వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

పప్పుధాన్యాల ధరల నియంత్రణ పథకం కింద తమ రాష్ట్ర అవసరాల కోసం లక్షటన్నుల కందిపప్పును కేటాయించాలని ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు రాష్ట్రాలు కోరాయి.

బఫర్ స్టాక్ నుండి బహిరంగ మార్కెట్ సేల్‌ కోసం 40,000 మెట్రిక్ టన్నుల కందిపప్పును విడుదల చేయాలని డోకా(డిపార్ట్ మెంట్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్) నిర్ణయించింది.

Posted On: 13 OCT 2020 6:11PM by PIB Hyderabad

త్వరలో ఖరీఫ్ పంట చేతికి రానున్న తరుణంలో రిటైల్ మార్కెట్ లో కందిపప్పు, మినపప్పు ధరలు గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో పెరిగాయి. అఖిలభారత స్థాయిలో అక్టోబర్ 12 నాటికి  కందిపప్పు, మినపప్పు ధరలు సగటున 23.71 శాతం నుండి 39.10 శాతం వరకూ పెరిగాయి.దేశంలోని పలు ప్రాంతాల్లో గత 15 రోజుల వ్యవధిలోనే పప్పుధాన్యాల ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి.

బహిరంగ మార్కెట్ లో పప్పుధాన్యాల రిటైల్ ధరలను నియంత్రించడానికి బఫర్ స్టాక్ నుండి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు నాఫెడ్ ద్వారా పప్పుధాన్యాలను సరఫరా చేసే విధానాన్ని వినియోగదారుల వ్యవహారాల విభాగం సెప్టెంబర్ లో చేపట్టింది. ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు పెద్దమొత్తంలో లేదా రిటైల్ ప్యాకెట్ల రూపంలో పప్పుధాన్యాలను కేంద్రం సరఫరా చేస్తుంది. ఈ పప్పు ధాన్యాలను ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు రేషన్ షాపులు, మార్కెటింగ్ రిటైల్ అవుట్ లెట్లు, డెయిరీ మరియు హార్టికల్చర్ అవుట్ లెట్లు, కో ఆపరేటివ్ సోసైటీల ద్వారా విక్రయిస్తాయి. బహిరంగ మార్కెట్లో వినియోగదారుడిపై పడుతున్న ధరల భారాన్ని నియంత్రించడానికి ఈ విధానం ప్రవేశపెట్టబడింది. ఈ పథకం కింద సరఫరా అయ్యే పప్పుధాన్యాల ధరలు కనీన మద్దతు ధర(ఎంఎస్‌పి) లేదా డైనమిక్ రిజర్వ్ ప్రైస్ (డిఆర్‌పి) ఏది తక్కువైతే అది నిర్ణయించబడతాయి.

ఈ విధానం ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధూలి మినపప్పు కే-18 (ఖరీఫ్ -2018 స్టాక్) రకం కిలోకు రూ .79, మరియు కె-19 రకం కిలోకు రూ .81 అందిస్తున్నారు. అదేవిధంగా ఈ పథకం కింద కందిపప్పు కిలో 85 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, బీహార్ మరియు తమిళనాడు రాష్ట్రాలు తమ అవసరాల కోసం 1,00,000 మెట్రిక్ టన్నులను ఆర్డర్ చేశాయి. సమీప భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు కూడా  ముందుకు వస్తాయని భావిస్తున్నారు.

ఆయా రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు బఫర్ స్టాక్ నుండి 40,000 మెట్రిక్ టన్నుల కంది పప్పును చిన్య ప్యాకెట్ల రూపంలో బహిరంగ మార్కెట్ కు విడుదల చేయాలని డోకా నిర్ణయించింది. తద్వారా రిటైల్ మార్కెట్ లో పెరిగిన ధరలు నియంత్రణలోకి వస్తాయి.

పప్పుధాన్యాలు మరియు ఉల్లిపాయల బఫర్ స్టాక్‌ను రూపొందించడానికి భారత ప్రభుత్వం 2016 లో దూరదృష్టితో అడుగులు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ద్వారా చిల్లర మార్కెట్ లో వీటి ధరలను పరిస్థితులకు అణుగుణంగా నియంత్రించవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ధరల సమాచారం సేకరించి దాని ఆధారంగా బఫర్ స్టాక్  నిర్ధారించబడుతుంది.

***


(Release ID: 1664234) Visitor Counter : 126