జల శక్తి మంత్రిత్వ శాఖ

సంబంధిత భాగస్వాములతో జల్ జీవన్ మిషన్ సమాలోచనలు:

ప్రధాని ఆశిస్తున్న విధంగా ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపు

Posted On: 02 NOV 2020 4:35PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యతా పథకాలలో ఒకటైన జల్ జీవన్ మిషన్ 2024 నాటికి ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరందించటం లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేస్తూ  వాళ్ళ జీవితాలను మెరుగు పరచాలన్నది ప్రభుత్వధ్యేయం. 2019 ఆగస్టు 15న ప్రధాని ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ, జలసంరక్షణ అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలా మిగిలిపోకూడదని, ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి గ్రామీణ నివాసానికీ 100 శాతం త్రాగు నీరు అందించాలన్న ఈ మిషన్ లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయటానికి వివిధ భాగస్వాములు చేతులు కలిపి ఉమ్మడిగా కృషి కొనసాగించాలని, అప్పుడే అందరికీ నీటి భద్రత సాధ్యమని అన్నారు.

జల శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జల్ జీవన్ మిషన్ ఈ క్రమంలో భాగంగా  ఫౌండేషన్లు, ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు పరిశోధన-అభివృద్ధి సంస్థలు తదితరులు ఉచితంగా సేవలందిస్తూ ఈ రంగంలో భాగస్వాములుగా ఉండటానికి తమ ఆసక్తి అభివ్యక్తీకరణ దరఖాస్తులు పంపాలని కోరింది. ఈ బృహత్ పథకంలో స్వచ్ఛందంగా సేవలందించాలని కోరుతోంది. విస్తృతంగా ప్రజలతో సంబంధమున్న ఈ సంస్థలు ఇప్పటికే ప్రజల నీటి అవసరాల మీద పనిచేస్తున్నాయి.

ఇలాంటి 50 కి పైగా సంస్థలతో జాతీయ జల్ జీవన్ మిషన్ ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. మిషన్ డైరెక్టర్, అదనపు కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ మిషన్ లో పాలుపంచుకోవటానికి ఆసక్తి ఉన్న సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని దీన్ని అమలు చేయటంలో వాళ్ళ పాత్ర గురించి, బాధ్యతల గురించి చర్చించారు.

స్థానిక ప్రజలను చేరుకోవటానికి ఈ భాగస్వాములతో కలసి ముందడుగు వేయాలని జల్ జీవన్ మిషన్ భావిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, చారిటీ సంస్థలు, త్రాగు నీటి రంగంలో పనిచేసే వృత్తి నిపుణులతో కలసి లక్ష్య సాధన దిశలో ప్రజలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించుకుంది.  వీళ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని గడువులోగా పుర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విధమైన సహకారం ద్వారా సాధించగలిగే అంశాలను, వివిధ సంస్థల బలాబలాలను వివిధ రాష్ట్రాలలో వారు చేయగల నిర్దిష్ట కార్యక్రమాలు, ప్రజలను సన్నద్ధం చేసే క్రమాన్ని, ప్రాథమిక సర్వే నిర్వహణ, సామర్థ్య నిర్మాణం, నైపుణ్య శిక్షణ, గ్రామీణ ప్రజలను భాగస్వాములను చేయటం, జల సంరక్షణ, పర్యవేక్షణ, అన్ని కార్యకలాపాలనూ అక్షరబద్ధం చేయటం తదితర అంశాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు.

వికేంద్రీకరించిన, అవసరం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ కార్యక్రమం అమలు వలన ప్రజలలో సొంతదారులమనే భావన పెరుగుతుందని, స్థానికులు గర్వంగా భావిస్తారని, వాళ్లలో బలమైన నమ్మకం కలుగుతుందని, అదే సమయంలో పారదర్శకత కనబడుతుందని అంచనా వేస్తున్నారు. దీనివలన మెరుగైన అమలు తీరు కనబడటంతోబాటు దీర్ఘ కాలంలో నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణ కూడా సిద్ధమవుతుందని భావిస్తున్నారు.  గ్రామపంచాయితీలు, పానీ సమితి లాంటి వాడకం దారుల ఉపసంఘాలు ఏర్పాటై గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రణాళిక మొదలుకొని నిర్మాణం, నిర్వహణ దాకా పాల్గొంటూ చివరిదాకా అందులోనే ఉంటారనే అభిప్రాయానికొచ్చారు.

తగ్గిపోతున్న నీటి నిల్వలు, నీటి నాణ్యత, గ్రామాల్లో మౌలిక సదుపాయాల లేమి, నిర్వహణలో లోపం, తగిన వనరులు లేకపోవటం, వివిధ రంగాల నుంచి నీటికోసం వస్తున్న డిమాండ్ లాంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటూ సమగ్రంగా పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. జీవితాలను మార్చివేసే ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి, సత్ఫలితాలు ఇవ్వటానికి  ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అనివార్యమని తేల్చింది. నీటిని అందరి పనిగా మార్చాలన్న ప్రధాని పిలుపుకు అనుగుణంగా అన్ని సంస్థలూ కలిసి ప్రజలకు నీటి రక్షణ కల్పించటానికి కట్టుబడ్డాయి.

***


(Release ID: 1669531) Visitor Counter : 167