మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

వరంగల్ నిట్ 18వ స్నాతకోత్సవంలో చక్షుష పద్ధతిలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

వరంగల్ నిట్ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన 3 భవనాలను ప్రారంభించిన శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్' మరియు రుద్రమ దేవి లేడీస్ హాస్టల్స్ కాంప్లెక్సుకు కూడా శంకుస్థాపన

Posted On: 22 OCT 2020 8:06PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ  మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్' వరంగల్ నిట్ 18వ స్నాతకోత్సవం సందర్బంగా వర్చువల్ విధానంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.   వరంగల్ నిట్ క్యాంపస్ లో కొత్తగా నిర్మించిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ బోధన అధ్యయన కేంద్రం,  విశ్వేశ్వరయ్య నైపుణ్య అభివృద్ధి కేంద్రం,  సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గెస్ట్ హౌజ్ లను ప్రారంభించారు.  మరియు రుద్రమ దేవి లేడీస్ హాస్టల్స్ కాంప్లెక్సుకు శంకుస్థాపన కూడా చేశారు.    ఇన్ఫోసిస్ స్థాపకుడు & గౌరవ చైర్మన్,  పద్మ విభీషణ్ పురస్కార గ్రహీత శ్రీ ఎన్.  ఆర్.  నారాయణ మూర్తి ఈ సందర్బంగా గౌరవ అతిధిగా హాజరయ్యారు.  వరంగల్ నిట్ డైరెక్టర్ మరియు గవర్నర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ ఎన్. వి. రమణారావు అధ్యక్షతన జరిగింది.  విశ్వ మహమ్మారి కోవిడ్ -19 ప్రభావం వల్ల విద్యా కార్యక్రమాలకు భంగం కలుగకుండా ఉండటాన్ని నిశ్చయం చేసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అవతార్ ప్రతిమలు పట్టాలు స్వీకరించే విధంగా రూపొందించిన టెక్నాలజీతో ఉత్సవాన్ని నిర్వహించారు.  
ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టభద్రులైన విద్యార్థులను మంత్రి అభినందించారు.   తమ విద్యా ఫలాలను తీసుకొని విద్యార్థులు బయటి ప్రపంచంలోకి వెళ్లడం ముఖ్యమైన సందర్భమని అన్నారు.  పట్టభద్రులైన విద్యార్థులందరికీ జీవితంలో నిజమైన పరీక్ష ఈ రోజు మొదలవుతుందని, ఎందుకంటే తమ విద్యలో భాగంగా నేర్చుకున్న విషయాలను,  జ్ఞానాన్ని బయటి ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలకు వర్తింపజేయడానికి ఇప్పుడు సిద్ధమయ్యారని ఆయన అన్నారు.  విద్య నేర్చుకోవడం ఎప్పటికీ అంతం కాదని, అది జీవితాంతం సాగే ప్రక్రియ అని అంటూ విద్యకు సంస్కృతిని జతచేయాలి తద్వారా వ్యక్తుల ప్రగతికి బలమైన పునాదులు పడుతాయని మంత్రి అన్నారు.  జాతీయ సంస్థల ర్యాంకింగ్ పెంచుకున్నందుకు  (2018లో 26వ స్థానంలో ఉన్న నిట్ 2019లో 19వ స్థానానికి దూసుకెళ్లింది) ,  అనేక  కార్యాలను సాధించినందుకు వరంగల్ నిట్ ను మంత్రి అభినందించారు.  భవిష్యత్తులో సమాజం మరియు దేశ అభివృద్ధికి నిట్ సంస్థ ఎంతో తోడ్పడగలదని అన్నారు.  విద్యార్థులు అసాధారణంగా,  ఆంక్షలు మరియు సవాళ్లకు  అతీతంగా యోచించాలని,  చీకటిని పారదోలే వెలుగుదివ్వెలు కావాలని మంత్రి ప్రోత్సహించారు.  విద్యార్థులు కలలు కనడమే కాక వాటిని సాకారం చేసుకోవడానికి కట్టుబాటుతో పని చేయాలని మంత్రి అన్నారు.  విద్యా రంగ సంస్కరణల ప్రధాన సూత్రం సమదృష్టి మరియు విద్య అందరికీ అందుబాటులోకి రావడం.  

విద్యా రంగంలో ఇండియా ప్రపంచ నేత కావాలనే లక్ష్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించారని చెబుతూ దేశ విద్యా క్షేత్రంలో పరివర్తన తేవడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు మరియు పథకాలను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.  ఉద్యోగాల ప్లేస్మెంటులో  మరియు పరిశోధనలో అసమానమైన ఘనతను సాధించినందుకు నిట్ సంస్థను ఆయన అభినందించారు.  ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా , డిజిటల్ ఇండియా,   స్టార్ట్ అప్ ఇండియా ,  స్టాండ్ అప్ ఇండియా వంటి పరివర్తన తెచ్చే కార్యక్రమాల వల్ల ఇండియా  ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యంగా మారిందని మంత్రి అన్నారు.  ఆ విధంగా ఇప్పుడు మనం  21వ శతాబ్దిలో సువర్ణ భారతాన్ని ఆవిష్కరించబోతున్నాం అని మంత్రి అన్నారు.    

