పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

వర్ధమాన దేశాలకు భారత్‌ నమూనాగా మారుతోంది: శ్రీ ధర్మేద్ర ప్రధాన్‌

సొంత, ప్రపంచ అవసరాలు తీర్చగల 21వ శతాబ్దపు భారత్‌ను నిర్మించడానికి కృషి చేస్తున్నాం: ధర్మేద్ర ప్రధాన్‌

Posted On: 07 OCT 2020 7:45PM by PIB Hyderabad

సుసంపన్న, స్వయంసమృద్ధ దేశంగా భారత్‌ను మార్చే ప్రక్రియలో భాగస్వాములు కావాలని; చమురు, సహజవాయువు&ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పీహెచ్‌డీసీసీఐ నిర్వహించిన 'బిల్డింగ్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌' వెబ్‌ కాన్ఫరెన్సులో మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ లక్ష్యమైన ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి; దేశ సొంత అవసరాలతోపాటు ప్రపంచ అవసరాలను కూడా తీర్చగల ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ మార్చడంలో దాని పాత్ర గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. 

    అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌ నమూనాగా మారుతోందని శ్రీ ప్రధాన్‌ చెప్పారు. "సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకు సేవలు అందించడం, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని నిజంగా సాధించడపైనే మా దృష్టి ఉంది. భారత్‌లో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి, జనాభా ఉంది, వ్యాపారాలు, పరిశ్రమలకు అనుకూల వాతావారణాన్ని అందించే ఓడరేవుల విస్తృత లభ్యత ఉంది. సొంత, ప్రపంచ అవసరాలు తీర్చగల 21వ శతాబ్దపు భారత్‌ను నిర్మించడానికి మేం కృషి చేస్తున్నాం" అని వెల్లడించారు.

    మహాత్మాగాంధీ చేపట్టిన స్వదేశీ ఉద్యమం, దండి యాత్ర నుంచి ఇప్పటి ఆత్మనిర్భర్‌ భారత్‌ పిలుపు వరకు; స్వావలంబన భారత్‌ను నిర్మించడం వెనుక 'ఆత్మనిర్భరత' ఆలోచనే ప్రేరణ శక్తిగా ఉందని మంత్రి చెప్పారు. ప్రజల స్ఫూర్తిని కరోనా తగ్గించలేదని, మన దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన మార్గంలో ఉందని అన్నారు. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు 4 శాతం, రైల్వే రవాణా 15 శాతం, ఎగుమతులు 5 శాతం పెరిగాయని వివరించారు. పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు కూడా సాధారణ స్థితికి చేరాయన్నారు.

    తయారీ కేంద్రంగా భారత్‌ను మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులేస్తోందని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. వ్యాపారం చేయాలని ప్రభుత్వానికి లేదని, ప్రజా సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టిందని పునరుద్ఘాటించారు. ఈ కోణంలోనే; సులభతర వ్యాపారానికి చర్యలు, పారదర్శక పద్ధతులు, అవినీతి నిర్మూలన, సంపద సృష్టికర్తలకు గౌరవం వంటి విధానాలను కేంద్రం తీసుకొచ్చిందని వెల్లడించారు. చమురు, సహజవాయువు రంగం గురించి మాట్లాడుతూ, 8 కోట్లకుపైగా ఉన్న పేదలు సహా జనాభాలో 95 శాతం మందికి గ్యాస్‌ కనెక్షన్లు అందాయన్నారు. ఈ ఏప్రిల్‌లో బీఎస్‌-6 ప్రామాణిక చమురును అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎగుమతుల వృద్ధిలో ఉక్కు రంగం భాగస్వామ్యం కూడా ఉందని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

***


(Release ID: 1662617) Visitor Counter : 106