సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించ‌నున్న‌ మన్సార్ లేక్ ప్రాజెక్ట్: డాక్టర్ జితేంద్ర సింగ్


Posted On: 01 NOV 2020 5:42PM by PIB Hyderabad

దాదాపు 70 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మన్సార్ సరస్సు అభివృద్ధి ప్రణాళిక నెరవేర‌బోతోంద‌ని ఈశాన్య ప్రాంతపు అభివృద్ది శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా), ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం శాఖ‌, ప్రజా మనోవేదనల శాఖ‌, కేంద్ర ‌పెన్షన్ల శాఖ‌, అణుశక్తి శాఖ‌, అంతరిక్ష శాఖ‌ల స‌హాయ ‌మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మ‌న్సార్ ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఈ రోజు గొప్ప చారిత్రాత్మక దినం అ‌ని వివ‌రించారు. మన్సార్ సరస్సు పునరుజ్జీవనం / అభివృద్ధి ప్రణాళిక కార్య‌క్ర‌మానికి ఆయ‌న ఈ-శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ప్రారంభించిన జాతీయ ప్రాజెక్టుల సంఖ్య.. గ‌డిచిన‌ ఏడు దశాబ్దాల కాలంలో  ప్రారంభించిన ఇటువంటి ప్రాజెక్టుల సంఖ్య కంటే ఎక్కువ అని వివ‌రించారు.

న‌మ్మ‌శ‌క్యం కాని అద్భుత‌మైన అభివృద్ధి ఇక్క‌డ చాలా స్పష్టంగా క‌నిపిస్తుంది. మన్సార్ సరస్సు పునరుజ్జీవనం/ అభివృద్ధి ప్రణాళిక అమ‌లు త‌రువాత మన్సార్ ప్రాంతంలో పర్యాటకులు/ యాత్రికుల సంఖ్య ప్రస్తుత ఉన్న సంవ‌త్స‌రానికి 10 లక్షల నుండి.. 20 లక్షలకు పెరుగుతుందని మంత్రి తెలిపారు. మన్సార్ సరస్సు పునరుజ్జీవనం / అభివృద్ధి ప్రణాళిక అమ‌లు సుమారుగా 1.15 కోట్ల ప‌ని రోజుల ఉపాధి కల్పించడానికి దోహ‌దం చేస్తుంద‌ని.. సంవత్సరానికి రూ. 800 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి జమ్మూ, కాశ్మీర్‌ అభివృద్ధిలో అత్యధిక ప్రాధాన్యత లభించింద‌ని అన్నారు. ముఖ్యంగా ఉధంపూర్-దోడా-కతువా పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మైలురాయిగా నిలిచే అభివృద్ధిప‌నుల‌తో భారత్‌లోని ఇతర లోక్‌సభ నియోజకవర్గాలతో స‌రిస‌మానంగా పోల్చవచ్చ‌ని అన్నారు. మూడు సంవత్సరాలలో 3 మెడికల్ కాలేజీలు పొందిన దేశంలోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గం ఉధంపూర్-దోడా-కథువా అని అన్నారు.

నమామి గంగా మరియు గంగా శుభ్రపరిచే ప్రాజెక్టుల మాదిరిగానే దేవికా నది పున‌రుజ్జీవ‌నం మరియు మన్సార్ సరస్సు పునరుద్ధరణ వంటి ప‌లు ప్రాజెక్టులను సొంతం చేసుకున్న ఏకైక జిల్లా బహుశా దేశంలో ఉధంపూర్ మ‌త్రామే అని మంత్రి తెలిపారు. దేవికా ప్రాజెక్ట్ మరియు మన్సార్ ప్రాజెక్ట్‌ల‌కు దాదాపుగా రూ.200 కోట్లు ఖ‌ర్చ‌వుతుందని మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ అన్నారు. వీటి మ‌ధ్య ఇతర సారూప్యతలు కూడా ఉన్నాయ‌ని అన్నారు. ఉదాహరణకు, దేవికా నది గంగా మాత‌ సోదరి అని, మన్సార్ సరస్సును గురించి మహాభారతం రచనలలో కూడా ప్ర‌స్థావ‌న ఉంద‌ని తెలిపారు. ఊహ‌కంద‌ని విధంగా గడిచిన ఆరు  సంవత్సరాల కాలంలో చేప‌ట్టిన ఇలాంటి ప‌లు కొత్త ప్రాజెక్టుల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. దీనికి తోడు దశాబ్దాల కాలంగా మ‌రుగున ప‌డిపోయిన ప‌లు ప్రాజెక్టుల‌ను కూడా పున‌రుద్ధ‌రించిన‌ట్టుగా ఆయ‌న వివ‌రించారు. ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత జోక్యంతో కంది నీటిపారుదల ప్రాజెక్టులు 4 దశాబ్దాల తరువాత పునరుద్ధరించబడింద‌ని తెలిపారు. షాపూర్, ఉజ్ బహుళార్ధసాధక ప్రాజెక్టు కూడా దాదాపు ఐదు దశాబ్దాల తరువాత పునరుద్ధరించబడిందని ఆయన ఈ సంద‌ర్భంగా ఉదహరించారు. దీనికి తోడు అదే పరిసరాల్లో, ఉత్తరభారతపు మొట్టమొదటి బయోటెక్ ఇండస్ట్రియల్ పార్క్, తొలి విత్తన-ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా రాబోతున్నాయని ఆయ‌న తెలిపారు. ఇది ఉద్యోగ అవకాశాలను, త‌గిన జీవనోపాధిని, పరిశోధన వనరులను సృష్టిస్తుందని అన్నారు. దీనికి తోడు ఖ‌త్రా -ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ను ప్రారంభించిన సంగ‌తిని కూడా ఆయ‌న ఇక్క‌డ ప్ర‌స్తావించారు. జ‌మ్ము జాతీయ ర‌హ‌దారికి ఉన్న నాలుగు లేన్ల ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌ల‌కు విస్త‌రించే ప‌నుల‌ను కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