ఇన్ఫోసిస్ స్థాపకుడు,  గౌరవ అతిధి శ్రీ ఎన్.  ఆర్.  నారాయణ మూర్తి పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు.  పట్టభద్రులు కావడం విద్యార్థి జీవిత సీమ నుంచి జీవితరంగంలో ప్రవేశించే మలుపు అని అన్నారు.  ఆ విధంగా ప్రతి విద్యార్థి భారతీయ సమాజం ప్రగతికి పాటుపడతాననే నిబద్ధతతో బయటికి వస్తారని అన్నారు.  ఏ సమాజంలోనైనా ప్రగతి అనేది  అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై ఆధారపడి ఉంటుందని,   మన దేశం ఆశించిన రీతిలో 'ప్రగతి' సాధించలేకపోవడానికి కారణం భారత పౌరులలో వృత్తి తత్త్వం లేకపోవడమే కారణమని ఆయన అన్నారు. ఇప్పుడు తక్షణ అవసరం వృత్తి తత్త్వమని,  దృఢంగా, సమర్థతతో, అంకితభావంతో, నియమాలను సారం, వృత్తికి సంబంధించిన నైతిక నియమాలను పాటిస్తూ  పని చేయడం ద్వారా వృత్తి తత్త్వం సాధించవచ్చునని ఆయన అన్నారు.  'ప్రతిభతో ఆటలు గెలవచ్చు.  కలిసికట్టుగా జట్టుగా పనిచేస్తే ఛాంపియన్లు కావచ్చు'  అని నారాయణమూర్తి అన్నారు.  ప్రతిభాపాటవాలను పెంపొందించుకుంటూనే విలువలకు కట్టుబడి పని చేయాలనీ ఆయన అన్నారు.  

 

డైరెక్టర్ డాక్టర్ ఎన్. వి. రమణారావు తమ ప్రసంగంలో  వరంగల్ నిట్ లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 8 ప్రోగ్రాంలు,  ఎం. టెక్ లో 28 ప్రోగ్రాం లు,  ఎం. ఎస్సీలో 5,  ఎం సి ఏలో ఒకటి, ఎం బి ఏలో ఒకటి మొత్తం మాస్టర్స్ స్థాయిలో 35 ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.   నిట్ సంస్థలన్నింటిలో వరంగల్ లోనే అత్యధికం.  గత స్నాతకోత్సవం జరిగినప్పటి నుంచి అనేక సదస్సులు,  అధ్యయన గోష్టులు నిర్వహించడం జరిగిందని,  విద్యలో, పరిశోధనలో ఎంతో ప్రగతిని సాధించామని,  పరిశోధనా ప్రాజెక్టులతో పాటు కన్సల్టెన్సీ పనులు చేశామని,  ఇప్పుడు కొత్తగా వెబినార్ లు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. 2020 ర్యాంకింగ్ లలో  దేశంలోని నిట్ సంస్థలలో వరంగల్ ఉన్నత స్థానంలో నిలిచిందని తెలిపారు.   పరీక్షలు, ప్లేసుమెంట్లు,  సెమినార్లు , వెబ్నర్లు అన్నీ ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.  

సంస్థ ఆచార్యగణం ప్రతిభకు  వివిధ వేదికలలో గుర్తింపు లభించిందని  అన్నారు.   వివిధ సంస్థల నుంచి రూ. 41 కోట్ల విలువైన 137 పరిశోధనా ప్రాజెక్టులు నిట్ కు లభించాయని తెలిపారు.  కరోనా మహమ్మారికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా వాటిలో ఉన్నాయి. జపాన్ కు చెందిన మియావాకి పద్ధతిలో క్యాంపస్ లోని అంబేద్కర్ లెర్నిన్గ్ సెంటర్ పక్కన చిన్న అడవిని సృష్టించినట్లు  డైరెక్టర్  తెలిపారు.   

 

            ఈ ఏడాది స్నాతకోత్సవంలో రికార్డు స్థాయిలో 1607 మందికి డిగ్రీలను ఆన్ లైన్ లో అందజేశారు.   వివిధ విభాగాల్లో 119 మంది పీ హెచ్ డి,  616 మందికి ఎంటెక్,  ఇతర పీజీ పట్టాలు ,  872 మందికి బీ టెక్ డిగ్రీ పట్టాలు అందజేశారు.  ప్రతి ఇంజనీరింగ్ విభాగంలో  ప్రథములుగా వచ్చిన వారికి బంగారు పతకం ప్రధానం చేశారు.   విభాగాలన్నింటిలోకి అంటే ఈ ఏడాది అత్యధిక సీజీపీఏ సాధించిన విద్యార్థిగా నిలిచిన అపూర్వ భరద్వాజ్ కు చక్షుష రీతిలో ఇనిస్టిట్యూట్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు.  మరో ఏడుగురు విద్యార్థులు విశిష్ట అతిథుల నుంచి బంగారు పతకాలు అందుకున్నారు.   వరంగల్ నిట్ రిజిస్ట్రార్ ఎస్. గోవర్ధన రావు,  అకడమిక్ డీన్ ఆచార్య వేణుగోపాల్,  డీన్లు, అసోసియేట్ డీన్లు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు,  పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొని స్నాతకోత్సవాన్ని విజయవంతం చేశారు.  

***



(Release ID: 1667073) Visitor Counter : 123