శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
చెన్నై లోని 4 వ బెటాలియన్ సెంటర్ లో 10 పడకల "మేక్ షిఫ్ట్ ఆసుపత్రి" మరియు "ఐసోలేషన్ కేంద్రాన్ని" ప్రారంభించిన - డాక్టర్ హర్ష వర్ధన్
రోగులకు భద్రత, రక్షణ, సౌకర్యవంతమైన జీవన వాతావరణంతో కూడిన ప్రాధమిక ఆరోగ్య సదుపాయాన్నిఅందించడానికి ఒక పరిష్కారంగా "మేక్ షిఫ్ట్ హాస్పిటల్" అనే కొత్త సదుపాయాన్ని చెన్నై లో రూపొందించడం జరిగింది
ఇది ఒక మడత పెట్టడానికి అవకాశం ఉన్న స్టీల్ ఫ్రేముల నిర్మాణం. ఒక వ్యక్తి తన భుజంపై కొన్ని ఫ్రేములను మోసుకుని వెళ్ళి, అతి తక్కువ సమయంలో, ఏ ప్రదేశంలోనైనా, అతను ఈ నిర్మాణాన్ని అమర్చగలుగుతాడు : డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
04 NOV 2020 5:15PM by PIB Hyderabad
చెన్నై లోని 4 వ బెటాలియన్ సెంటర్ లో సి.ఎస్.ఐ.ఆర్. ఏర్పాటు చేసిన 10 పడకల "మేక్ షిఫ్ట్ ఆసుపత్రి" మరియు "ఐసోలేషన్ కేంద్రాన్ని" కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, కోవిడ్-19 కారణంగా ఏర్పడిన కొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి వీలుగా వినూత్న పరిష్కారాలను కనుగొన్నందుకు, సి.ఎస్.ఐ.ఆర్-ఎస్.ఈ.ఆర్.సి. (స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పరిశోధన కేంద్రం) మరియు దాని శాస్త్రవేత్తలతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్) ను అభినందించారు. ఈ ఏడాది ఆగష్టు లో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ఎన్.డి.ఆర్.ఎఫ్. ప్రాంగణంలో కూడా ఇదేవిధమైన "మేక్-షిఫ్ట్ ఆసుపత్రి" సదుపాయాన్ని నిర్మించిన విషయాన్ని, ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. "రోగులకు భద్రత, రక్షణ, సౌకర్యవంతమైన జీవన వాతావరణంతో కూడిన ప్రాధమిక ఆరోగ్య సదుపాయాన్ని అందించడానికి ఒక పరిష్కారంగా "మేక్ షిఫ్ట్ హాస్పిటల్" అనే కొత్త సదుపాయాన్ని చెన్నై, ఎన్.డి.ఆర్.ఎఫ్. లోని 4 వ బెటాలియన్ సెంటర్ లో రూపొందించడం జరిగింది. సుదీర్ఘమైన 20 సంవత్సరాల జీవితకాలం ఇది పనిచేస్తుంది." అని ఆయన వివరించారు. "ఇది ఆధునిక, మన్నికైన, వేగంగా ఏర్పాటు చేయగల, సురక్షితమైనది. భౌగోళికంగా మరియు విపత్తు పునరుద్ధరణకు మరియు దీర్ఘకాల మహమ్మారి లేదా అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడే అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన, వేగంగా అమలు చేయగల సాంకేతికతను ఇది కలిగిఉంది." అని ఆయన తెలియజేశారు. "ఇది ఒక మడత పెట్టడానికి అవకాశం ఉన్న స్టీల్ ఫ్రేముల నిర్మాణం. ఒక వ్యక్తి తన భుజంపై కొన్ని ఫ్రేములను మోసుకుని వెళ్ళి, అతి తక్కువ సమయంలో, ఏ ప్రదేశంలోనైనా, అతను ఈ నిర్మాణాన్ని అమర్చగలిగే విధంగా, సి.ఎస్.ఐ.ఆర్-ఎస్.ఈ.ఆర్.సి. ప్రయోగశాల ఈ నూతన సదుపాయాన్ని రూపొందించింది." అని కూడా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
మందులు, పి.పి.ఈ. కిట్లు, పరీక్షలు, ఎక్కువకాలం నిల్వ ఉండి, వెంటనే తినడానికి వీలైన పౌష్టిక ఆహారం వంటి వివిధ రంగాలలో వినూత్న పరిష్కారాలను అందించడంలో, అదేవిధంగా బహుళ ప్రయోజనకర శిబిరాలను, ఆసుపత్రులను స్థాపించడంలోనూ, సి.ఎస్.ఐ.ఆర్. చేస్తున్న ప్రయత్నాలను కూడా మంత్రి అభినందించారు. "శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఎన్.డి.ఆర్.ఎఫ్. మొదలైన వారందరి కృషి వలన, భారతదేశం రికవరీ రేటు ఈ రోజు 92 శాతానికి పైగా ఉంది" అని కూడా ఆయన తెలియజేశారు.
