శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సి.ఎస్.ఐ.ఆర్-సి.డి.ఆర్.ఐ. శాస్త్రవేత్త సుశాంత కర్ కు సత్కారం

“ప్రొఫెసర్ ఎ.ఎన్. భదూరి స్మారకోపన్యాస అవార్డు"కు
ఎంపిక చేసిన బయలాజికల్ కెమిస్ట్స్ సొసైటీ

Posted On: 04 NOV 2020 6:06PM by PIB Hyderabad

వ్యాధికారకమైన లీస్మానియా డొనోవాని అనే పరాన్నజీవిపై పరిశోధనలకు గుర్తింపుగా డాక్టర్ సుశాంతకర్ అనే శాస్త్రవేత్తకు సముచిత సత్కారం లభించింది. లక్నోలోని విజ్ఞాన శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి-కేంద్రీయ ఔషధ పరిశోధనా సంస్థ (సి.ఎస్.ఐ.ఆర్.-సి.డి.ఆర్.ఐ.) సీనియర్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ సుశాంతకర్,.. 2020వ సంవత్సరపు ప్రొఫెసర్ ఎ.ఎన్. భదూరీ స్మారకోపన్యాస అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ జీవరసాయన శాస్త్రవేత్తల సంఘం  సుశాంతకర్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సి.డి.ఐ.ఆర్.కు చెందిన మాలిక్యులర్ ప్యారసైటాలజీ, ఇమ్యూనాలజీ పరిశోధనా విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా సుశాంతకర్ పనిచేస్తున్నారు.

 

   జంతుశాస్త్రంలో ప్రొటోజువా కుటుంబానికి చెందిన లీస్మానియా డొనోవానీ అనే పరాన్నజీవి మానవ శరీరాన్ని సోకితే కాలా అజర్ అనే ఒకరకమైన తీవ్రమైన జ్వరం, చర్మవ్యాధులు కలుగుతాయి. ప్రమాదకరమైన ఈ అంటువ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది బాధపడుతున్నారు. మైక్రోఫాగస్, డెండ్రైటిక్ వంటి వ్యాధినిరోధక శక్తి కలిగిన కణాలు, టీ సెల్స్ తో  లిస్మానియా అనే పరాన్నజీవి జరిపే ప్రతిచర్యలపై సుశాంతకర్ బృందం ప్రభావశీలమైన అధ్యయనం, పరిశోధన జరిపింది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తికలిగిన కణాలపై ఈ పరాన్నజీవి దుష్ప్రభావాన్ని ఈ బృందం కనుగొన్నది.

  దేశంలో జీవశాస్త్ర సంబంధమైన పరిశోధనలను ప్రోత్సహించేందుకు, ఈ రంగంలో శాస్త్రవేత్తల, పరిశోధకుల ప్రతిభావంతమైన పరిశోధనా సేవలను గుర్తించేందుకు ప్రతిష్టాత్మకమైన భారతీయ బయోలాజికల్ కెమిస్టుల సొసైటీ (ఎస్.బి.సి.-ఐ) పలు అవార్డులను ఏర్పాటు చేసింది. (ఎస్.బి.సి.-ఐ) 1930లో,..బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైంది. చేశారు. అప్పటి మైసూరు రాజా సంస్థానం ఆధ్వర్యంలో ఈ సొసైటీ నమోదైంది.

  ప్రతి రెండేళ్లకూ ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డు అందుకోవడానికి అభ్యర్థి వయస్సు 50సంవత్సరాల లోపుగా ఉండాలి. జీవ రసాయన శాస్త్రంలో, అనుబంధ శాస్త్రాల్లో పరిశోధనను,.. ప్రత్యేకించి పరాన్నజీవుల కారణంగా సోకే అంటువ్యాధులపై పరిశోధనను గుర్తిస్తూ ఈ అవార్డుకు శాస్త్రవేత్తలను ఎంపిక చేస్తారు.

*****


(Release ID: 1670230) Visitor Counter : 176