జల శక్తి మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్‌లో 'జల్ జీవన్ మిషన్' అమలు తీరును సమీక్షించిన‌ జల్ శక్తి మంత్రిత్వ శాఖ

నిరాశాజ‌న‌క‌మైన పని తీరును క‌న‌బ‌రిచిన రాష్ట్రం, 2020-21లో ఇప్పటి వరకు 55.58 లక్షల కనెక్ష‌న్ల‌ను అందిచాల్సిన లక్ష్యానికి గాను.. రాష్ట్రం కేవలం 2.20 లక్షల మంచి నీటి కనెక్షన్లను మాత్ర‌మే అందించింది

పశ్చిమ బెంగాల్‌కు పూర్తి సహాయం అందించేందుకు త‌న పూర్తి నిబద్ధతను పునరుద్ఘాటించిన జల్ శక్తి మంత్రిత్వ శాఖ

అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించడం ద్వారా ప‌థ‌కం అమలును వేగవంతం చేయాలని విజ్ఞప్తి

Posted On: 30 OCT 2020 2:42PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్‌లో 'జల్ జీవన్ మిషన్' (జేజేఎం) ప్రణాళిక మరియు అమలుపై మధ్యంతర సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆ రాష్ట్ర అధికారులు జేజేఎం కార్యక్రమ పురోగతిని గురించి జాతీయ జల్ జీవన్ మిషన్ బృందానికి వివ‌రించి చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 2024 నాటికి మొత్తం 1.63 కోట్ల గ్రామీణ గృహాలకు మంచి నీటి కుళాయి కనెక్షన్ల‌ను అందించాల‌నే లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్‌లో 22 జిల్లాలు, 341 బ్లాక్‌లు, 41,357 గ్రామాలు, 1.07 లక్షల నివాసాలు ఉన్నాయి. 2020-21 సంవ‌త్స‌రంలో

ఇప్పటి వరకు ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం 55.58 లక్షల గృహాల‌కు మంచి నీటి కుళాయి క‌నెక్ష‌న్ల‌ను అందించాల్సి ఉండ‌గా.. ఆ రాష్ట్రం కేవలం 2.20 లక్షల పంపు నీటి కనెక్షన్లు మాత్ర‌మే అందించింది. జల్ ‌జీవ‌న్ మిష‌న్ కింద రాష్ట్రాలు / ‌కేంద్ర‌పాలిత ప్రాంతాలు అందించిన పంపు నీటి కనెక్షన్ల ఆధారంగా భార‌త ప్ర‌భుత్వం నిధుల‌ను విడుద‌ల చేస్తుంది. కేంద్ర మరియు సరిపోలేలా రాష్ట్రంల‌ వాటాను ఉపయోగించుకోవ‌డం ఆధారంగానే ఈ నిధుల‌ విడుదల జరుగుతుంది.

