ఆర్థిక మంత్రిత్వ శాఖ
మోసపూరిత ఐటీసీ క్లెయిములు, నగదు వాపసుల ద్వారా, ఎగుమతి సంస్థలు రూ.61 కోట్లను అక్రమంగా పొందినట్లు గుర్తించిన డీజీజీఐ
Posted On:
09 OCT 2020 12:32PM by PIB Hyderabad
ఉనికిలో లేని సంస్థలు లేదా ఎలాంటి కొనుగోళ్లు జరపని సంస్థల ఇన్వాయిస్‌లపై, కొన్ని ఎగుమతి సంస్థలు, మోసపూరితంగా 'ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్' (ఐటీసీ) పొందినట్లు డీజీజీఐ అధికారులు కనుగొన్నారు. ఆ ఐటీసీని ఎగుమతి చేసిన వస్తువులపై ఐజీఎస్‌టీగా చెల్లించి, తర్వాత నగదు వాపసుగా సదరు సంస్థలు తిరిగి పొందినట్లు తేల్చారు. ఒకవైపు, పన్ను చెల్లించకుండా ఐటీసీ పొందడం; మరోవైపు, అక్రమంగా పొందిన ఐటీసీని ఐజీఎస్‌టీగా చెల్లించి నగదు వాపసుగా తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాను రెండు విధాలా ఆయా సంస్థలు మోసం చేశాయి. మోసపూరితంగా పొందిన మొత్తం దాదాపు రూ.61 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.
ఎగుమతి సంస్థలు, ఆయా సంస్థల యజమానుల ఇళ్లు, వివిధ సరఫరా సంస్థల్లో డీజీజీఐ అధికారులు గత మంగళవారం సోదాలు చేశారు. సదరు సరఫరా సంస్థలు, ఏ వస్తువులూ సరఫరా చేయకుండా కేవలం బిల్లులు మాత్రం ఇచ్చాయని తనిఖీల్లో తేలింది. ఎగుమతి సంస్థలు ఆ నకిలీ బిల్లులపై ఐటీసీ పొందడమేగాక, అవే వస్తువులను ఎగుమతి చేసినట్లు చూపించి నగదు వాపసు అందుకున్నాయి. ఎగుమతి సంస్థల నియంత్రణాధికారులను మంగళవారం నాడు డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. లూధియానాకు చెందిన సరఫరా సంస్థల యజమాని పరారయ్యాడు. నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు. ఆ వ్యక్తికి ఆర్థిక నేరాలు అలవాటుగా మారాయని, అతనిపై, అతని సంస్థలపై అనేక కేసులున్నాయని అధికారులు తెలిపారు. గతంలో, డీజీఆర్‌ఐ దర్యాప్తు చేసిన వాణిజ్య మోసం కేసులోనూ, 'కోఫెపోసా' కింద నిందితుడిని నిర్బంధంలోకి తీసుకున్నారు.
నమ్మకమైన సమాచారం ప్రకారం, సదరు వ్యక్తి సిమ్లాలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. వెంటనే ఓ బృందం అక్కడకు వెళ్లి బుధవారం రోజున అరెస్టు చేసింది. వెంటనే నిందితుడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం, కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడం, అతన్ని తిహార్ కేంద్ర కారాగారానికి తరలించడం జరిగిపోయాయి. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
***
(Release ID: 1663106)
Visitor Counter : 166