సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

దేశ ఈశాన్య ప్రాంతంలో గ‌ల భారీ వ్యాపార అవ‌కాశాల అన్వేష‌ణ‌, స‌ద్వినియోగానికి బ్రిటిష్ ప్ర‌భుత్వానికి పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర

Posted On: 19 OCT 2020 5:41PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ‌రాష్ట్రాల అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రి (ఇంఛార్జి) డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌,ఇండియాలోని ఈశాన్య ప్రాంతంలో గ‌ల భారీ వ్యాపారావ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌ల‌సిందిగా  బ్రిటిష్ ప్ర‌భుత్వానికి, ప్రైవేటు రంగానికి పిలుపునిచ్చారు.  బ్రిటిష్ హై క‌మిష‌న్ అధికారుల‌తో జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో మాట్లాడుతూ ఆయ‌న‌, ఇండియా, యుకెలు రెండు బ‌ల‌మైన ప్ర‌జాస్వామిక దేశాల‌ని ,ఇవి ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన వ్యాపార సంబంధాలు క‌లిగి ఉన్నాయ‌ని అన్నారు. ఇవి ఈశాన్య రాష్ట్రాల‌లో కొత్త అవ‌కాశాల అన్వేష‌ణ‌,సద్వినియోగానికి క‌ల‌సి కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.


కోవిడ్ అనంత‌ర ప‌రిస్థితుల‌లో కొత్త అవ‌కాశాలు వ‌స్తాయ‌ని, ఈశాన్య ప్రాంతంలో ఆర్ధిక‌, శాస్త్ర‌ప‌రిశోధ‌న‌, ఇంకా ఎన్నో రంగాల‌లో కొత్త అవ‌కాశాల‌కు వీలుంద‌ని ఆయ‌న అన్నారు. ఇది అటు ఇండియాకు, యుకెకు ప్ర‌యోజ‌న‌క‌ర‌మని ఆయ‌న అన్నారు.
ఈశాన్య‌రాష్ట్రాల‌లోని సుగంధ‌ద్ర‌వ్యాలు, కూర‌గాయ‌లు, పండ్లు, హ‌స్త‌క‌ళారూపాల‌ను బ్రిటిష్ అధికారులు ఎంతో మెచ్చుకున్నారు. వాటికి బ్రాండ్ విలువ క‌ల్పించి వాటిని అంత‌ర్జాతీయ మార్కెట్‌లో విక్ర‌యించేందుకు తమ ఆసక్తిని వ్య‌క్తం చేశారు. అగ్రి టెక్‌లో బ్రిట‌న్ మార్గ‌ద‌ర్శిగా ఉంద‌ని,  హ‌ర్యానాలో ఆహార ఉత్ప‌త్తుల  ప్రాసెసింగ్‌కు తాము చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టుగా ,ఈశాన్య ప్రాంతంలో కోల్డ్ చెయిన్‌లు ఏర్పాటుచేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తామ‌న్నారు.
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల‌లో విద్యార్ధుల‌కు సైన్సు, గ‌ణితం బోధించేందుకు విద్యారంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి బ్రిటిష్ కౌన్సిల్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను డాక్ట‌ర్‌జితేంద్ర సింగ్ స్వాగ‌తించారు. ఇందుకు సంబంధించి ఒక అవ‌గాహ‌నా ఒప్పందాన్ని  ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ తో త్వ‌ర‌లోనే కుదుర్చుకోనున్నారు.
బ్రిటిష్ కౌన్సిల్ ఐఐటి గౌహ‌తితోపాటు, ఈ ప్రాంతంలోని యూనివ‌ర్సిటీలు , సాంకేతిక విద్యా సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు వ‌చ్చింది.

 


ప్ర‌ధాన‌మంత్రిశ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో , తొలిసారిగా ఈశాన్య‌ప్రాంతం దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌తో స‌మానమైన ప్రాధాన్య‌త‌ను పొందింద‌ని, ఈశాన్య ప్రాంతం విష‌యంలో గ‌తంలో జ‌రిగిన పోర‌పాట్ల‌ను గ‌త ఆరేళ్ల‌లో స‌రిదిద్ద‌డం జ‌రిగింద‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇది ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌లో విశ్వాసాన్ని పాదుకొల్ప‌డ‌మేకాకుండా, దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌తో సంబంధాలు కొన‌సాగించ‌డంలో , అలాగే తూర్పు స‌రిహ‌ద్దు దేశాల‌తో వివిధ స్థాయిల‌లో కార్య‌క‌లాపాలు సాగించే స్థాయి పెంచుకున్నద‌ని ఆయ‌న అన్నారు.

