మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జైపూర్ లోని మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో చాక్షుష రీతిలో వివేకానంద లెక్చర్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి

Posted On: 13 OCT 2020 7:20PM by PIB Hyderabad

మొత్తం ఆసియా ఖండంలో అతి పెద్ద థియేటర్ కాంప్లెక్స్ లలో వివేకానంద లెక్చర్ థియేటర్ కాంప్లెక్స్  ఒకటి.  దీనిలో ఒకేసారి  48 తరగతి గదుల్లో 6792 మంది విద్యార్థులకు బోధన చేయవచ్చు --  కేంద్ర విద్యా శాఖ మంత్రి  

జైపూర్ లోని మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఎం. ఎన్. ఐ. టి)లో  నిర్మించిన వివేకానంద లెక్చర్ థియేటర్ కాంప్లెక్స్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి  శ్రీ రమేశ్ పోక్రియాల్ 'నిషాంక్'  మంగళవారం ఆన్ లైన్ పద్ధతిలో ప్రారంభించారు.   ఎంఎన్ఐటి,  జైపూర్,  చైర్మన్, శ్రీ ఆర్. కె.త్యాగి,  ఎంఎన్ఐటి డైరెక్టర్  ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ఆర్. యారగట్టి,   వివిధ శాఖల డీన్లు,  ఆచార్యగణం,  సిబ్బంది  ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.  

ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీ పోక్రియాల్   ఎంఎన్ఐటి క్యాంపస్ లో నిర్మించిన వివేకానంద లెక్చర్ థియేటర్ కాంప్లెక్స్  ఇండియాలో మాత్రమే కాక ఆసియా ఖండంలోనే  అతి పెద్ద థియేటర్ కాంప్లెక్స్ లలో ఒకటని,  ఏక కాలంలో 48 తరగతి గదులలో  6792  మంది విద్యార్థులకు బోధన చేయవచ్చునని అన్నారు.  "దాదాపు 3 లక్షల 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనం జైపూర్ సంప్రదాయ వాస్తుకళతో చూపరులను ఆకర్షిస్తుంది.  జాలి పనితనం ఉపయోగించడం దాని ప్రత్యేకత.  పరిసరాల రూపురేఖలను కూడా ఉపయోగించుకోవడం  ద్వారా భవనం విశిష్టత వెల్లడవుతోంది"  అని అన్నారు.  సంప్రదాయ రీతిలో నిర్మించడంతో పాటు బూడిద, సిమెంటు కలిపి తయారు చేసిన బ్లాకులు,  ఉష్ణోగ్రత, ధ్వని నిరోధం కోసం రెండువైపులా మెరుగుపెట్టిన గాజు కిటికీలు మొదలైన ఆధునిక నిర్మాణ సామాగ్రిని ఉపయోగించారని  ఆయన వెల్లడించారు.  

విద్యార్థులపై విశ్వ మహమ్మారి కోవిడ్ ప్రభావాన్ని తగ్గించడానికి ఈ- ప్లాటుఫామ్ ద్వారా దూర విద్యా బోధన మరియు ఆన్ లైన్ అధ్యయనం ప్రస్తుత ఆవశ్యకతగా మారిందని మంత్రి అన్నారు.  ఈ  ఆగత్యము వలన వివేకానంద లెక్చర్ థియేటర్ కాంప్లెక్స్ లోని మొత్తం 48 తరగతి గదులలో  ఈ- క్లాస్ రూమ్ లలో ఉండే అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని,  తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాకమైన విద్యార్థులు ఆన్ లైన్ లో  కోర్సులను అధ్యయనం చేయవచ్చని మంత్రి తెలిపారు.  

ఇటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వల్ల నూతన విద్యా విధానాన్ని సమర్ధవంతంగా అమలుచేయడానికి సహాయకారి కాగలదనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.   ఈ ప్రాజెక్టుకు  రూపకల్పన చేసి నాలుగేళ్ళకన్నా కొద్దిగా ఎక్కువ సమయంలో నిర్మించడంతో సంబంధం ఉన్న మొత్తం బృందాన్ని ఆయన అభినందించారు.  భవన నిర్మాణానికి దాదాపు 85 కోట్లు వ్యయమైంది.    


 

***



(Release ID: 1664564) Visitor Counter : 127