ప్రధాన మంత్రి కార్యాలయం
జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం
Posted On:
20 OCT 2020 7:08PM by PIB Hyderabad
నా ప్రియమైన దేశ వాసులారా !
నమస్కారం
''కరోనా మహమ్మారిపై పోరాటంలో జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని ఇవాళ్టి వరకు భారతీయులందరం సుదీర్ఘంగా శ్రమించాం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిన పడింది. జన జీవితం క్రమంగా సర్దుకుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో అంతటా జనసంచారం మళ్లీ పెరిగింది. అయితే మనం ఒక విషయాన్ని మర్చిపోరాదు.. ముగిసింది లాక్ డౌన్ మాత్రమే.. వైరస్ ఇంకా పూర్తిగా చావలేదు. కాబట్టి మనందరం పండుగల వేళ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి'' గత 7-8 నెలల్లో, ప్రతి భారతీయుడి ప్రయత్నాలతో, ఈ రోజు భారతదేశం ప్రస్తుతం ఉన్న స్థితి నుండి పరిస్థితిని మరింత దిగజార్చకూడదు, మరింత మెరుగుపరచాలి..
కరోనా విషయంలో ఇవాళ మనం సురక్షిత స్థానంలో ఉన్నాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. భారత్ లో కొవిడ్ రికవరీ రేటు అధికంగా, మరణాల రేటు తక్కువగా ఉంది. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 5500 మందికి కరోనా వైరస్ సోకింది. అదే అమెరికా, బ్రెజిల్ లో ఆ సంఖ్య 25వేల దాకా ఉంది. అంతేకాదు, మన దగ్గర ప్రతి 10 లక్షల మందిలో కేవలం 83 మంది మాత్రమే కరోనా కాటుకు చనిపోగా, అమెరికా, బ్రెజిల్, స్పెయిన్ లాంటి దేశాల్లో ఆ సంఖ్య 6వేలకుపైగా ఉంది.
ప్రపంచంలోని అగ్రగామి దేశాలన్నిటిలోకి భారత్ తన పౌరుల ప్రాణాలను కాపాడుకోవడంలో సఫలం అయింది. కరోనా రోగుల కోసం మనం 12వేలకుపైగా క్వారంటైన్ సెంటర్లు, 90లక్షలకుపైగా బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. కరోనా టెస్టుల కోసం 2వేలకుపైగా ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. మొత్తం టెస్టుల సంఖ్య 10 కోట్లకు చేరువయ్యాం. కరోనా కట్టడిలో టెస్టులే కీలకంగా మారాయి.
సేవే పరమధర్మంగా మన డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు సహా ఫ్రంట్ లైన్ వారియర్లందరూ పనిచేస్తోన్నారు. ఇంత పెద్ద జనాభా సంక్షేమానికి సేవ చేస్తున్నారు.ఇంత గొప్పగా పోరాటం సాగుతోన్న వేళ పండుగల సందర్భంలో అలసత్వం వద్దేవద్దు. ఈ ప్రయత్నాలన్నిటి మధ్య, అజాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది కాదు. మహమ్మారి పోయిందనో, ఇక వైరస్ అంతం అయిపోయిందనో అనుకోరాదు. ఇటీవలి కాలంలో మనమందరం చాలా చిత్రాలు, వీడియోలు చూశాము. అందులో మనం గమనిస్తే దేశవ్యాప్తంగా కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి పెరిగిపోయింది. ఇది అస్సలు మంచిది కాదు . మాస్కులు లేకుండా బయటికి వస్తున్నవాళ్లందరూ.. తమను తాము, తమతోపాటు కుటుంబాన్ని, పిల్లలు, పెద్దలు అందరినీ చాలా పెద్ద ప్రమాదంలో పడేస్తున్నారన్న విషయం మర్చిపోరాదు. కరోనా కేసులు తగ్గుతున్న దశలో మన నిర్లక్ష్యం వల్లే మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గుర్తుంచుకోండి, ఈ రోజు అమెరికా అయినా, ఐరోపాలోని ఇతర దేశాలు అయినా, ఈ దేశాలలో కరోనా కేసులు తగ్గుతున్నాయి, కానీ అకస్మాత్తుగా అవి మళ్లీ పెరుగుతున్నాయి, ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
ఈ సందర్భంగా సంత్ కబీర్ దాస్ ఉవాచను మనం గుర్తుచేసుకోవాలి.. ‘‘పొలంలో ఏపుగా పెరిగిన పంటను చూసి మనందరం అతి విశ్వాసంతో సంతోషిస్తాం.. కానీ ఆ పంట ఇంటికి చేరే దాకా పని పూర్తయినట్లుకాదు'' అని సంత్ చెప్పారు. కరోనాకు విరుగుడు వ్యాక్సిన్ వచ్చేదాకా మనం పోరాడుతూ ఉండాల్సిందే.
