నీతి ఆయోగ్
విద్యుత్ సౌకర్యం అందుబాటు, వినియోగంలో ప్రమాణాల నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, స్మార్ట్ పవర్ ఇండియా
Posted On:
28 OCT 2020 6:35PM by PIB Hyderabad
దేశంలో విద్యుత్ శక్తి అందుబాటు, పంపిణీ సౌకర్యాల్లో ప్రమాణాలు అంశంపై తయారు చేసిన నివేదికను నీతి ఆయోగ్, కేంద్ర విద్యుత్ శాఖ , రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, స్మార్ట్ పవర్ ఇండియా సంస్థలు కలిసి విడుదుల చేశాయి.
దేశంలోని పది రాష్ట్రాల్లో చేసిన ప్రాధమిక సర్వే ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. శాంపిల్ సైజ్ 25 వేలతో, దేశ జనాభాలో 65శాతం ప్రాతినిధ్యంవహించేలా ఈ సర్వే చేశారు. గృహాలు, వాణిజ్య సంస్థలను కలిపి ఈ సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా 25 పంపిణీ సంస్థలను మదింపు చేశారు.
వినియోగదారులనుంచి డిమాండ్ ఎలా వుంది, పంపిణీ సంస్థలనుంచి పంపిణీ ఎలా జరుగుతోంది అనే అంశాలపై ఈ సర్వే జరిగింది.
తమ ఆవాసాలనుంచి 50 మీటర్ల దూరంలోనే విద్యుత్ శక్తి మౌలిక వసతులు అందుబాటులో వున్నాయని 92 శాతం మంది చెప్పారు. విద్యుత్ స్తంభంనుంచి దూరంగా ఇళ్లు వుండడంవల్ల మిగతావారికి విద్యుత్ కనెక్షన్ లభిచంలేదు అని తెలుస్తోంది.
మొత్తం మీద తీసుకున్నప్పుడు సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 87 శాతంమందికి గ్రిడ్ ఆధారిత విద్యుత్ లభిస్తోంది. మిగతా 13 శాతం మందిలో గ్రిడ్డేతర విద్యుత్ ఉపయోగించేవారు, అసలు విద్యుత్ సౌకర్యం లేనివారు వున్నారు. విద్యుత్ సరఫరా సామర్థ్యం గణనీయంగా పెరిగింది. అన్ని కేటిగిరీలకు చెందిన వినియోగదారులకు ప్రతి రోజూ 17 గంటలపాటు విద్యుత్ లభిస్తోంది. వినియోగదారుల్లో 85 శాతం మందికి మీటర్ ద్వారా విద్యుత్ లభిస్తోంది. ఇక సర్వేలో పాల్గొన్నవారిలో 66శాతంమంది విద్యుత్ పంపిణీపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో పట్టణప్రాంతాలకుచెందినవారు 74శాతముంటే, గ్రామీణ ప్రాంతాలవారు 60శాతమున్నారు.
ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మెన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలవల్ల జరిగిన మేలును నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది అని అన్నారు. ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన ఈ రెండూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేశాయని అన్నారు. నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్న సమస్యలను కేంద్ర విద్యుత్ శాఖతో కలిసి పరిష్కరించాలని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ కు శ్రీ రాజీవ్ కుమార్ సూచించారు.
విధానాలు, నియంత్రణ, విధాన మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాల సామర్థ్య నిర్మాణం మొదలైన అంశాల్లో నివేదిక సూచించిన సిఫార్సులు విద్యుత్ పంపిణీ రంగ మెరుగుదలకు దోహదం చేస్తాయని ఆయన అన్నారు.
నివేదికలో తెలియజేసిన సిఫార్సుల్లో కొన్ని అమల్లో వున్న అంశాలేనని అయితే వాటిని వేగవంతం చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలు ఆ పని వెంటనే చేయాలని తద్వారా అధిక ప్రయోజనాలు కలుగుతాయని ఆయన అన్నారు.
దేశంలో ప్రజలందరికీ విద్యుత్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడానికి, నాణ్యమైన,నిరంతర విద్యుత్ అందించడానికిగాను ప్రభుత్వం చూపుతున్ననిబద్ధతను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించిందని, అక్కడక్కడా వున్న లోపాలను సవరించుకొని ముందుకుపోతామని విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా అన్నారు.
దేశవ్యాప్తంగా అందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించడంలో భారతదేశం సాధిస్తున్న విజయాలకు ప్రభుత్వ నిబద్ధత కారణమని స్మార్ట్ పవర్ ఇండియా సిఇవో జైదీప్ ముఖర్జీ అన్నారు.
దేశంలోని విద్యుత్ పంపిణీ కంపెనీలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.సుస్థిరమైన విద్యుత్ అందుబాటును పెంచడానికి ఏం చేయాలో ఈ నేవిదిక సూచించింది. గత కొంతకాలంగా అన్ని రంగాలకు అవసరమయ్యే విద్యుత్తును అందించడానికిగాను... దేశంలో మౌలిక వసతులు మెరుగైనట్టు సర్వే సమాచారం ద్వారా తెలుస్తోంది. విద్యుత్ రంగంతొ భాగస్వాములుగా వున్నవారందరూ ప్రభుత్వ సంస్కరణల్ని ప్రశంసించడం ఈ సర్వే నివేదికలో చూడవచ్చు.
నివేదికకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ లింకులో చూడవచ్చు. https://smartpowerindia.org/Media/WEB_SPI_Electrification_16.pdf
***
(Release ID: 1668341)
Visitor Counter : 303