మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

క్యాంపస్ లను తిరిగి తెరవడానికి మార్గదర్శకాలను విడుదల చేసిన యూజీసి

Posted On: 05 NOV 2020 6:33PM by PIB Hyderabad

విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తమ క్యాంపస్ లను తిరిగి తెరవడానికి అమలు చేయవలసిన మార్గదర్శకాలను విశ్వవిద్యాలయాల గ్రాంటుల కమిషన్(యూజీసి) రూపొందించి విడుదల చేసింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధం చేసిన ఈ మార్గదర్శకాలకు హోం మంత్రిత్వశాఖ, విద్యా మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. ఈ మార్గదర్శకాలను స్థానిక పరిస్థితులు, ఆయా ప్రభుత్వ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అమలు చేయవలసి ఉంటుంది.

కంటైన్మెంట్ జోనుల వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలు యూజీసి జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించి దశలవారీగా క్యాంపస్ లను ప్రారంభించవచ్చును.

i ) కేంద్ర నిధులు పొందుతున్న ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి సంబంధిత సంస్థ అధిపతి తరగతులను ప్రారంభించడం ఏమేరకు వెసులుబాటుగా ఉంటుందన్న అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

ii ) మిగిలిన ఉన్నత విద్యా సంస్థలు అంటే రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు,కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం/ కేంద్ర పాలిత ప్రాంతం తీసుకొనే నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలి.

iii) సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ లు , ఇతర జాగ్రత్త చర్యలను తీసుకోవడం లాంటి చర్యలను సులువుగా అమలు చేయడానికి అవకాశం ఉన్న కార్యక్రమాలతో దశలవారీగా క్యాంపస్ లను ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలి. పరిపాలనా కార్యాలయాలు, గ్రంధాలయాలు, పరిశోధనశాలలు లాంటివి ఈ కోవలోకి వస్తాయి.

iv) సైన్స్ మరియు టెక్నాలజీ శాఖలలో పరిశోధకులు, పోస్ట్ గ్రాడ్యుయేట్

​విద్యార్థుల సంఖ్య ఇతర శాఖలతో పోల్చి చూస్తే తక్కువగా ఉంటుంది . కాబట్టి వీరిని ఆ తరువాత అనుమతించవచ్చును. ఇక్కడ సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులను ధరించడంలాంటి చర్యలను సులువుగా అమలు చేయవచ్చును.

v)​ సంస్థ అధిపతి తీసుకునే నిర్ణయానికి లోబడి ఆఖరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులను విద్య మరియు ప్లేసెమెంట్ కార్యక్రమాల కోసం అనుమతించవచ్చును.

అయితే, పైన తెలిపిన (iii) (iv)(v) మార్గదర్శకాలను అమలు చేయడానికి కొవిడ్ -19 వ్యాప్తి చెందకుండా చూడడానికి ఏ సమయంలో అయినా మొత్తం విద్యార్థులలో 50% మంది మాత్రమే హాజరు అయ్యేలా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలా ఉంటుంది.

vi ) పైన తెలిపిన (iv) (v) పేరాల కిందకి రాని కార్యక్రమాలకు ఆన్ లైన్ / దూర విద్యద్వారా తరగతులను నిర్వహించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

​vii) అయితే ఉపాధ్యాయుల నుంచి సలహాలు సూచనలను పొందడానికి ముందస్తు అనుమతితో ఎక్కువ మందిని కాకుండా తక్కువ మందిని సామజిక దూరం పాటించేవిధంగా అనుమతించవచ్చును.

viii) కొంతమంది విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా ఇంటి నుంచి ఆన్ లైన్ లో చదువుకోడానికి మొగ్గు చూపవచ్చును. ఇటువంటివారికి సంస్థలు ఆన్ లైన్ పాఠ్యాంశాలను అందచేసి ఇతర సౌకర్యాలను కల్పించవలసి ఉంటుంది.

ix) విదేశీ విద్యార్థులకోసం సంస్థలు తగిన ఏర్పాట్లను చేయవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా ప్రయాణాలపై విధించిన ఆంక్షలు, వీసా స,సమస్యల వల్ల విద్య కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితిలో వున్నా వారికి ఆన్ లైన్ సౌకర్యాలను కల్పించాలి.

x) ఆరోగ్య నిబంధనలను ముందు జాగ్రత్త చర్యలను కఠినంగా అమలు చేస్తూ అవసరమైతే వసతి గృహాలను తెరవవచ్చును.అయితే, ఒక గదిలో ఒక్క విద్యార్థిని మాత్రమే అనుమతించాలి. అనారోగ్య లక్షణాలు ఉన్న విద్యార్థులను ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించరాదు.

xi) సంస్థ ఉన్న ప్రాంతం సురక్షితంగా ఉందని సంబంధిత కేంద్ర / రాష్ట్ర ​ప్రభుత్వం ప్రకటించిన తరువాత మాత్రమే ఏ క్యాంపస్ ను అయినా తిరిగి ప్రారంభించవలసి ఉంటుంది. కొవిడ్ -19కి సంబంధించి కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను తూచా తప్పకుండా ప్రతి ఒక్క సంస్థ అమలు చేయవలసి ఉంటుంది .

తిరిగి ప్రారంభంకావడానికి ముందు ఉన్నత విద్యా సంస్థలు అమలు చేయవలసి ఉన్న చర్యలను మార్గదర్శకాలలో పొందుపరచడం జరిగింది. ప్రవేశ / నిష్క్రమణ మార్గాలలో, తరగతులు,వసతి గృహాలు, క్యాంపస్ లోని ఇతర ప్రాంతాలలో అమలు చేయవలసి ఉన్న చర్యలను ఖరారు చేయడం జరిగింది. కౌన్సిలింగ్, మానసిక ఆరోగ్య అంశాలను గుర్తించడం జరిగింది.

కోవిడ్ -19 వ్యాప్తి ఆ తరువాత విధించిన లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఇదివరకు యూజీసి పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించి 2020 ఏప్రిల్ 29వ తేదీన ఆ తరువాత జూలై ఆరవ తేదీన పరీక్షలు, విద్య సంవత్సరం , ప్రవేశాలు, ఆన్ లైన్ అంశాలలో మార్గదర్శకాలను విడుదల చేసి విశ్వవిద్యాలయాలకు వీటిని పాటించే అంశంలో స్వేచ్ఛను ఇచ్చింది.

అండర్ గ్రాడ్యుయేట్,పోస్ట్ గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం 2020=21 విద్యా క్యాలెండర్ ను 2020 సెప్టెంబర్ 24న విడుదల చేయడం జరిగింది.

 

​పూర్తి వివరాలకు Click here for the detailed UGC guidelines for Re-opening the Universities and Colleges Post Lockdown

Click here for the salient features of UGC guidelines for Re-opening the Universities and Colleges Post Lockdown

​చూడవచ్చును.

 


(Release ID: 1670549) Visitor Counter : 281