రైల్వే మంత్రిత్వ శాఖ

సరుకు రవాణా వాణిజ్య వృద్ధి కోసం వివిధ రంగాలతో రైల్వే చర్చలు

బొగ్గు, విద్యుత్ రంగాల ప్రముఖులతో మంత్రి పీయూష్ గోయెల్ భేటీ

కొత్త రంగాల్లో మార్కెట్ వాటా, వాణిజ్యం బలోపేతం రైల్వేల లక్ష్యం

రైల్వే, బొగ్గు, విద్యుత్ రంగాల కార్యకలాపాల్లో సమన్వయానికి మంత్రి పిలుపు

Posted On: 05 OCT 2020 8:35PM by PIB Hyderabad

దేశంలోని బొగ్గు, విద్యుత్ రంగాలకు చెందిన అగ్రశ్రేణి అధిపతులతో,. రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ రోజు సమావేశమయ్యారు. రైల్వేల్లో బొగ్గు వాణిజ్యం మరింత బలోపేతమయ్యేలా చూసేందుకు, సరుకు రవాణా చార్జీలకు సంబంధించి రైల్వేలు, బొగ్గు, విద్యుత్ రంగాల ఉమ్మడి నిర్వహణా ఉత్పాదనను మరింత మెరుగుపరిచే మార్గాల అన్వేషణకు ఈ సమావేశం నిర్వహించారు. కంపెనీల వారీగా సరుకు రవాణాపై సమీక్షించేందుకు జరిపిన ఈ చర్చల్లో కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డు చైర్మన్,  రైల్వే బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.), కోల్ ఇండియా, జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ, మహానది కోల్ ఫీల్డ్స్, సౌతీస్ట్ కోల్ ఫీల్డ్స్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్, నార్తరన్ కోల్ ఫీల్డ్స్, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, నార్త్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, సింగరేణి కాలరీస్ సంస్థల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైల్వేలు సంపాదించే సరకు రవాణా ఆదాయంలో దాదాపు సగభాగం బొగ్గు రవాణాతోనే సమకూరుతోంది. గత ఏడాది 1,21 కోట్ల టన్నుల సరకును రైల్వేలు రవాణా చేయగా, అందులో బొగ్గు రవాణాయే 58.7కోట్ల టన్నుల మేర ఉంది.

   ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ, సరకు రవాణా స్థాయిని పెంచేందుకు రైల్వేశాఖ నిర్విరామంగా కృషిచేస్తోందని, ఈ విషయంలో ఎక్కడా అలసత్వానికి తావులేదని అన్నారు. ఈ నేపథ్యంలో రైల్వేలు, బొగ్గు, విద్యుత్ రంగాల మధ్య మరింత సమన్వయం అవసరమని, మూడు రంగాలకు లాభం చేకూరేలా పరస్పరం సహాయకారులుగా పనిచేయాలని మంత్రి సూచించారు.

   2020, సెప్టెంబరు నెలలో సరకు రవాణా ద్వారా రూ. 9,896.86కోట్లను రైల్వే శాఖ ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో అర్జించిన మొత్తం కంటే ఇది 1,180.57కోట్లు ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో రైల్వే శాఖ సరకు రవాణా ద్వారా రూ. 8,716.29కోట్లు సంపాదించింది. అంటే సరకు రవాణా ఆదాయం 13.54శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో బొగ్గు రవాణా ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బొగ్గు రవాణా పెరిగితే రైల్వే శాఖ సరకు రవాణా ఆదాయంలో గణనీయమైన సానుకూల ప్రభావం ఉంటుంది.  కోవిడ్ వైరస్ వ్యాప్తి, దీర్ఘకాలం లాక్ డౌన్లు ఎదురైనప్పటికీ, గత ఏడాది సరకు రవాణా ఆదాయం లెక్కలను అధిగమించే దిశలో రైల్వే శాఖ అన్ని విధాల కృషి చేస్తోంది.  2020 సెప్టెంబరులో జరిగిన సరకు రవాణా,.. గత ఏడాది ఇదే కాలంలో జరిగిన సరకు రవాణా కంటే 15.3శాతం ఎక్కువగా నమోదైంది.

      రైల్వేలో జోన్ల స్థాయిలో వాణిజ్య అభివృద్ధి యూనిట్లను రూపొందించడం, ప్రత్యేక పార్సెల్ రైళ్లు, కిసాన్ రైళ్లు నడిపించడం రవాణా ప్రక్రియపై బహుముఖంగా మరింత మెరుగైన పర్యవేక్షణను అమలు చేయడం తదితర చర్యలతో సరకు రవాణా వాణిజ్యంలో ఈ మేర వృద్ధి సాధ్యమైంది.

   రైళ్ల ద్వారా సరుకు రవాణాను మరింత ఆకర్షణీయంగా రూపొందించేందుకు అనేక రాయితీలు, డిస్కౌంట్లు కూడా అమలు చేస్తున్నారు. రైల్వేలు రవాణా చేసే సరుకు పరమాణంలో 50శాతం బొగ్గే ఉంటోంది.

*****



(Release ID: 1661915) Visitor Counter : 107