సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వెదురు వనరులను మరింత ఎక్కువగా ఉపయోగించి ఖర్చు తగ్గించాలి .. కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ వెదురు ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి

Posted On: 05 NOV 2020 4:36PM by PIB Hyderabad

దేశంలో అపారంగా లభిస్తున్న వెదురుని మరింత ఎక్కువగా ఉపయోగంలోకి తీసుకునిరావలసి ఉందని కేంద్ర రవాణా, జాతీయ రహదారులు మరియు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. వెబినార్ లో మంత్రి ఈ రోజు వెదురు ప్రదర్శనను ప్రారంభించారు. భవనాలు, గృహ అలంకరణ , చేతివృత్తులు , అగరొత్తులు, దుస్తులు లాంటి అనేక రంగాలలో వెదురును వినియోగిస్తున్నారని మంత్రి తెలిపారు. రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి తక్కువ ఖర్చుతో ఉత్పత్తులను రవాణా చేయడానికి జలమార్గాలు, రహదారులు, రైళ్ల ద్వారా రవాణా చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఉత్పత్తిదారులకు ​సూచించారు. బ్రహ్మపుత్ర నది లోతును మూడు మీటర్ల వరకు పెంచడంతో సరకుల రవాణా సాధ్యమవుతున్నదని ఆయన వివరించారు. ఈశాన్య ప్రాంతాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న వెదురును జలమార్గాల ద్వారా రవాణా చేయడంవల్ల రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని మంత్రి అన్నారు.

దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో వెదురు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నదని దీనిని దృష్టిలో ఉంచుకుని ఈశాన్య ప్రాంతాల అధివృద్ధి మంత్రిత్వశాఖ వెదురు విధానానికి రూపకల్పన చేయాలని శ్రీ గడ్కరీ సూచించారు. వెదురును నరకడానికి ముందుగా అనుమతులు తీసుకోవాలన్న నిబంధనను తాను ప్రధానమంత్రితో మాట్లాడి తొలగించానని మంత్రి తెలిపారు. తిరిగి పెరిగే గడ్డి జాతి తరగతిలోకి వెదురు వస్తుందని చెప్పడంతో ముందస్తు అనుమతుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రధానమంత్రి ఆదేశించారని మంత్రి వివరించారు. ఎక్కువ దిగుబడి ఇచ్చే వెదురు వంగడాలను ఉపయోగించాలని శ్రీ గడ్కరీ సూచించారు. పారిశ్రామిక రంగంలో వెదురును ఉపయోగించడానికి దిగుబడిని పెంచవలసి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కొన్ని రకాల వెదురు ఎకరానికి 40 టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నదని పారిశ్రామిక అవసరాలకు దీనిని 200 టన్నులకు పెంచవలసి ఉంటుందని మంత్రి అన్నారు. వెదురు వినియోగం ఎక్కువ అయితే ఉపాధి అవకాశాలు ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలలో పెరుగుతాయని మంత్రి అన్నారు. వెదురు బొంగులను వెదురు కర్రలుగా మార్చి రవాణా చేస్తే ఖర్చు తగ్గడంతోపాటు పోషకవిలువలు పెరుగుతాయని మంత్రి అన్నారు. ఈ అంశంలో ఐఐటీ ల సహకారాన్ని తీసుకోవాలని అన్నారు. వెదురు ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి వెదురు ఉత్పత్తి, శుద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలను అందించాలని మంత్రి తెలిపారు.

కోవిడ్ అనంతర నేపథ్యంలో ఆర్ధిక రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తున్నాడని ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వశాఖ సహాయ ( స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వెదురును మరింత ఎక్కువగా వినియోగంలోకి తెస్తూ ఈశాన్య ప్రాంతాలు ఈ అంశంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. భారతదేశ అభివృద్ధికి వెదురు ఉత్పత్తిని వినియోగాన్ని ప్రోత్సహించవలసి ఉంటుందన్నారు. భారతదేశాభివృద్ధిలో ఈశాన్య ప్రాంతాలు, వెదురు తమ వంతు పాత్రను పోషిస్తాయని అన్నారు.

వెదురు వనరులను వినియోగంలోకి తీసుకుని రాడానికి తమ మంత్రిత్వశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొంటున్నాడని అన్నారు. జమ్మూ, కాట్రా,సాంబ ప్రాంతాలలో వెదురు బుట్టలు, ఊదొత్తులు, బొగ్గును తయారు చేయడానికి వసతులను కల్పించామని మంత్రి తెలిపారు. వెదురు సాంకేతిక కేంద్రాన్ని నెలకొల్పే ప్రతిపాదన ఉందని అన్నారు .దేశంలో వెదురు పండుతున్న ప్రాంతాలను గుర్తించి వెదురును వినియోగంలోకి తీసుకునివచ్చే అంశంపై తమ శాఖ దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అస్సాంలోని డిమా హసావో లో వెదురు పారిశ్రామికి పార్కును నెలకొల్పడంతోపాటూ ఈశాన్య రాష్ట్రాలలో 17 వెదురు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని అన్నారు.

ఈశాన్య రాష్ట్రాలలో 40 శాతం ప్రాంతంలో వెదురు సాగులో ఉందని అయితే భారత అటవీ చట్టం 1927లో విధించిన ఆంక్షల వల్ల వెదురు పూర్తిగా పండించడం లేదని అన్నారు. శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వెదురుకు ప్రాధాన్యత ఇస్తున్నాదని మంత్రి అన్నారు. అటవీ చట్టం పరిధిలో నుంచి వెదురును తొలగించడం దీనికి నిదర్శనమని మంత్రి అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వెదురుపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల జీవనస్థితిగతులు మెరుగుపడ్డాయని మంత్రి అన్నారు. దిగుమతి చేసుకొంటున్న వెదురుపై దిగుమతి సుంకాన్ని 25%కి పెంచడంతో అగరొత్తులు తయారీ పరిశ్రమలుఎక్కువగా ఏర్పడుతున్నాయని మంత్రి వివరించారు. భారతదేశంలో అగరొత్తుల రంగంలో అయిదు నుంచి ఆరు వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నది. వీటిలో ఎక్కువ భాగం కొరియా, చైనా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వెదురు వినియోగం వల్ల పర్యావరణం కలుషితం కాదని తెలిపిన మంత్రి ప్రాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించి పర్యావరణాన్ని రక్షించాలని అన్నారు.

ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ ఇంద్రజిత్ సింగ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

 



(Release ID: 1670464) Visitor Counter : 114