2020-21లో పశ్చిమ బెంగాల్‌కు రూ.1,610.76 కోట్ల మేర నిధుల కేటాయింపు జ‌రిగింది. మిషన్ కింద పని తీరు ప్రోత్సాహక రూపంలోను.. అమలు పురోగతి ఆధారంగా అదనపు నిధులను అందించే వీలుంది. దీనికి అదనంగా, పశ్చిమ బెంగాల్‌కు పీఆర్‌‌ఐలకు 15వ ఆర్థిక క‌మిష‌న్‌ గ్రాంట్లుగా మ‌రో రూ .4,412 కోట్లు లభించ‌నున్నాయి. వీటిలో 50 శాతం నిధుల‌ను తప్పనిసరిగా నీరు మరియు పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర కేటాయింపు నిధులను కోల్పోకుండా ఉండటానికి.. ఈ కేటాయించిన నిధులను పొందటానికి అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించడం ద్వారా లక్ష్యాన్ని సమయానుసారంగా సాధించడానికి గాను ప‌థ‌క అమలును వేగవంతం చేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అభ్యర్థించింది. సార్వ‌త్రిక క‌వ‌రేజ్‌లో భాగంగా ఇంటింటికి మంచి నీటి సరఫరా అందించాల‌న్న లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు పూర్తి సహ‌కారం అందించేందుకు.. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాగునీటి సరఫరా వ్యవస్థల దీర్ఘకాలిక సుస్థిరత కోసం ఇప్పటికే ఉన్న తాగు నీటి వనరులను బలోపేతం చేయడానికి తగు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్, జేజేఎం, ఎస్‌బీఎం (జీ), పీఆర్‌ఐలకు 15వ ఎఫ్‌సీ గ్రాంట్లు, జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, కంపా నిధులు, సీఎస్‌ఆర్ ఫండ్, లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ మొదలైన కార్యక్రమాలను గ్రామస్థాయిలో త‌గిన విధంగా స‌మ్మిళితం చేయ‌డం ద్వారాను.. ప్రస్తుత వనరులను గ‌రిష్ఠంగా వాడుకోవ‌డం మరియు ఈ వనరులన్నింటినీ డొవెటైల్ చేయడం ద్వారా 5 సంవత్సరాల పాటు విలేజ్ యాక్షన్ ప్లాన్ (వీఏపీ) తయారు చేయాల‌ని కూడా సూచించ‌డమైంది. సమాజ సమీకరణ కోసం సమర్థవంతమైన ఐఈసీ ప్రచారాన్ని రాష్ట్రం ప్రారంభించాల్సిన అవసర‌ముంద‌ని సూచించ‌డ‌మైంది. సమర్థవంతమైన ప్రణాళిక మరియు మిషన్ అమలు కోసం గ్రామ సంఘాలకు అధికారం ఇవ్వాలని రాష్ట్రంను కోరడ‌మైంది; దీంతో‌ గ్రామాలను ‘హర్ ఘర్.. జల్ గావ్’గా చేయాల‌ని

సూచించ‌డ‌మైంది. రాష్ట్రంలోని మొత్తం 41,357 గ్రామాలలో 22,319 లో పబ్లిక్ వాటర్ సప్లై(పీడబ్ల్యుఎస్) ఉందని, రెట్రోఫిటింగ్ ద్వారా మిగిలిన గృహాలకు కోటి కుళాయి నీటి కనెక్షన్లను అందించే అవకాశం ఉంద‌ని ఈ స‌మీక్షా స‌మావేశంలో గుర్తించడ‌మైంది. పశ్చిమ బెంగాల్ నీటి కాలుష్యం ద్వారా ప్రభావితమవుతోంద‌ని, ఇది నివాసితులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తోంద‌ని గుర్తించ‌డ‌మైంది.

దీనికి తోడు.. ఈ రాష్ట్రంలోని 10 జిల్లాల‌లో 42.96 లక్షల గృహాలు 'జపనీస్ ఎన్సెఫాలిటిస్ మరియు అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్‌'తో‌ (జేఈ-ఏఈఎస్)

ప్ర‌భావితమ‌వుతోంది. దీంతో స్థానికంగా ఉండే ప్ర‌జ‌లు తీవ్ర ఆరోగ్య సమస్యల‌లో చిక్కుకున్నాయి. ఇక్క‌డి గృహాల‌లో కేవలం 2.34 లక్షల గృహాలకు(5.4 శాతం) మాత్రమే ట్యాప్ కనెక్షన్లు అందించబడ్డాయి. రాష్ట్రంలో 1,566 ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వీటికి పైపుల ద్వారా తాగు నీటి సరఫరా జ‌రుగనుంది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ ప్రారంభించిన ప్రత్యేక 100 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమాలు మరియు పాఠశాలలకు పైపుల ద్వారా నీటి సరఫరా ఉండేలా చూడాల‌ని రాష్ట్రంను కోర‌డ‌మైంది. తద్వారా ఈ సంస్థ‌ల‌కు తాగడానికి, చేతులు కడుక్కోవడానికి తాగు నీరు లభిస్తుంది. దీనికి తోడు మరుగు దొడ్లకు మరియు మధ్యాహ్నం భోజనం వండడానికి నీరు ల‌భించ‌నుంది. ఈ చ‌ర్య‌‌ ప్రభుత్వ సంస్థలలో సురక్షితమైన నీటిని అందించడానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుంది. తద్వారా పిల్లలకు సురక్షితమైన నీరు లభిస్తుంది. ఇది వారి సంపూర్ణ అభివృద్ధికి ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.

****



(Release ID: 1668957) Visitor Counter : 185