ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రానున్న పండుగుల కాలంలో కరోనాను నివారించే అంశంపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ తో చర్చలు జరిపిన డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 19 OCT 2020 6:10PM by PIB Hyderabad

       రానున్న పండుగల సీజన్లో ప్రజలను భాగస్వాములను చేసి కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడడానికి అమలు చేయవలసిన చర్యలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ తో కలసి  రాష్ట్రంలోని  అన్ని జిల్లాల కలెక్టర్లు సీనియర్ ఆరోగ్య అధికారులతో చర్చలు జరిపారు.

 

   కరోనా మహమ్మారి ప్రభావాన్ని దేశం గత పది నెలలుగా ఎదుర్కొంటున్నదని పేర్కొన్న డాక్టర్ హర్ష వర్ధన్ " ప్రస్తుతం దేశంలో దేశంలో క్రియాశీలక కరోనా కేసుల సంఖ్య 7,72,000 వరకు ఉంది. నెలకి పది లక్షల కంటే కొంత తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.గత 24 గంటలలో 55,722 కేసులు నమోదు అయ్యాయి. 66,399మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి వేగం 86.3 రోజులకు తగ్గింది.  దేశంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సంఖ్య త్వరలో పది కోట్లకు చేరుకొంటుంది" అని వివరించారు.

        గుజరాత్ లో కరోనాను కట్టడి చేయడానికి అమలు చేస్తున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన  డాక్టర్ హర్ష వర్ధన్ " కరోనా కేసుల విషయంలో తొలుత గుజరాత్ తొలుత మొదటి స్థానంలో ఉండేది. వ్యాధిని కట్టడి చేయడానికి అమలు చేసిన చర్యల వల్ల 90.57 % మంది కోలుకున్నారు. వ్యాధి నుంచి కోలుకున్న వారి జాతీయ సగటు శాతం 88.26 గా ఉంటే గుజరాత్ లో ఇది 90.57 %గా ఉంది" అన్నారు. జాతీయ సరాసరిని మించి కరోనా పరీక్షలు నిర్వహించిన గుజరాత్ అధికారులను మంత్రి అభినందించారు. దేశంలో సరాసరిన పది లక్షల మందికి 68,901 పరీక్షలు జరుగుతుండగా గుజరాత్ లో ఇది 77,785 గా ఉందని మంత్రి పేర్కొన్నారు. " గుజరాత్ లో క్రియాశీలక కేసుల సంఖ్య 14,414 మాత్రమే. వీరిలో 99.4 శాతం మంది ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉంది. 0.86 శాతం అంటే 86 మంది మాత్రమే వెంటిలేటర్లపై వున్నారు అని ఆయన వివరించారు.

     రానున్న శీతాకాలం మరియు పండుగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అలసత్వం వహిస్తే ఇంతకాలం సాధించిన విజయాలు వృధాగా పోయే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. రానున్న మూడు నెలల పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖానికి మాస్క్ వేసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులను తరచూ శుభ్రంగా కడుగు కోవాలంటూ ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం ప్రతి ఒక్క పౌరునికి చేరేలా చూసి ఈ చర్యలు అమలు జరిగేలా చూడాలి. వీటిని పాటించని వారిని గుర్తించి తగిన చర్యాలు తీసుకోవాలి. కొవిడ్ వ్యాప్తిని నివారించడానికి నివారణా చర్యలను అమలు చేయక తప్పదు." అని మంత్రి అన్నారు.

         కరోనావల్ల ఎక్కువగా ప్రభావితం అయిన అహ్మదాబాద్,వడోదర మరియు సూరత్ జిల్లాల కలెక్టర్లతో డాక్టర్ హర్ష వర్ధన్ చర్చలు జరిపారు. పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నఈ జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. గత వారం రోజులుగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన  జునాగాద్, జాంనగర్ జిల్లాలో వ్యాధి నివారణకు అమలు చేస్తున్న చర్యలను మంత్రి సమీక్షించారు.

        పరిస్థితిని ఎదుర్కొని కరోనాను నివారించడానికి అమలు చేస్తున్న చర్యలను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ వివరించారు. రానున్న రోజులలో పండుగలతో పాటు వివాహాలు ఎక్కువగా జరగడంతోపాటు రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి కూడా ఉంటుందని అన్నారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. " అన్ని రకాల కార్యక్రమాలు ఎలాంటి ముప్పు కలగని విధంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించాము. అహ్మదాబాద్ కు బస్సుల్లో వచ్చేవారిని నగర సరిహద్దులోనే పరీక్షించడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తారు " అని ఆయన వివరించారు.

 

       ప్రజల ప్రాణాలతో పాటు వారి జీవనోపాధికి హామీ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని శ్రీ.పటేల్ వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం కొవిడ్ రాక ముందు ఉన్న స్థాయికి చేరిందని, జి ఎస్ టి వసూళ్లు కూడా పెరుగుతున్నాయన్నారు.

      జాతీయ  వ్యాధి నివారణా కేంద్రం (NCDC) డైరెక్టర్ డాక్టర్ సుర్జీత్ సింగ్ రాష్ట్రంలో కొవిడ్ తాజా పరిస్థితిని వివరించి మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరికి సూచనలు జారీ చేశారు. శీతాకాలంలో వ్యాప్తి చెంది శ్వాసకోశ వ్యాధులపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.

     ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహూజా, గుజరాత్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జయంతి రవి, ఐ సి ఎం ఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మరియు ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

***


(Release ID: 1665942) Visitor Counter : 234