోగించారు:
ఎ. స్మార్ట్ ఇంటర్‌ఫేజ్ ఫర్ మల్టీయూజర్ ఎంగేజ్‌మెంట్ (2 యూనిట్లు)
బి. స్మార్ట్ సర్ఫేస్ (4 యూనిట్లు)
సి. వర్చువల్ హోలోగ్రాఫిక్ డిస్‌ప్లే (2యూనిట్లు)
డి. ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే (2 యూనిట్లు)
ఈ డిస్‌ప్లేలోని ఇతివృత్తాలు:
- మహాత్మాగాంధీ దార్శనికత, ఆయన జీవితం.. ‘మహాత్ముని’గా పరిగణనదాకా;
- గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్య సమరం, ఆయన ప్రయాణాల చరిత్ర, సత్యాగ్రహం, ఆయన ఆలోచనలు;
- గాంధీజీ అనుయాయులు, గాంధీజీకి స్ఫూర్తినిచ్చినవారు, ఆయన అడుగుజాడలను అనుసరించేవారు;
- గాంధీజీ సమకాలీన ఔచిత్యం, ఆధునిక ప్రపంచంపై ఆయన ప్రభావం;
- తుది పయనం, గాంధీజీకి నివాళి...
- మహాత్ముని 150వ జయంతి వేడుకలపై ‘వైష్ణవ్‌జన్’ పేరిట విదేశాంగ మంత్రిత్వశాఖ రూపొందించిన వీడియోలు
గాంధీ దర్శన్‌వద్ద డిజిటల్, వర్చువల్ డిస్ప్లే/ప్రదర్శనాంశాలన్నీ ప్రజల వీక్షణకు సిద్ధంగా ఉన్నాయి.

***
(Release ID: 1670900)
Visitor Counter : 111