రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

మసాలా దినుసుల సాగులో రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా బయో పెస్టిసైడ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన ఐపీఎఫ్టీ

Posted On: 09 OCT 2020 3:47PM by PIB Hyderabad

రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని పురుగుమందుల సూత్రీకరణ సాంకేతిక పరిజ్ఞానం విభాగం(ఐపీఎఫ్టీ) మసాలా దినుసుల సాగులో రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా బయో పెస్టిసైడ్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. రాజస్థాన్లోని అజ్మీర్లోగల ఐసీఎఆర్ మసాలా దినుసుల జాతీయ పరిశోధన సంస్థ సహకారంతో ఎంటోమోపాథోజెనిక్ ఫంగస్ వెర్టిసిలియం లెకాని ఆధారంగా బయో పెస్టిసైడ్ తయారీ సాంకేతికతను అభివృద్ధి చేశారు.

  


ఈ విషయమై ఐపీఎఫ్టీ డైరెక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ..  మెంతులు, జీలకర్ర, ధనియాలు వంటి మసాలా దినుసుల పంటలను ఆశించే కీటకాలను నియంత్రించడంలో ఈ బయో పెస్టిసైడ్ ఫార్ములా చాలా ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించామన్నారు. పంటలకు పురుగుమందులు ఆశించకుండా సుదీర్ఘకాలం ప్రభావం చూపడమే కాకుండా ఈ పంటలను పండించి, ఉపయోగించేవారికే కాకుండా, పర్యావరణానికి కూడా సురక్షితమైందని చెప్పారు. ప్రత్యేకించి మసాలా దినుసుల పంటల్లో చీడపీడలను నియంత్రించడానికి ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ సాంకేతికత అభివృద్ధికి సంబంధించి పేటెంట్ కోసం దరఖాస్తు కూడా దాఖలు చేసినట్లు చెప్పారు.
‘‘మసాలా దినుసుల పంటలకు చీడపీడల వల్ల భారీనష్టం సంభవిస్తోందని, దీంతో ఈ కీటకాలను  నియంత్రించేందుకు పెద్దమొత్తంలో హానికారక సింథెటిక్ రసాయనిక పురుగుమందులను వాడతున్నారు. దీనివల్ల మసాలా దినుసుల పంటల్లో పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉంటున్నాయి. ఇది మానవ ఆరోగ్యంపైనే కాకుండా పర్యావరణానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తూ ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోంది. మసాలా దినుసుల్లో పురుగుమందుల అవశేషాల సమస్యను తగ్గించేందుకు బయో పురుగుమందుల వినియోగం సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గం. అంతేకాకుండా సేంద్రీయ వ్యవసాయం, సమీకృత వ్యర్ధాల నిర్వహణలో పురుగుమందుల అవశేషాల సమస్యను తగ్గించడానికి ఈ బయో-పురుగుమందులను రసాయన పురుగుమందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా సేంద్రీయ వ్యవసాయంలో చీడపీడల నుంచి పంటల రక్షణ కోసం ఈ బయో పురుగుమందును ఉపయోగించవచ్చు. 

***


(Release ID: 1663188)