ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19పై పోరాటంలో భాగంగా చేపట్టిన జన్ ఆందోళన్, కోవిడ్ కట్టడికోసం అనుసరించే సముచిత వ్యవహార కార్యకలాపాలపై ఏఐఐఎంఎస్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన అధిపతులతో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమావేశం
పండగ సీజన్ కావడం, శీతాకాలం రావడంవల్ల కరోనాపై పోరాటంలో భాగంగా రాబోయే రెండున్నర నెలలు కీలకం..టీకా అందుబాటులోకి వచ్చేంతవరకూ, సామాజిక టీకాను అనుసరించడమే ముఖ్యమని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
Posted On:
14 OCT 2020 6:50PM by PIB Hyderabad
కోవిడ్ -19పై పోరాటంలో భాగంగా చేపట్టిన జన్ ఆందోళన్, కోవిడ్ కట్టడికోసం అనుసరించే సముచిత కార్యకలాపాలపై ఏఐఐఎంఎస్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన అధిపతులతో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగింది.
కోవిడ్ -19 పై పోరాటంలో రాబోయే నెలల ప్రాధాన్యత గురించి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడారు. ఈ పోరాటం ఇప్పుడు పదో నెలకు చేరుకుందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి జనవరి 8న నిపుణులతో కలిసి సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటినుంచి ఈ పోరాటం అవిశ్రాంతంగా కొనసాగుతోందని, ఇండియా చేపట్టిన చర్యల కారణంగా దేశంలో గణనీయ స్థాయిలో వైద్య ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నామని ఆయన అన్నారు. తొంభై లక్షల పడకలు, 12 వేల క్వారంటైన్ కేంద్రాలు, 1900 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది గర్వకారణమైన విషయమని అన్నారు. కరోనాపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న యోధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంకోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి సేవలను స్మరించుకుంటూ వారికి నివాళి ఘటించారు.
రాబోయే రెండున్నర నెలల సమయం పండగ సీజన్ కావడం, శీతాకాలమవడంవల్ల కరోనాపై పోరాటంలో భాగంగా ఈ సమయం కీలకమని కేంద్ర మంత్రి అన్నారు. కోవిడ్ కట్టడి అనేది ప్రతి పౌరుని బాధ్యత అని, భద్రతా చర్యలను విస్మరించవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 8న జన్ ఆందోళన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ప్రకారం ప్రజలు నడుచుకోవాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరారు. కోవిడ్ సముచిత వ్యవహారశైలిని అనుసరించాలని అన్నారు. కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీసిందని ఆయన అన్నారు. సులభమైన ముందు జాగ్రత్త చర్యల కారణంగా వైరస్ ను దూరం పెట్టవచ్చని ఆయన అన్నారు. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, శ్వాసకు సంబంధించిన నియమ నిబంధనలు అనుసరించడం మొదలైనవి వైరస్ ను కట్టడి చేస్తున్నాయని అన్నారు. ఇవి సామాజిక టీకాలో ముఖ్యమైన అంశాలని ఆయన అన్నారు. ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేయడానికి రెండు గజాల భౌతిక దూరం చాలా ముఖ్యమని అన్నారు. సామాజిక టీకాను ప్రచారం చేయడంలో అన్ని వైద్య ఆరోగ్య సంస్థల ప్రధాన అధిపతులు ముందు భాగాన నిలిచి పని చేయాలని కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కోవిడ్ -19పై పోరాటంలో భాగంగా భారతదేశం మంచి ఫలితాలను సాధిస్తోందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువగా రికవరీ రేటు వుందని, మరణాలు చాలా తక్కువగా వున్నాయని ఆయన అన్నారు. కరోనా యాక్టివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ 19 ను కట్టడి చేసే వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేశాయని కేంద్ర మంత్రి ప్రశంసించారు. పరీక్షల సామర్థ్యాన్ని విజయవంతంగా పెంచుకోగలిగామని, ఈ రోజుకు ఈ సామర్థ్యం 9 కోట్లు దాటిందని ఆయన అన్నారు. మాస్కులు, పిపిఇ కిట్లను తయారు చేసుకోవడంలో స్వయం స్వావలంబన సాధించామని అన్నారు. గతంలో వాటిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
సమాజంలో పలుకుబడిగలిగిన పెద్దలతోను, స్థానికి స్వచ్ఛంద సేవాసంస్థలతోను, పాఠశాలల యాజమాన్యాలతోను సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంద్వారా వారిలో స్పూర్తిని నింపి కోవిడ్ పోరాటంపై చైతన్యాన్ని విస్తరింపచేయాలని ఆయా వైద్య రంగ సంస్థల అధిపతులను కేంద్ర మంత్రి శ్రీ హర్షవర్ధన్ కోరారు.
***
(Release ID: 1665415)
Visitor Counter : 241