రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దేశ సార్వభౌమత్వ, ప్రాంతీయ సమగ్రతల పరిరక్షణే ధ్యేయం: రాజ్ నాథ్

ఎన్.డి.సి. వజ్రోత్సవ వెబినార్ లో కేంద్ర రక్షణ మంత్రి ప్రధానోపన్యాసం,
జాతీయ భద్రత స్థూల సూత్రాలపై వివరణ

Posted On: 05 NOV 2020 4:39PM by PIB Hyderabad

  ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాల (ఎన్.డి.సి.) వజ్రోత్సవాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రెండు రోజుల వెబినార్ సదస్సులో రాజ్ నాథ్ సింగ్ ప్రధానోపన్యాసం చేశారు. ‘భారతదేశ జాతీయ సమగ్రత- భావి దశాబ్ది’ అనే అంశంపై ఈరోజు, రేపు ఈ వెబినార్ సదస్సు జరుగుతుంది. రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ , నేషనల్ డిఫెన్స్ కళాశాల కమాండెంట్, ఎయిర్ మార్షల్ డి. చౌధురి కూడా వెబినార్ లో పాలు పంచుకున్నారు.

   ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, యుద్ధాన్ని నివారించే సామర్థ్యం ఉన్నపుడే శాంతిని నెలకొల్పడం సాధ్యమని అన్నారు. “శాంతిపై ఆకాంక్ష ఉన్నంత మాత్రాన శాంతిని సాధించలేమని, యుద్ధాన్ని నివారించే సామర్థ్యంతోనే శాంతిని నెలకొల్పగలమని వివిధ దేశాల ఉత్థాన, పతనాల ద్వారా ఒక ప్రాథమిక పాఠం మనకు అవగతమైంది. శాంతిపై ఆకాంక్ష ఉన్నప్పటికీ, అందుకు ఇతర పక్షాలు ప్రతిస్పందించని పక్షంలో ఆకాంక్షలేవీ ఫలవంతంకాబోవు.  భద్రత, సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలు అనే అంశాలపై పరస్పర విరుద్ధమైన భావనలు ఉన్నందున ప్రపంచంలో శాంతికి సానుకూల వాతావరణం కూడా సాధ్యం కాదు.” అని ఆయన అన్నారు. భవిష్యత్తులో మన జాతీయ భద్రతకు సంబంధించి స్థూలంగా నాలుగు సూత్రాలు మార్గదర్శకంగా ఉండబోతున్నాయని అన్నారు. విదేశీ దాడుల ముప్పునుంచి భారతదేశ ప్రాంతీయ సమగ్రతను, సౌర్వభౌమత్వాన్ని కాపాడుకునే సామర్థ్యం మొదటి మార్గదర్శక సూత్రమని, దేశ ఆర్థిక ప్రగతికి, తద్వారా జాతి నిర్మాణానికి జనం ఆశయాలను నెరవేర్చేందుకు దోహదపడే సురక్షితమైన, సుస్థిరమైన పరిస్థితులను కల్పించడం రెండవ మార్గదర్శక సూత్రమని అన్నారు. అలాగే,..సరిహద్దులకు ఆవల కూడా మన ప్రయోజనాల పరిరక్షణకు, మన ప్రజల సంక్షేమానికి అచంచలమైన విశ్వాసంతో కట్టుబడి ఉండటం 3వ మార్గదర్శక సూత్రమని, ప్రపంచీకరణతో పరస్పరం అనుసంధానమైన ప్రపంచంలో, మన దేశ భద్రతా ప్రయోజనాలు ఇతరులతో ముడిపడి ఉన్నాయని మనం విశ్వసించడం చివరి మార్గదర్శక సూత్రమని రక్షణమంత్రి చెప్పారు.

  ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా చేపట్టిన దేశాలను గట్టిగా ప్రతిఘటించగలమన్న సత్యాన్ని  భారత్ రుజువుచేసిందన్నారు. “ఉగ్రవాదాన్ని అధికార విధానంగా పాటిస్తూ, పాకిస్తాన్ మొండిగా వ్యవహరిస్తూ వస్తోంది. అయితే, ప్రగతిశీల దేశాలు, భావసారూప్యం కలిగిన దేశాలతో కలసి పనిచేయడం ద్వారా పాకిస్తాన్ తిరోగామి వైఖరిని బట్టబయలు చేయడంలో మనం గణనీయమైన విజయం సాధించాం. అంతేకాక, ఆ దేశం తన పాత విధానాలతో కొనసాగడానికి వీల్లేకుండా చేశాం. ” అని అన్నారు.