సి.ఎస్.ఐ.ఆర్, డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మాండే మాట్లాడుతూ, వేగంగా అవసరమయ్యే నిర్మాణాలతో సహా వివిధ అవసరాలకు వినూత్న పరిష్కారాలను తీసుకురావడంలో, సి.ఎస్.ఐ.ఆర్. శాస్త్రవేత్తలు కోవిడ్-19 కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో మొదటి రోజు నుండే పాల్గొన్నారని, పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో ఒక్కొక్కటి 50 పడకల సామర్థ్యం గల మూడు ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి గాను, ఆ రాష్ట్ర ప్రభుత్వం సి.ఎస్.ఐ.ఆర్.ను సంప్రదించిందనీ, సి.ఎస్.ఐ.ఆర్. త్వరలో వాటిని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ నిర్మిస్తుందనీ, ఆయన తెలిపారు. ఈ సాంకేతికతను ప్రదర్శించడం ద్వారా పొందిన అనుభవంతో, సి.ఎస్.ఐ.ఆర్-ఎస్.ఈ.ఆర్.సి. ఇప్పుడు 100 పడకల గుణిజాలలో ఈ సౌకర్యాన్ని పెంపొందించగలదనీ, భారతదేశంలో ఎక్కడైనా, సాంకేతిక భాగస్వాములతో కలిసి, దీన్ని సమర్థవంతంగా అమలు చేయవచ్చుననీ, ఆయన చెప్పారు.
ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్, శ్రీ ఎస్. ఎన్. ప్రధాన్ మాట్లాడుతూ, వివిధ ప్రదేశాలలో ఉన్న ఎన్.డి.ఆర్.ఎఫ్. సౌకర్యాల వద్ద ఇటువంటి మరిన్ని ప్రాజెక్టు లను ఏర్పాటుచేయాలని, సి.ఎస్.ఐ.ఆర్ ను ఆహ్వానించారు. నెలల తరబడి తమ సిబ్బందిని నియమించే అవకాశం ఉన్న, సుదూర మారుమూల ప్రాంతాలలో ఉపశమనం మరియు సహాయ రక్షణ సవాళ్లను ఎదుర్కోవటానికి వీలుగా ఎన్.డి.ఆర్.ఎఫ్. కోసం ఇటువంటి పరిష్కారాలు అవసరమనీ, ఆయన అన్నారు. "విపత్తు నిర్వహణ అధికారులు అటువంటి ఆశ్రయాలను సిద్ధంగా ఉంచవచ్చు మరియు వివిధ రాష్ట్రాల్లో తక్షణ అవసరం కోసం వాటిని విపత్తు ప్రదేశానికి రవాణా చేయవచ్చు". అని ఆయన అన్నారు. మాడ్యులర్ గా మరిన్ని బేలను జోడించడం ద్వారా, శాంతి సమయంలో, వైద్య బృందాల కోసం గిడ్డంగులు, పాఠశాలలు, విశ్రాంతి గృహాలు మరియు పర్యాటక శిబిరాలను కూడా నిర్మించవచ్చు ”, అని ఆయన పేర్కొన్నారు.
చెన్నైలోని సి.ఎస్.ఐ.ఆర్-ఎస్.ఈ.ఆర్.సి. సహకారంతో, న్యూఢిల్లీ లోని ఎన్.డి.ఆర్.ఎఫ్., హెచ్.క్యూ. 37.67 లక్షల రూపాయల వ్యయంతో, ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సదుపాయంలో ఈ.సి.జి. మానిటర్లు, డీఫిబ్రిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్, అత్యవసర ఆక్సిజన్ సరఫరా సిలిండర్లు మొదలైనవి ఉన్నాయి. కోవిడ్-19 సోకి, వివిధ విపత్తు సహాయక చర్యల నుండి తిరిగి వచ్చిన, ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బందికి వైద్య సంరక్షణ అందించడానికి ఇటువంటి సదుపాయం అవసరం ఎంతైనా ఉంది.
అరక్కోణం వద్ద ఉన్న ఈ వ్యవస్థ, వేగంగా గట్టిపడి, మడత పెట్టడానికి సులువుగా, బరువులో తేలికగా, సురక్షితమైన, సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో, తగినంత థర్మల్ ఇన్సులేషన్, నీరు లోపలికి రాకుండా మొదలైన లక్షణాలతో ఎప్పటికప్పుడు తిరిగి నిర్మించుకోడానికి వీలుగా, స్థానికంగా లభించే నైపుణ్యాలను ఉపయోగించుకునేలా, రూపొందించబడింది. ముందుగా రూపకల్పన చేసి రూపొందించిన ఈ "మేక్ షిఫ్ట్ ఆసుపత్రి" నిర్మాణాలు కనీస సహాయం మరియు పరికరాలతో వేగవంతంగా నిర్మించడానికి అనువుగా ఉండడంతో పాటు, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ నిర్మాణ సామాగ్రిని నిల్వ చేయడం, రవాణా చేయడం కూడా చాలా సులభం మరియు విస్తరించడానికి అనువుగా ఉంటాయి.
హానికరమైన యు-వి కిరణాల నుండి ప్రజలను రక్షించడానికి, అతినీలలోహిత స్వభావానికి వ్యతిరేకమైన అదనపు లక్షణాలతో పాటు, ఉన్నతమైన నిర్మాణ పనితీరు, నీటి తడిని తట్టుకునే, అగ్ని మాపకత, మన్నిక, తిరిగి ఉపయోగించుకునే అవకాశం, బాక్టీరియాను నిరోధించే సామాగ్రి వంటి అదనపు, ప్రత్యేక లక్షణాలు ఇందులో ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో - చెన్నై లోని సి.ఎస్.ఐ.ఆర్-ఎస్.ఈ.ఆర్.సి. లో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పళని; చెన్నై లోని ఎస్.ఈ.ఆర్.సి. డైరెక్టర్, ప్రొఫెసర్ ఎస్.కపూరియా తో పాటు , సి.ఎస్.ఐ.ఆర్; మరియు ఎన్.డి.ఆర్.ఎఫ్. కు చెందిన పలువురు ఇతర శాస్త్రవేత్తలు, అధికారులు ఆన్-లైన్ విధానంలో పాల్గొన్నారు .
*****
(Release ID: 1670244)
Visitor Counter : 183