ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఆక్వాపోనిక్స్ వంటి ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయాన్ని పెంచుతాయి

కేంద్రమంత్రి సంజయ్ ధోత్రే

లూధియానాలోని ‘ఆక్వాపోనిక్స్ సెంటర్’ ప్రారంభం

Posted On: 13 OCT 2020 6:36PM by PIB Hyderabad

రైతుల స్థితిని మెరుగుపరచడానికి ఆక్వాపోనిక్స్ వంటి ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు చాలా అవసరమని కేంద్ర విద్య, కమ్యూనికేషన్స్  ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి  సంజయ్ ధోత్రే అన్నారు.  ఈ సాంకేతికత ద్వారా రైతు తన భూమి  ఉత్పాదకతను,  ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని చెప్పారు.  లూధియానాలోని మొహాలీలో గల గురు అంగద్ దేవ్ వెటర్నరీ యూనివర్శిటీ (గద్వాస్) లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) అభివృద్ధి చేసిన పైలట్ ‘ఆక్వాపోనిక్స్ సెంటర్’ ను రోజు మంత్రి  వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.  ప్రజలకు మేలు చేసే ఇటువంటి ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులు చేపట్టాలని  ధోత్రే సూచించారు.

అత్యాధునిక సౌకర్యాలన్నీ ఉన్న ఈ సెంటర్ ఈ ప్రాంతంలో తొలిసారిగా ఏర్పాటయింది. పర్యవేక్షణ కోసం,  స్వయంచాలక (ఆటోమేటిక్) నియంత్రణల కోసం అధునాతన సెన్సార్లను ఏర్పాటు చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధుల సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు.  ఈ సందర్భంగా సి-డాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పికె ఖోస్లా  మాట్లాడుతూ ఇక్కడి సాగు విధానాలు దాదాపు 100% సేంద్రీయమని, తక్కువ భూమితో ఎక్కువ దిగుమతులు సాధించవచ్చని, 90% తక్కువ నీటిని వాడుకుంటామని చెప్పారు. ఇక్కడ పెరిగిన చేపలు, మొక్కల్లో ఎన్నో పోషకాలు ఉంటాయని వివరించారు.

 

సి-డాక్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హేమంత్ దర్బారీ మాట్లాడుతూ వ్యవసాయ రంగం కోసం సి-డాక్ చేపట్టిన  వివిధ కార్యకలాపాల గురించి సమాచారం ఇచ్చారు. మొహాలీ  సి-డాక్ చేసిన కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఎలక్ట్రానిక్స్  ఐటి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక సలహాదారు జ్యోతి అరోరా మాట్లాడుతూ  భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం  ప్రాముఖ్యత గురించి  వ్యవసాయరంగం అభివృద్ధికి మరింత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం గురించి మాట్లాడారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గ్రామీణ యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావొచ్చని చెప్పారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని జ్యోతి వివరించారు. అనంతరం గద్వాస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఇందర్‌జీత్ సింగ్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో చేపలు, తదితర పంటలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని అన్నారు. ముఖ్యంగా తీరం లేని ప్రాంతాల్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఈ రకమైన వ్యవస్థలు ఎంతో సహాయపడతాయని స్పష్టం చేశారు.

ఆక్వాపోనిక్స్ అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సాంకేతికత. ఈ విధానంలో పెంచే చేపలు,  మొక్కలు రెండూ సమగ్ర పద్ధతిలో పెరుగుతాయి. చేపల వ్యర్థాలు  మొక్కలకు ఎరువులుగా ఉపయోగపడుతాయి. మొక్కలు పోషకాలను గ్రహిస్తాయి.  నీటిని వడబోస్తాయి. ఇట్లా వడబోసిన నీటిని ఫిష్ ట్యాంక్ నింపడానికి ఉపయోగిస్తారు. ఇది పర్యావరణ అనుకూల సాంకేతికత. సి-డాక్ అందిస్తున్న సూపర్ కంప్యూటింగ్ శక్తి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో మరింత ముందుకు వెళ్తుందని సి-డాక్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హేమంత్ దర్బారీ పేర్కొన్నారు.

***



(Release ID: 1664416) Visitor Counter : 173