ప్రపంచంలోని అతి ఎత్తైన రైల్వే వంతెన రియాసిలో రాబోతుండగా, సుధ్మహదేవ్ నుండి మార్మట్ మీదుగా ఖిలేని వరకు కొత్త జాతీయ రహదారి ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. కేవ‌లం ఓటు బ్యాంకు కోసం ప‌ని చేయ‌డం త‌మ నైజం కాద‌ని.. నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప‌లు సౌకర్యాలను అందించేలా సాగుతున్న ప్రయత్న‌మిద‌ని తెలిపారు.

కిష్త్వార్‌లోని సుదూర ప్రాంతమైన పద్దర్‌కు రెండేళ్ల క్రితం.. కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌కూర్చిన‌ నిధుల‌తో మొదటి కళాశాల లభించగా, కేంద్ర ప్రభుత్వపు ఉడాన్ పథకం కింద కిష్త్వార్‌లో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది అని ఆయన అన్నారు. అదేవిధంగా, పోఘల్-ఉఖ్రాజ్ మరియు మర్మత్ యొక్క సుదూర ప్రాంతానికి వారి మొట్టమొదటి డిగ్రీ కళాశాల లభించింది. గండోకు మొట్టమొదటిసారిగా పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వారు కొన్ని ద‌శాబ్ధాలుగా కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా పని చేసిన‌ప్ప‌టికీ క‌ళాశాల‌లు, త‌పాలా కార్యాలయాల‌ను అందుబాటులోకి తేలేద‌ని ఆయ‌న అన్నారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా మాట్లాడుతూ తీర్థయాత్ర మరియు వారసత్వ దృక్పథం నుండి మన్సర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంద‌ని తెలిపారు. అలాగే స‌విస్తారమైన మన్సార్ సరస్సు మరియు దాని వృక్షజాలం మరియు జంతుజాలం కారణంగా అత్యంత ఆకర్షణీయమైన వారసత్వ సంప‌ద‌గానూ ఎంతో ప్రాముఖ్యతను క‌లిగి ఉంద‌ని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ జీడీపీలో పర్యాటక శాఖ వాటా ఏడు శాతంగా ఉంద‌ని, అయితే కరోనా కారణంగా ఈ రంగం తీవ్రంగా దెబ్బతిందని ఆయన అన్నారు. పర్యాటక పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించడానికి గాను భారీస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇక్క‌డ పర్యాటక రంగానికి కేంద్రం రూ.706 కోట్లు నిధులు ఇచ్చిందని, జమ్మూ కాశ్మీర్‌ను ప్రపంచ పటంలో అత్యంత ఇష్టపడే పర్యాటక కేంద్రంగా మార్చ‌డానికి తాము బహుముఖ విధానాల‌ను అవలంబిస్తున్నామని ఆయన చెప్పారు. జ‌మ్ము, కాశ్మీర్ లెప్ట‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌ల‌హాదారు శ్రీ బ‌షీర్ అహ్మ‌ర్ ఖాన్‌, ప‌ర్య‌ట‌క శాఖ కార్య‌ద‌ర్శి స‌ర్మ‌ద్ హ‌ఫీజ్‌, డివిజ‌న‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ సంజీవ్ వ‌ర్మ‌, జ‌మ్ము టూరిజం డైరెక్ట‌ర్ శ్రీ ఆర్‌.కె.ఖ‌తోచీ, సురిన్స‌ర్‌-మాన్స‌ర్ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సీఈఓ డాక్ట‌ర్ గుర్విధ‌ర్ జిత్ సింగ్‌తో పాటు జ‌మ్ము, శ్రీ‌న‌గ‌ర్‌కు చెందిన సీనియ‌ర్ అధికారులు ఈ వెబ్‌నార్‌, ఈ-ప్రారంభోత్స‌వ‌పు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

*****


(Release ID: 1669407) Visitor Counter : 249