రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఐదేళ్ళలో మోటారు వాహనాల తయారీ కేంద్రంగా భారత్: గడ్కరీ

విద్యుత్ వాహనాల విక్రయాల పెంపునకు రేట్లను తగ్గించాలని,
నాణ్యతకు కట్టుబడాలని వాహన పరిశ్రమలకు సూచన

Posted On: 06 NOV 2020 4:44PM by PIB Hyderabad

  రాబోయే ఐదేళ్లలో మోటారు వాహనాల తయారీ కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మోటారు వాహనాల తయారీ పరిశ్రమకు సానుకూలంగా ప్రభుత్వం ఇప్పటికే అనేక విధానాలు రూపొందిస్తోందన్నారు.

 

  భారతీయ వాణిజ్య పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కీ-ఎఫ్.ఐ.సి.సి.ఐ.) కర్ణాటక మండలి ఆధ్వర్యంలో ‘ఎలెక్ట్రిక్ మొబిలిటీ కాన్ఫరెన్స్ 2020’ పేరిట వర్చువల్ పద్ధతిలో జరిగిన సదస్సులో గడ్కరీ మాట్లాడారు. “భారత్ కు భవిష్యత్తు ఎంతో ఆశాజనంగా, సానుకూలంగా ఉంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విద్యుత్ వాహనాల మార్కెట్ గా ఎదిగే సత్తా భారతదేశానికి ఉంది. విద్యుత్ వాహనాల తయారీ విధానాన్ని ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తోంది.” అన్నారు.

  విద్యుత్ వాహనాల ధరలను తగ్గించాలని, అప్పుడే ఆ వాహనాల విక్రయం పెరిగే అవకాశం ఉంటుందని, అలా విక్రయాలు పెరిగినపుడు విద్యుత్ వాహనాల పరిశ్రమ కూడా లాభాలతో పురోగమిస్తుందని గడ్కరీ చెప్పారు. విద్యుత్ వాహనాల నాణ్యతను పరిశ్రమలు కట్టుబడి ఉండాలన్నారు. మోటారు వాహనాల ఉత్పత్తి పెరిగినపుడే, పెరుగుతున్న మార్కెట్ అవసరాలను తీర్చడానికి వీలుంటుందన్నారు. మరిన్ని ఉద్యోగాలు కల్పించడమేకాక, ఎగుమతులకు కూడా అవకాశాలు కలిగించే ఉత్తమమైన విద్యుత్ వాహనాలను తయారు చేసే సామర్థ్యం భారతీయ పరిశ్రమలకు ఉందన్నారు. “త్వరలో విద్యుత్ వాహనాలే భవిష్యత్ రవాణా సాధనాలుగా మారే అవకాశం ఉంది. ఎక్కువగా ముడి చమురును దిగుమతి చేసుకోవడం, వాతావరణ కాలుష్యం పెరగడం ప్రస్తుతం దేశంలో రెండు ఆందోళనకరమైన అంశాలు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాలకోసం మనకు ఒక సమగ్ర విధానం అవసరం.” అని అన్నారు. 

 

   దేశంలో విద్యుత్ మోటారు వాహనాలను రూపొందించే దిశగా ఫిక్కీతోపాటు ఇతర భాగస్వామ్య వర్గాలు ముందుకు రావాలని గడ్కరీ చెప్పారు. నీతీ ఆయోగ్ నివేదికను గడ్కరీ ప్రస్తావిస్తూ..భారతదేశానికి 2022నాటికి కనీసం గంటకు పది గిగావాట్ల శక్తి కలిగిన బ్యాటరీలు అవసరమన్నారు. 2025కల్లా గంటకు 50గిగావాట్ల సామర్థ్యం కలిగిన సెల్స్ ను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. దేశంలో ఇలాంటి బ్యాటరీ సెల్స్ తయారీని మనం ప్రోత్సహించవలసి ఉందని, ఈ-బ్యాటరీల తయారీ గురించి ఆలోచించాల్సిందిగా పారిశ్రామిక రంగాన్ని కోరుతున్నానని గడ్కరీ చెప్పారు.

  ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే రహదారిని ఈ-హైవేగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ రహదారిపై విద్యుత్ బస్సులు, విద్యుత్ ట్రక్కులు ప్రయాణిస్తాయని గడ్కరీ చెప్పారు. “ఈ ప్రయోగాత్మక పథకాన్ని మేం ముందుకు తీసుకెళ్తున్నాం. ఢిల్లీ-ముంబై కారిడార్ భారతదేశానికి జీవన రేఖగా మారబోతోంది. కొత్త విద్యుత్ రహదారులను ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఇంధనం ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఇపుడు దేశంలో అందుబాటులోనే ఉంది. అందువల్ల, విద్యుత్ సహాయంతో భారీగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే దేశానికి ముఖ్యమైన పరిష్కారం. ” అని అన్నారు.

   విద్యుత్ వాహనాల తయారీదార్లు తమ సరఫరా వ్యవస్థను తప్పనిసరిగా వికేంద్రీకరించాలని, స్థానికంగా బ్యాటరీ సెల్స్ ను తయారు చేసేందుకు ముడి పదార్థాల సేకరణపై కంపెనీలు దృష్టిని కేంద్రీకరించాలని, ఈ ప్రక్రియ నిరాటంకంగా సాగాలని గడ్కరీ సూచించారు.  రహదారుల ద్వారా రవాణాలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. “మరింత పర్యావరణ హితమైన భవిష్యత్తువైపు మనం అడుగులు వేస్తున్న తరుణంలో, మరింత స్వచ్ఛమైన, సుస్థిరమైన సృజనాత్మక ప్రత్యామ్నాయాలను పారిశ్రామిక రంగం తీసుకవస్తుందని ఆశిస్తున్నాను.” అని గడ్కరీ అన్నారు. సి.ఎన్.జి., ఎల్.ఎన్.జి. వంటి జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని, బయో సి.ఎన్.జి. ఇంధనంతో నడిచే ట్రాక్టర్లను త్వరలోనే ప్రారంభిస్తామని గడ్కరీ చెప్పారు.

   ఫిక్కీ కర్ణాటక రాష్ట్ర మండలి చైర్మన్ ఉల్లాస్ కామత్ మాట్లాడుతూ, భారతదేశం విద్యుత్ మోటారు వాహనాలకు ప్రోత్సాహం తప్పక కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ వాహనాలతోపాటుగా, విద్యుత్ వాహనాలకు సంబందించిన అన్ని రకాల సాంకేతిక పరిజ్జానాన్ని కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ విద్యుత్ వాహనాలు, స్ట్రాంగ్ హైబ్రిడ్ విద్యుత్ వాహనాలు, ఇంధన బ్యాటరీ సెల్స్, కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణా రంగం విద్యుదీకరణ, ఇంధన భద్రతను సాధించడం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాలన్నారు. “విద్యుత్ వాహనాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించిన తొలి రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. ఈ అంశంపై 2017లో కర్ణాటక తన విధానాన్ని ప్రకటించింది. ఈ రంగంలో పెట్టుబడి పెట్టదలుచుకున్న కంపెనీలకోసం విద్యుత్ వాహనాల తయారీ క్లస్టర్ ఏర్పాటుకు కూడా సంకల్పించింది.” అని ఆయన అన్నారు.

    విద్యుత్ వాహనాల వ్యవహారంపై ఏర్పాటైన ఫిక్కీ కమిటీ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ మాట్లాడుతూ,..వస్తుసేవల పన్ను (జి.ఎస్.టి.) అమలులోకి రావడం, విద్యుత్ వాహనాల విషయంలో జి.ఎస్.టి.ని తగ్గించడం చూస్తే ఈ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు తేలుతోందని అన్నారు. దేశంలో విద్యుత్ వాహనాల తయారీకి తగిన సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, రహదారులపై రవాణాను విద్యుదీకరణ సాధ్యం కాదన్నారు. ఇదో పెద్ద సవాలు వంటిదని, దీనిని ఎదుర్కోవడానికి,.. పరిశ్రమ, ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం, స్థానిక తయారీలో పెట్టుబడులకు దోహదపడే సానుకూల విధానాలు చాలా అవసరమనిత ఆయన అన్నారు.

***


(Release ID: 1670817) Visitor Counter : 187