  ఉమ్మడి ప్రయోజనాలను మరింత పెంపొందించుకునేందుకు భావసారూప్యం కలిగిన మిత్ర దేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుందని రక్షణ మంత్రి అన్నారు. అమెరికాతో మన వ్యూహాత్మక భాగస్వామ్యం మునుపటికంటే మరింత బలపడిందన్నారు. జపాన్, ఆస్ట్రేలియా, రష్యాలతో భారత్ మైత్రి బలోపేతమైందన్నారు. ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి విశ్వసనీయ మిత్రదేశాలతో కూడా భారత్ కు ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉందని అన్నారు.

   “పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం” అన్నది భారత విదేశాంగ, భద్రతా విధానం ప్రధాన స్వభావమని అన్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014నుంచి వ్యక్తిగతమైన శ్రద్ధను చూపుతూ వస్తున్నారని, గుణాత్మకమైన, ప్రగతి శీలమైన భాగస్వామ్య నిర్మాణం లక్ష్యంగా పొరుగుదేశాలతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.  ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడమే తన అజెండాగా మార్చుకున్న పాకిస్తాన్ ను మినహాయిస్తే, మిగతా పొరుగుదేశాలతో భారత్ కు మెరుగైన సంబంధాలే ఉన్నాయన్నారు. పరస్పర గౌరవం, పరస్పరం ప్రయోజనాల సాధనే లక్ష్యంగా మిత్రదేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

  పశ్చిమాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో భాగస్వామ్య సంబంధాలకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆసక్తి చూపారని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి చొరవతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.), ఒమన్, ఇండోనేసియా, వియత్నాం, దక్షిణ కొరియా వంటి దేశాలతో మన సంబంధాలు మరింత బలపడ్డాయని,  రానున్న దశాబ్దంలో ఈ సంబంధాలు మరింత పటిష్టపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. దేశంలో పెట్టుబడులు పెట్టి, దేశ నిర్మాణంలో శ్రద్ధచూపే తయారీ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటుచేసుకునే విధానాలను భారత్ రూపొందించు కొందన్నారు. దేశాన్ని మరింత స్వావలంబన దిశగా నడిపించే దీర్ఘకాలిక విధానం లక్ష్యంగా, రక్షణ పరికరాల తయారీలో మేక్ ఇన్ ఇండియా భావనను అమలుచేస్తున్నామని అన్నారు.

  మారుతున్న యద్ధ స్వభావాన్ని గురించి ఆయన వివరిస్తూ, భారతదేశానికి మంచి అనుసంధానం, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. రక్షణ సిబ్బందికి ఉమ్మడిగా ఒక అధిపతిని నియమించుకోగలిగామని, సైనిక కార్యకలాపాల శాఖను మరింత పటిష్టం చేసుకున్నామని, సాయుధ బలగాలను కూడా మరింత సమీకృతం చేసుకోగలగిగామని చెప్పారు.

  అంతర్గత భద్రతా సవాళ్లను పరిష్కారానికి త్రిముఖ విధానాన్ని రూపొందించుకున్నట్టు చెప్పారు. ఉగ్రవాదంతో దెబ్బతిన్న బాధితులకు న్యాయం చేయడం, ఉగ్రవాద ప్రాబల్యం కలిగిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అసంతృప్తితో ఉన్న వర్గాలకు, గ్రూపులకు రాజకీయ చర్చలతో పరిష్కారం చూపించి సంతృప్తి పరచడం ఇందుకోసం ప్రభుత్వం మరింత చొరవ చూపడం..ఇలాంటి  కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. నిస్సహాయులైన పౌరులను దోచుకునేందుకు అవకాశం ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా భూమి, కార్మిక శక్తి, పెట్టుబడులు, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించినట్టు రక్షణ మంత్రి చెప్పారు.

****


(Release ID: 1670462) Visitor Counter : 267