నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ప్ర‌జా సంప్రదింపుల కోసం ముసాయిదా “కోస్టల్ షిప్పింగ్ బిల్లు- 2020”ని జారీ చేసిన కేంద్ర నౌకా ర‌వాణా మంత్రిత్వ శాఖ

Posted On: 29 OCT 2020 4:43PM by PIB Hyderabad

పాలనలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకతను పెంచాల‌నే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ దృష్టి కోణానికి అనుగుణంగా.. కేంద్ర నౌకా ర‌వాణా (షిప్పింగ్) మంత్రిత్వ శాఖ ముసాయిదా “కోస్టల్ షిప్పింగ్ బిల్లు- 2020” (తీర ప్రాంత నౌక ర‌వాణా బిల్లు-2020) జారీ చేసింది. వాటాదారులు మరియు సాధారణ ప్రజల నుండి సూచనలు సేక‌రించేందుకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును జారీ చేసింది. దేశంలో నౌకా ర‌వాణా (షిప్పింగ్‌)రంగం అభివృద్ధి చెంది పురోగ‌మిస్తున్న వేళ‌ ప్రత్యేక చట్టం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. నౌకా ర‌వాణాను దేశ‌ రవాణా విభాగంలో అంతర్భాగంగా భావించ‌డం, భారత‌ షిప్పింగ్ డిమాండ్లను తీర్చడానికి, ఈ రంగం విధాన ప్రాధాన్యతలను గుర్తించేందుకు ఇది దోహ‌దం చేయ‌నుంది. ఈ బిల్లును రూపొందించేటప్పుడు ప్రపంచలోని ఉత్తమ పద్ధతులు పరిగణ‌న‌లోకి తీసుకోబడ్డాయి. మర్చంట్ షిప్పింగ్ చట్టం-1958 లోని XIVవ భాగానికి బదులు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ముసాయిదా “కోస్టల్ షిప్పింగ్ బిల్లు- 2020”ను రూపొందించింది. ఈ బిల్లులోని కొన్ని ముఖ్యాంశాలు కిందన‌ ఇవ్వబడ్డాయి:
- తీరప్రాంత రవాణా మరియు తీరప్రాంత జలాల నిర్వచనం వివ‌రించ‌బ‌డింది.
- తీరప్రాంత వాణిజ్యానికి వీలుగా భారత జెండా ఓడల‌కు ట్రేడింగ్ లైసెన్స్  అవసరాన్ని తొలగించాలని ప్రతిపాదించబడింది.
- తీరప్రాంత రవాణాలో తమ వాటాను పెంచడానికి గాను భారతీయ ఓడలను ప్రోత్సహిస్తూ, పోటీ వాతావరణాన్ని సృష్టించడానికి మరియు రవాణా ఖర్చులను తగ్గించడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది.
- తీరప్రాంత సముద్ర రవాణాను లోతట్టు జల మార్గాలతో అనుసంధానించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.
- జాతీయ తీర మరియు లోతట్టు షిప్పింగ్‌కు వ్యూహాత్మక ప్రణాళికకు నిబంధన రూపొందించ‌బ‌డింది.
- ముసాయిదా బిల్లును షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
- ముసాయిదా బిల్లుకు సంబంధించి పౌరులు తమ సూచనలు,అభిప్రాయాలను 06.11.2020 లోపు coastalshipping2020[at]gmail[dot]com కు సమర్పించవచ్చు.

****


(Release ID: 1668706) Visitor Counter : 277