హోం మంత్రిత్వ శాఖ
పోలీసు అమరవీరులకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శ్రద్ధాంజలి
దేశ భద్రత, సమగ్రత, సమైక్యతకోసం అసువులు బాసినపోలీసు సిబ్బందికి
దేశం తరఫున అంకిత భావంతో ఘననివాళులు అర్పిస్తున్నా..
పోలీసు స్మారకంపై అమరుల పేర్లు 130కోట్ల దేశవాసుల మనోభావాలకు ప్రతీకలు
పోలీసు అమరవీరులు ప్రతి రక్తపు బిందువూ దేశ ప్రగతికి బాటలు వేసింది
అమరవీరుల త్యాగాల ఫలితంగా మనమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నాం
పండుగల్లో కూడా పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారు
కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో మన పోలీసులు ముందువరుసలో నిలిచారు
ప్రధాన మంత్రితో సహా దేశప్రజలందరి ప్రశంసలూ అందుకున్నారు
కోవిడ్-19పై పోరాటంలో 343మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు
వారి త్యాగాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవి
కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యవస్థీకృత ఆధునికీకరణ
కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది
దేశ సరిహద్దులను అజేయంగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం
సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వనరులతో సమీకృతం చేస్తోంది
Posted On:
21 OCT 2020 6:15PM by PIB Hyderabad
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా 2020, ఈ రోజు అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలో జాతీయ పోలీసు స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి ఆయన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ, దేశ భద్రత, సమగ్రత, సమైక్యతకోసం అసువులు బాసినపోలీసు సిబ్బందికి దేశం తరఫున అంకిత భావంతో ఘననివాళులు అర్పిస్తున్నానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రివర్గ సహచరుల తరఫున కూడా అమిత్ షా నివాళులు అర్పించారు.
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినపుడు, పోలీసు సిబ్బంది త్యాగాలను ప్రజలకు గుర్తుకు తెచ్చే ఒక స్మారక చిహ్నం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర హోమ్ మంత్రి చెప్పారు. ఈ స్మారక చిహ్నాన్ని 2018 అక్టోబరు 21న ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారన్నారు. పోలీసు బలగాలపై ప్రజల ధోరణిని, ప్రత్యేకించి భావితరాల ధోరణిని మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేసిన కృషికి ఫలితమే ఈ స్మారక చిహ్నం నిర్మాణమని అన్నారు.
పోలీసు స్మారక చిహ్నంపై చెక్కిన అమరుల పేర్లు కేవలం పేర్లు మాత్రమే కాదని, 130కోట్లమంది భారతీయుల మనోభావాలకు ప్రతీకలుగా అమరులైన పోలీసుల కుటుంబాలు పరిగణించాలని తాను కోరుకుంటున్నట్టు అమిత్ షా చెప్పారు. స్మారక చిహ్నం కేవలం ఇటుకల కట్టడం మాత్రమే కాదని, దేశ స్వాతంత్య్రానికి శాశ్వతత్వం సిద్ధింపజేసిన సాహస వీరుల త్యాగాలను గుర్తు చేసే నిర్మాణమని అన్నారు. పోలీసు అమరవీరులు ప్రతి రక్తపు బిందువూ దేశ ప్రగతికి బాటలు వేసిందని, యువత భవితవ్యాన్ని తీర్చిదిద్దిందని అన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా దేశవాసులమైన మనమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నామని అన్నారు. కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది, పోలీసు బలగాలకు చెందిన 264మంది ఈ సంవత్సరం దేశంకోసం ప్రాణత్యాగం చేశారని, ఇప్పటివరకూ 35,398మంది పోలీసు సిబ్బంది దేశంలోకోసం అసువులు అర్పించారని అమిత్ షా చెప్పారు. పండుగల సందర్భాల్లో కూడా పోలీసు సిబ్బంది 24 గంటలూ నిర్విరామంగా సేవలందిస్తూ వస్తున్నారనన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి సంక్షోబం తలెత్తిన తొలి రోజుల్లో సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొనాలో తెలియక ప్రపంచం యావత్తూ విస్మయం చెందిందని అమిత్ షా అన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి దేశ్యాప్తంగా లాక్ డౌన్ అమలుకు పిలుపునిచ్చారని, ఈ సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పోలీసు బలగాలు కీలకపాత్ర పోషించారని, లాక్ డౌన్ నిబంధనల అమలులో పోలీసు బలగాలు చాలా ప్రముఖ పాత్ర పోషించాయని చెప్పడానికి కేంద్ర హోమ్ మంత్రిగా తాను ఎంతగానో గర్విస్తున్నానని అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా వలస కూలీలకు సహాయం అందించడంలో, అస్వస్థులను ఆసుపత్రులకు తరలించడంలో, రక్తదానం, ప్లాస్మా దానం అందించడంలో పోలీసు సిబ్బంది తమ విధులను అణుమాత్రం కూడా విస్మరించలేదన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో పోలీసు సిబ్బంది ముందువరుసలో నిలిచారని, ప్రధానమంత్రితో సహా దేశం యావత్తూ వారి సేవలను ప్రశంసించిందని అమిత్ షా అన్నారు. కోవిడ్-19పై పోరాటంలో 343మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవని అన్నారు.
అంతర్గత భద్రతను రక్షించేందుకు పోలీసులు తమ సేవలందించాలని, పోలీసులను, వారి కుటుంబాలకు తగిన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఎపుడూ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మోదీ ప్రభుత్వ తరఫున తాను హామీ ఇస్తున్నానని అమిత్ షా చెప్పారు.
ఈ రోజున అనేక సవాళ్లు పోలీసులకు ఎదురవుతున్నాయని, ఉగ్రవాదం, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు వంటివి పోలీసులు ఎదుర్కొంటన్న సవాళ్లన్నారు. కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు పోలీసు బలగాల వ్యవస్థీకృత ఆధునికీకరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దేశ సరిహద్దులను అజేయంగా, దుర్గమంగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వనరులతో సమీకృతం చేస్తోందన్నారు.
ప్రతి లక్షమంది జనాభాకు ఉన్న పోలీసుల సంఖ్య,.. కొన్ని దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో చాలా తక్కువని, అయితే, పోలీసు బలగాలకోసం అనేక పథకాలను ప్రధాని నాయకత్వంలో రూపొందిస్తున్నామని అమిత్ షా చెప్పారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో రక్షా శక్తి విశ్వవిద్యాలయం, పోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం వంటి సంస్థల బిల్లులు ఆమోదముద్ర పొందాయన్నారు. రక్షణ రంగంలో జీవితాన్ని సాగించాలనుకునే వారికి రక్షా శక్తి విశ్వవిద్యాలయం ఉపయోగపడుతుందని, పోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం ద్వారా శాస్త్రవేత్తల కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలీసు సంస్మరణ దినాన్ని ప్రతి ఏడాది అక్టోబరు 21న నిర్వహిస్తూ వస్తున్నారు. 1959 అక్టోబరు 21న లడక్ లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సాయుధ చైనా సైన్యం దాడిలో అసువులు కోల్పోయిన పోలీసుల ప్రాణ త్యాగాలను సంస్మరిస్తూ పోలీసు సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నారు. పోలీసు అమర వీరులకు నివాళులర్పించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎ.కె. భల్లా, కేంద్ర నిఘా విబాగం డైరెక్టర్ అరవింద్ కుమార్, కేంద్ర సాయధ బలగాల డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
*******
(Release ID: 1666639)
Visitor Counter : 395