సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిష్కారం నిరుటి కంటే కోవిడ్ సమయంలోనే అధికం

Posted On: 13 OCT 2020 5:53PM by PIB Hyderabad

సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారం గురించి మాట్లాడుతూ ఈ కోవిడ్ సమయంలో పరిష్కారం నిరుడు ఇదే కాలంతో పోల్చుకున్నప్పుడు ఎక్కువగా ఉందని  ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధాని కార్యాలయం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, అణుసక్తి, అంతరిక్ష శాఖల సహాయమంత్రి ( స్వతంత్ర ప్రతిపత్తి) డాక్టర్ జితేంద్రసింగ్ చెప్పారు.

ఆరు నెలల కాలంలో వచ్చిన దరఖాస్తులను, వాటికి సమాధానం ఇచ్చిన తీరును విశ్లేషిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు. సమాచార హక్కు చట్టానికి 15 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమలులోకి రావటాన్ని ఆయన గుర్తు చేశారు. గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 76.49% ఆర్ టి ఐ కేసులు పరిష్కరించగా ఈ ఆర్థిక సంవత్సరం 2020-21 లో పరిష్కారం శాతం దాదాపు 93.98 శాతానికి చేరుకున్నదన్నారు. సంఖ్యా పరంగా చుస్తే నిరుడు ఈ కాలంలో 11716 కేసులకు గాను 8962 కేసులు పరిష్కారం కాగా, ఈ ఏడాది అదే కాలంలో  8528 కేసులలో 8015 కేసులు పరిష్కరించామని చెప్పారు.

కేంద్ర సమాచార కమిషన్ లాక్ డౌన్ సమయంలో కూడా ఎంతో కష్టపడి కరోనా సంక్షోభాన్ని సైతం ఖాతరు చేయకుండా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించగలిగిందన్నారు. ఈ-ఆఫీస్ ను విస్తృతంగా వినియోగించుకోవటం, ఆడియీ, వీడియో విచారణలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవటం వలన సాఫీగా ముందుకు సాగగలిగినట్టు చెప్పారు. ఇరుపక్షాలూ హాజరయ్యేలా చూడటం వలన సకాలంలో పరిష్కారం సాధించగలిగామన్నారు. ఇదే విధంగా నిరంతరాయంగా కేసుల పరిష్కారం జరిగేటట్టు కమిషన్ పాటుపడిందని మంత్రి చెప్పారు.

సమాచార హక్కు చట్టం సాధారణ ప్రజలకు సమాచారం అందించటంలోను, పారదర్శకత సాధించటంలోను ఎంతగానో కృషి చేసిందని ఇన్నేళ్ళ కాలంలో ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ ముందుకు సాగిందని చెప్పారు. కొన్ని దరఖాస్తులు ఒకే విషయం మీద పదే పదే వచ్చినా, వ్యక్తిగత సమస్యలమీద దరఖాస్తులు వచ్చి అప్పీళ్ళ సంఖ్య పెరిగిపోతున్నా వాటన్నిటికీ తగిన సమాధానాలు ఇవ్వగలిగిందన్నారు.

ఎప్పటికప్పుడు కేంద్ర సమాచార కమిషన్మ్ సెమినార్లు, వర్క్ షాపులు, వార్షిక సదస్సులు నిర్వహిస్తూ ఆర్టీఐ కార్యకర్తలతో, సామాన్య ప్రజలతో, సిపిఐవోలు, ఫస్ట్ అప్పెల్లేట్ అధికారులతో సంభాషణలు సాగించటం ద్వారా చట్టాన్ని సమర్థంగా వాడుకునే అవకాశాన్ని పెంచగలిగినట్టు మంత్రు వ్యాఖ్యానించారు. ఈ విధంగా స్పందన తెలుసుకోవటం ద్వారా అందరిలోనూ మెరుగైన ఫలితాలు కనబడ్డాయని చెప్పారు. కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఆర్టీఐ కార్యకర్తలు, మాజీ చీఫ్ ఇన్పర్మేషన్ కమిషనర్ల  సహాయం తీసుకుంటూ వీడియో సమావేశాలు జరిపి కేసుల పరిష్కారంలో ముందడుగు వేయటాన్ని ప్రస్తావించారు.

ఆర్టీఐ చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయటానికి వీలుగా వీలైనంత త్వరగా సెమినార్లు, వెబినార్లు, వర్క్ షాపులు నిర్వహించటానికి, అమలును గాడిలో పెట్టటానికి కమిషన్ సిద్ధంగా ఉందని కూడా డాక్టర్ జితేంద్రసింగ్ చెప్పారు.

****

 


(Release ID: 1664229) Visitor Counter : 212