ఆయుష్

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ ఆయుష్ మిషన్ కార్యకలాపాలు కోవిడ్-19 నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష

Posted On: 20 OCT 2020 6:55PM by PIB Hyderabad

    కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇటీవల కొన్ని నెలలుగా అందించిన ప్రభావవంతమైన పలు రకాలసేవలపై ఒక సమీక్షా సమావేశం జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్యా రాజేశ్ కొటేచా అధ్యక్షతన ఈ సమీక్షను నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆయుష్, ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాలు పంచుకున్నారు.

  కోవిడ్-19 నియంత్రణ, యాజమాన్య నిర్వహణలో భాగంగా, అనుసరించేందుకు ఇటీవల విడుదల చేసిన జాతీయ ఆయుర్వేద, యోగా చికిత్సా నిబంధనావళిని గురించి ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్యా రాజేశ్ కొటేచా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ సందర్భంగా వివరించారు. జాతీయ ఆయుష్ మిషన్ (నామ్-ఎన్.ఎ.ఎం.) ఆమోదించిన ఆయుష్ వెల్ నెస్ కేంద్రాల పనిని వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను, నామ్ కింద రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిలో వ్యయాన్ని, నిధుల పంపిణీని మెరుగుపరిచాల్సిన అవసరాన్ని గురించి ఈ సందర్భంగా కొటేచా తెలియజేశారు.

  ఆయుష్ రంగానికి యూనిఫైడ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని ఒక వెన్నెముకగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి సమావేశంలో విపులంగా చర్చ జరిగింది. ఇంటర్నెట్ సర్వర్ వ్యవస్థ ఆధారంగా రూపొందించిన ఆయుష్ ఆరోగ్య నిర్వహణా సమాచార వ్యవస్థ (ఎ-హెచ్.ఎం.ఐ.ఎస్.) పై కూడా చర్చించారు. అన్ని ఆయుష్ సంస్థల్లో వినియోగానికి  ఉద్దేశించిన ఈ వ్యవస్థపట్ల సమీక్షా సమావేశంలోని వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిలో అమలు చేస్తున్న 14 విభిన్న ప్రయోగాత్మక పథకాల్లో ఎ-హెచ్.ఎం.ఐ.ఎస్. కూడా ఒకటి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమతమ పరిధిల్లోని ఆసుపత్రి ప్రక్రియల క్రమబద్ధీకరణకోసం హెచ్.ఎం.ఐ.ఎస్.ను వినియోగించుకోవాలని సూచించారు.   

  ఆయుష్మాన్ భారత్ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయుష్ హెల్త్, వెల్ నెస్ కేంద్రాలను సత్వరం వేగిరపరిచే అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ దృష్టిని కేంద్రీకరించడం చాలా ఆవశ్యకమని ఈ సమావేశంలో సూచించారు. నామ్ పరిధిలో వ్యయాన్ని మరింత వేగిర పరేచేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. హెల్త్, వెల్ నెస్ కేంద్రాలను సత్వరం, సజావుగా పనిచేయించేందుకు సమన్వయ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం ఆయుష్ వైద్యవిధానంలో తీసుకునే చర్యలపట్ల ప్రజలల్లో ఆసక్తి మరింత పెరిగిందని, ఈ నేపథ్యంలో నామ్ పరిధిని, నామ్ కార్యకలాపాలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన కార్యక్రమాలను విస్తరించవలసి ఉందని అన్నారు. ఆయుష్ ఉత్పాదనలు, సేవలకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఈ చర్యలు తీసుకోవాలన్నారు. 

   కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వైరస్ నియంత్రణకు ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ముఖ్యమైన చర్యలను మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రధానంగా ప్రస్తావించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్థంగా నియంత్రించేందుకు, రూపొందించిన నిబంధనావళిని అమలు పరిచేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు క్రియాశీలక భాగస్వామ్యంతో వ్యవహరించాలన్నారు.  

   కోవిడ్ వైరస్ నియంత్రణకు ఉద్దేశించిన నిబంధనావళిని ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశోధనా మండలి, జాతీయ సంస్థలు, ఇతర జాతీయ పరిశోధనా సంస్థలు రూపొందించాయి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు, వైద్య చికిత్సలో అనుభవాలు, ప్రస్తుత అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ చికిత్సా నిబంధనావళిని రూపొందించారు. అతి సాధారణంగా లభించే తిప్పతీగ (గుడూచి), అశ్వగంధి తదితర ఆయుర్వేద మూలికలతో, యోగాభ్యాసాలతో ఈ చికిత్సా నిబంధనావళి రూపొందింది.  వ్యాధి లక్షణాలు లేని కేసులకు, స్వల్ప లక్షణాల కేసులకు చికిత్స అందించడంలో,  అనంతరం పాటించే వ్యాధి నిరోధక చర్యలతోపాటుగా ఈ చికిత్సా నిబంధనావళిని సిఫార్సు చేస్తున్నారు. 

  కోవిడ-19 నియంత్రణకు తాము తీసుకున్న చర్యలు, తమ అనుభవాలను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పంచుకున్నారు. ఉమ్మడిగా తీసుకున్న చర్యలను, అనుభవాలను కూడా పరస్పరం పంచుకున్నారు. వైరస్ మహమ్మారిపై దేశవ్యాప్త పోరును మరింత బలోపేతం చేసేందుకు ఆయుష్ వైద్య విధానాలను వినియోగించుకోవచ్చని సమీక్షలో పాల్గొన్న అధికారులందరూ ఉమ్మడిగా అంగీకరించారు.

******



(Release ID: 1666261) Visitor Counter : 143