మిత్రులారా, ఈ మహమ్మారి వ్యాక్సిన్ వచ్చేవరకు, కరోనాతో మన పోరాటం బలహీనపడనివ్వకూడదు. ఎన్నో ఏళ్ల తర్వాత, మానవాళిని కాపాడేందుకు ప్రపంచ మంతటా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. దాని కోసం అనేక దేశాలు కృషి చేస్తున్నాయి. మన దేశంలోని శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్ తయారు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు . దేశంలో అనేక కరోనా వ్యాక్సిన్లపై ఇంకా పనులు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని అధునాతన దశలో ఉన్నాయి.పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది.
వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దాన్ని సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇక్కడ మనం రామచరిత మానస్ ను గుర్తుచేసుకోవాలి..ఇందులో మనం చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు . కానీ అదే సమయంలో అనేక రకాల సూచనలు ఉన్నాయి. అందులో చాలా పెద్ద విషయం చెప్పబడింది. రిపు రుజ్ పావక్ పాప్, ప్రభు అహి గనియా నా చోట్ కరి-అంటే అగ్ని, శత్రువు, పాపం అంటే పొరపాటు, రోగాన్ని ఏనాడూ తక్కువగా చూడొద్దని, కాబట్టే వాటిని పూర్తిగా నిర్మూలించాలని రామచరితలో రాసుంది. కాబట్టి కరోనాకు వ్యాక్సిన్ వచ్చేదాకా మనం కూడా దానిని తక్కువగా తీసుకోరాదు.
నిజానికి పండుగలంటే మన జీవితంలో ఎంతో సంతోషకరమైన సందర్భాలు. కానీ ఈసారి కఠినమైన సమయాన్ని దాటుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నిర్లక్ష్యం వల్ల మన సంతోషాన్ని దూరం చేసుకోవచ్చు. జీవితపు బాధ్యతలను నెరవేర్చడం, జాగరూకత తో జీవితం లో ఆనందం కొనసాగుతుంది. రెండు గజాల దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం, తప్పనిసరిగా మాస్కులు ధరించడం అనివార్యం. దీనిపై అందరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. నేను మీకు చాలా వినయపూర్వకమైన ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని సురక్షితంగా చూడాలనుకుంటున్నాను, మీ కుటుంబాన్ని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. ఈ పండుగలు మీ జీవితంలో ఉత్సాహాన్ని , ఆనందాన్ని కలిగించే వాతావరణాన్ని సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను మీకు మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ సూత్రాలను పాటించటానికి మీరు వీలైనంతవరకు ప్రజలలో అవగాహన కల్పించాలని, మీడియా సహచరులతో పాటు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నవారిని కూడా నేను కోరుతున్నాను. ఇది మీ తరఫున దేశానికి గొప్ప సేవ అవుతుంది. మీరు ఖచ్చితంగా మాకు మద్దతు ఇవ్వాలి. దేశంలోని బిలియన్ల మందికి మద్దతు ఇవ్వాలి.
నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆరోగ్యంగా ఉంటూ.. వేగంగా ముందుకు సాగుతూ .. దేశాన్ని ముందుకు తీసుకెళదాం.. దేశ ప్రజలకు నవరాత్రి, దసరా, దీపావళి, ఈద్, ఛత్ పూజ, గురునానక్ జయంతి అన్ని పండుగల సందర్భంగా శుభాకాంక్షలు..
ధన్యవాదాలు!
(Release ID: 1666268)
Visitor Counter : 275
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam