మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్ ఐ టి సిల్చార్ 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర విద్యాశాఖ మంత్రి విర్చువల్ ప్రసంగం.
లక్షలాది మంది విద్యార్థులు తమ తమ జీవితాల్లో వృద్ధి సాదించడానికి, ఉన్నతస్థాయికి చేరుకోవడానికి నూతన విద్యా విధానం -2020 దోహదం చేస్తుంది : శ‌్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్
Posted On:
02 NOV 2020 5:26PM by PIB Hyderabad
ఎన్ ఐ టి సిల్చార్ 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ప్రసంగించారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన ఆయన విర్చువల్ గా ఈ ప్రసంగం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
విద్యాభ్యాసం చేసి పట్టాలు పొందిన విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇది వారి జీవితంలో మరిచిపోలేని రోజని ఆయన అన్నారు. ఎన్ ఐ ఆర్ ఎఫ్ 2020 ప్రకటించిన జాబితాలో ఎన్ ఐ టి సిల్చార్ కు 46వ ర్యాంకు దక్కినందుకు కేంద్ర మంత్రి అభినందించారు. ఎన్ ఐ ఆర్ ఎఫ్ 2019 జాబితాతో పోల్చితే ఈ సారి ర్యాంకు మెరుగైందని ఆయన అన్నారు. అంతే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్ ఐ టి సిల్చార్ ప్రతిభ చూపుతోందని అన్నారు. జాతీయ విద్య స్థాయిని అంతర్జాతీయ వేదికలపై ఘనంగా చాటుతున్నందుకు ఎన్ ఐటి సిల్చార్ ను ఆయన అభినందించారు.
చరిత్రలో భారతదేశ విద్యావ్యవస్థకుగల పేరు ప్రఖ్యాతులను ఈ సందర్భంగా కేంద్రమంత్రి గుర్తు చేశారు. దేశ విదేశాలనుంచి పలువురు విద్యార్థులు భారతదేశంలోని నలందా, తక్షశిల, విక్రమశిల విద్యాలయాలకు వచ్చి విద్యనభ్యసించిన విషయాన్ని ప్రస్తావించారు. మన ప్రాచీన విద్యా వ్యవస్థ గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలోని పండితులైన అధ్యాపకులు, విద్యార్థుల సాయంతో భారతీయ విలువల ఆధారిత విద్యా వ్యవస్థ అనేది విశ్వగురువుగా అవతరిస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం -2020కి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. అవి విద్యార్థులు తమ తమ జీవితాల్లో ఉన్నతస్థాయికి చేరుకోవడానికి దోహదం చేస్తాయని అన్నారు. ఎన్ ఇ పి -2020 ప్రకారం కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులను ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వున్న వంద విశ్వవిద్యాలయాలు, ప్రసిద్ధ సంస్థలతో భాగస్వామ్యం పెట్టుకుంటున్నామని వాటి కార్యాలయాలను దేశంలో తెరవడమే కాకుండా వివిధ అంశాల్లో ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆయన అన్నారు. దేశంలోని ప్రతిభగల వారు తమ పేటెంట్లను పెంచుకునే విధంగా, దేశ ఆర్ధిక అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని అన్నారు.
జాతీయ పరిశోధన నిధి, జాతీయ సాంకేతిక వేదిక ప్రారంభమయ్యాయని ఇవి ప్రధాని శాస్త్ర సాంకేతిక సలహాదారు ఆధ్వర్యంలో పని చేస్తాయని అన్నారు. ఇవి దేశంలోని పరిశోధన, అభివృద్ధి రంగాలను పూర్తిగా మార్చేస్తాయని ఆయన అన్నారు. ఎన్ ఇ పి -2020 కి మూలస్తంభాలైన సంస్కరణలు, మార్పు, కార్యాచరణ గురించి ఆయన వివరించారు. ఇవి దేశంలోని విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని అన్నారు. దేశ విద్యావ్యవస్థను అంతర్జాతీయ వేదికల మీద నిలబెడతాయని అన్నారు. ఇప్పుడు పట్టాలు పొంది బైటకు వెళ్లిపోతున్న విద్యార్థులు భవిష్యత్తులో తమ విద్యాసంస్థతో సంబంధాలు కొనసాగించాలని తమ విద్యాసంస్థ సుస్థిరమైన భవిష్యత్తును సాధించడానికిగాను వారు కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ కోరారు. అల్యుమ్నై టాస్క్ ఫోర్స్ ( పూర్వవిద్యార్థుల సంఘం) ఏర్పడాలని ఆయన సూచించారు.
దివంగత ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ...నాడు ఇచ్చిన జై జవాన్, జైకిసాన్ పిలుపుకారణంగా భారత దేశ వ్యవసాయ రంగం తన కాళ్ల మీద తాను నిలబడుకున్నదని కేంద్ర మంత్రి అన్నారు. ఆ తర్వాత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఇచ్చిన జై విజ్ఞాన్ పిలుపు కారణంగా దేశ శాస్త్ర పరిశోధనా రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని, అణుశక్తి దేశాల సరసన భారతదేశం నిలిచిందని అన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జై అనుసంధాన్ విధానం ద్వారా దేశంలోని పరిశోధన, అభివృద్ధి రంగాలను ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నారని అన్నారు. ఎన్ ఇపి-2020 ద్వారా విద్య, పరిశోధన రంగాల్లో భారతదేశం తన గత వైభవాన్ని సాధిస్తుందని అన్నారు. యుక్తి 2.0 పోర్టల్ ద్వారా దేశంలోని నిపుణులు చేస్తున్న కృషిని వివరించారు.అంతే కాదు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలద్వారా కేంద్ర ప్రభుత్వం యువతకు అందిస్తున్న సహకారం గురించి కూడా వివరించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధ భారతదేశ సాధన సాధ్యమవుతుందని అన్నారు.
స్నాతకోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ శరబానంద సోనోవాల్...పట్టాలు పొందిన విద్యార్థులను అభినందించారు. సంస్థ సాధించిన విజయాలపట్ల సంతోషం ప్రకటించారు. విద్యార్థులు భవిష్యత్తులో తాము సాధించాల్సిన లక్ష్యాలపట్ల దృష్టిపెట్టి ముందుకు సాగాలని అన్నారు. శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. శారీరక మానసిక ఆరోగ్యాల సమన్వయంకోసం స్వామి వివేకానంద సూచించిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. విద్యార్థులందరూ ఐకమత్యంతో కృషి చేసి.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కన్న నూతన భారతదేశ కలను సాకారం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్ ఐటి సిల్చార్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివాజీ బంధోపాధ్యాయ సంస్థ చేపట్టిన కార్యక్రమాలగురించి వివరించారు. కేంద్రప్రభుత్వం, విద్యాశాఖ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
తర్వాత పలు విభాగాల్లో పతకాలను సాధించిన విద్యార్థుల పేర్లను ప్రకటించారు. వివిధ విభాగాల్లో పట్టాలు పొందిన వారి వివరాలను తెలియజేశారు.
****
(Release ID: 1669666)
Visitor Counter : 170