ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత-యుకె ఆర్థిక, విత్త విభాగం 10వ విడత మంత్రుల స్థాయి చర్చలకు భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
28 OCT 2020 6:50PM by PIB Hyderabad
వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో వర్చువల్ గా నిర్వహించిన 10వ విడత భారత-యుకె ఆర్థిక, విత్త చర్చల్లో (ఇఎఫ్ డి) భారత ప్రతినిధి వర్గానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహించారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్ బిఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ప్రతినిధులు భారత ప్రతినిధివర్గంలో ఉన్నారు. బ్రిటన్ రాణి ఖజానా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఆర్థిక వ్యవహారాల సంస్థ (ఎఫ్ సిఏ) సభ్యులుగా గల బ్రిటిష్ ప్రతినిధివర్గానికి ఆ దేశ ఆర్థికమంత్రి , యుకె ఖజానా చాన్సలర్ శ్రీ రుషి సునక్ నాయకత్వం వహించారు.
విభిన్న రంగాల్లో భారత, బ్రిటన్ దేశాలు సన్నిహిత ద్వైపాక్షిక సంబంధం కలిగి ఉన్నాయి. 5 లక్షల కోట్ల డాలర్లకు పైబడిన ఉమ్మడి జిడిపితో ఉభయ దేశాలు ప్రపంచంలోని ఏడు అత్యున్నత స్థాయి ఆర్థిక వ్యవస్థల్లో సభ్యదేశాలుగా ఉన్నాయి. 2007లో తొలి ఇఎఫ్ డి జరిగిన నాటి నుంచి భారత-బ్రిటన్ దేశాల వాణిజ్యం రెండింతలు పైగా పెరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడులు ఉభయ దేశాల్లోనూ 5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలిచాయి.
తాజాగా జరిగిన చర్చల్లో కరోనా వైరస్ పై స్పందనలో పరస్పర అనుభవాల మార్పిడితో పాటు జి-20 ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ లో సహకారం ద్వారా తమకు లభించిన అనుభవాలు, జి-20 వర్కింగ్ గ్రూప్, రుణాలపై వడ్డీల విరామం చొరవ (డిఎస్ఎస్ఐ) వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. అలాగే అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ అజెండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై పన్నుల విషయంలో సమ్మిళిత ఏకాభిప్రాయం గురించి కూడా చర్చ జరిగింది. వీటితో పాటు ఫిన్ టెక్, గిఫ్ట్ సిటీలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఆర్థిక సర్వీసుల విభాగంలో సహకారం మరింతగా ముందుకు నడిపించడం, భారత-యుకె వార్షిక ఫైనాన్షియల్ మార్కెట్ ఏర్పాటు, ఫైనాన్షియల్ మార్కెట్లలో సంస్కరణల కోసం ప్రస్తుతం నడుస్తున్న ప్రయత్నాలు కూడా చర్చకు వచ్చాయి. అంతే కాదు, హరిత ఆర్థిక సహాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ స్థిరమైన ఆర్థిక సహాయ యంత్రాంగానికి ప్రోత్సాహం, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలు చర్చించారు. భారత-యుకె ద్వైపాక్షిక సుస్థిర ఆర్థిక ఫోరమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారత-యుకె ఆర్థిక భాగస్వామ్య వేదిక (ఐయుఎఫ్ కెపి), భారత-యుకె సస్టెయినబుల్ ఆర్థిక కార్యాచరణ బృందంలో ప్రైవేటు రంగం పాత్రను కూడా సమావేశంలో ఆహ్వానించారు. భారత జాతీయ మౌలిక వసతుల వ్యవస్థ (ఎన్ఐఐపి), లండన్ మహానగరానికి స్థిర ఆర్థిక వనరుల కల్పనకు జరుగుతున్న కృషిని ఆర్థిక మంత్రి వివరించారు.
భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, యుకె ఖజానా చాన్సలర్ శ్రీ రుషి సునక్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడంతో ఈ చర్చా కార్యక్రమం ముగిసింది.
10వ విడత భారత-యుకె ఆర్థిక, విత్త చర్చల ఉమ్మడి ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Release ID: 1668343)
Visitor Counter : 196