ఆసియాన్ దేశాల‌తో వాణిజ్య‌, వ్యాపార కార్య‌క‌లాపాలు పెంపొందించ‌డంలో ఈశాన్య ప్రాంతం ప్ర‌త్యేక పాత్ర పోషిస్తుంద‌ని, అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లైన ఆగ్నేయాసియా దేశాల‌కు ఇది ముఖ‌ద్వార‌మ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లుక్ ఈస్ట్ పాల‌సీని , యాక్ట్ ఈస్ట్  పాల‌సీ గా మార్చి బ‌హుళ‌ప‌క్ష స‌హ‌కారాన్ని స‌మున్న‌త స్థాయికి తీసుకువెళ్లార‌ని ఆయ‌న అన్నారు.
 అనుసంధాన‌త‌కు  సంబంధించినంశాల‌ను ప్ర‌స్తావిస్తూ డాక్ట‌ర్ జితేంద్ర‌, గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో ఈ ప్రాంతంలో రోడ్లు, రైలు, విమాన‌యాన అనుసంధాన‌త గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందింద‌ని, ఇది ప్రాంతంలో ప్ర‌జ‌ల‌ ప్ర‌యాణానికి , స‌ర‌కుల స‌ర‌ఫ‌రాకు మాత్ర‌మే కాకుండా  మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి,స‌ర‌కుల ర వాణాకు వీలుక‌లుగుతోంద‌ని చెప్పారు. ఎన్‌క్లేవ్‌ల మార్పిడికి సంబంధించిన భార‌త -బంగ్లాదేశ్ ఒప్పందాన్ని గుర్తుచేస్తూ ఆయ‌న‌, ఇది ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌కత్వంలో కుదిరింద‌ని, ఇది వ్యాపార కార్య‌క‌లాపాల‌ను , రాక‌పోక‌ల‌ను , ప్ర‌యాణాల‌ను సుల‌భ‌త‌రం చేసింద‌ని,గ‌తంలో ఇది క్లిష్ట‌మైన వ్వ‌వ‌హారంగా ఉండేద‌ని ఆయ‌న తెలిపారు.అతి త్వ‌ర‌లోనే మ‌నం త్రిపుర నుంచి బంగ్లాదేశ్‌కు రైలు స‌ర్వీసు న‌డ‌ప‌నున్నామ‌ని, ఇది నూత‌న అధ్యాయానికి శ్రీ‌కారం చుడుతుంద‌ని, ఈ ప్రాంతం మొత్తానికి స‌ముద్ర పోర్టులను అందుబాటులోకి తెస్తుంద‌ని, ఇది ఈ ప్రాంత అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.భార‌త ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ర‌వాణా మార్గాల‌పైన అంటే అంత‌ర్గ‌త జ‌లమార్గాల ద్వారా (బ్ర‌హ్మ‌పుత్ర‌నుంచి బంగాళాఖాతానికి ) ఈ ప్రాంతాన్ని ఇత‌ర దేశాల‌తో అనుసంధానం చేసేందుకు దృష్టి పెట్టిన‌ట్టు తెలిపారు. దీనివ‌ల్ల వాణిజ్యం, వ్యాపారం, ర‌వాణాకు ఇది చౌవ‌కైన మార్గం కాగ‌ల‌ద‌న్నారు.ఇది స‌రిహ‌ద్దుల‌లో ప్ర‌త్యేకించి మ‌న తూర్పున ఉన్న పొరుగుదేశాల‌తో  పెద్ద ఎత్తున వాణిజ్యం పెర‌గ‌నున్న‌ద‌ని చెప్పారు.
హార్టీక‌ల్చ‌ర్‌, టీ, వెదురు, సెరిక‌ల్చ‌ర్‌, సుగంధ ద్ర‌వ్యాలు, అల్లం, బ‌త్తాయి‌, త‌దిత‌రాల ఎగుమ‌తుల‌కు పుష్క‌ల‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో క‌రోనాను  స‌మ‌ర్ధంగా ఎదుర్కొన్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.కోవిడ్ అనంత‌ర ప‌రిస్థితుల‌లో ఈ ప్రాంతం గొప్ప వ్యాపార‌, ప‌ర్యాట‌క గ‌మ్య‌స్థానంగా ఎదుగుతుంద‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ అన్నారు.

***



(Release ID: 1665981) Visitor Counter : 176