కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

రూ. 1.34లక్షల కోట్లకు పెరిగిన వ్యవసాయ బడ్జెట్ 2009-10కంటే 11రెట్లు పెరిగిందన్న కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్ కొత్త వ్యవసాయ సంస్కరణలు రైతుల మేలుకేనని స్పష్టీకరణ

అసంఘటిత రంగంతో సహా, కార్మికులకులందరికీ సామాజిక భద్రతా ప్రయోజనాల విస్తరణ

73ఏళ్లలో తొలిసారి,. సిసలైన కార్మిక సంస్కరణలపై పారదర్శక యంత్రాగాన్ని అందించిన ప్రభుత్వం

పి.హెచ్.డి. చేంబర్ ఆఫ్ కామర్స్, భారత్ మజ్దూర్ సంఘ్జా తీయ సమ్మేళనాల్లో గాంగ్వార్ ప్రసంగం

Posted On: 03 OCT 2020 6:22PM by PIB Hyderabad

కొత్త వ్యవసాయ చట్టాలు, కార్మిక సంస్కరణ బిల్లులు రైతులకు, కార్మికులకు ఎంతో ప్రయోజకరమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈ రోజు చెప్పారు. రైతులకు మేలు చేకూర్చేలా ఎన్.డి.ఎ. ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి వివరిస్తూ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్ ను రూ. 1.34లక్షల కోట్లకు పెంచినట్టు తెలిపారు. యు.పి.ఎ. హయాంలోని 2009-10వ ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ బడ్జెట్ 11రెట్లు పెరిగిందని,   రైతుల సంక్షేమంపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్తశుద్ధిని ఇది సూచిస్తోందని అన్నారు. పి.హెచ్.డి. చేంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి సమ్మేళనంలో గాంగ్వార్ మాట్లాడారు. కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సులో పాలుపంచుకున్నారు. రైతులు ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునేలా వారికి మార్కెటింగ్ స్వేచ్ఛను అందించడమే లక్ష్యంగా కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చామన్నారు. తమ ఉత్పత్తులను మెరుగైన ధరకు ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముకునే సదుపాయం రైతులకు ఇపుడు లభించిందన్నారు. కనీస మద్దతు ధర రద్దు చేస్తారంటూ వస్తున్న అపోహలను ఆయన కొట్టి పారేశారు. యు.పి.ఎ. హయాంతో పోలిస్తే వివిధ పంటల మద్దతు ధరలు ఇపుడు గణనీయంగా పెరిగాయన్నారు.

   ప్రధానమైన కార్మిక సంస్కరణల చట్టాలను గురించి మంత్రి విస్తృతంగా మాట్లాడారు. తొలుత పి.హెచ్.డి. చేంబర్స్ ఆఫ్ కామర్స్ సదస్సులోనూ, ఆ తర్వాత భారతీయ మజ్దూర్ సంఘం జాతీయ సమ్మేళనంలోనూ ఆయన కొత్త కార్మిక సంస్కరణల చట్టాలను వివరంగా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కార్మకులు స్వావలంబనతో నిలదొక్కుకోవడానికి ఈ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మూడు కార్మిక చట్టాలకూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్టు కూడా తెలిపారు.

   కార్మికుల సంక్షేమాన్ని, లైంగిక సమానత్వాన్ని ఇదివరకెన్నడూ లేని రీతిలో ప్రోత్సహించిన ఈ కార్మిక చట్టాలు, సులభతర వాణిజ్య నిర్వహణకు కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యాజమాన్యాలు, కార్మికులు పరస్పర సామరస్యంతో పనిచేయడానికి ఈ కార్మిక చట్టాలు దోహదపడతాయన్నారు. భారతదేశం ఆర్థిక ప్రగతిని 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న కృషికి తగిన మద్దతు అందించాలని పారిశ్రామిక వర్గాల అధినేతలకు కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.

   పలు రకాల సంస్థల అభివృద్ధి, విస్తరణతో ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, కార్మికుల పని పరిస్థితులు కూడా మెరుగవుతాయని అన్నారు. సార్వత్రిక, నిర్బంధ ఫ్లోర్ స్థాయి వేతనాలను కార్మికులకు వర్తింపజేస్తూ పొందుపరిచిన నిబంధనలను గాంగ్వర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళా కార్మికులకు సమాన వేతనాలు, సమాన అవకాశాలు కల్పించడం, నియామక పత్రాల జారీని తప్పనిసరి చేయడం, దేశంలోని మరింత విస్తృత స్థాయి కార్మికవర్గాలకు ఇ.పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ.సి. పరిధిలో సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించడం ప్రశంసనీయమన్నారు. ఆన్ లైన్ ద్వారా జి.ఐ.జి. ప్లాట్ ఫాంలపై పనిచేసే వారు, తోటపని చేసేవారితో సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ఇ.పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ.సి. ల పరిధిలో సామాజిక భద్రతా ప్రయోజనాలను కొత్త చట్టాలు కల్పిస్తాయన్నారు.   

  అసంఘటిత రంగం కార్మికులకోసం సామాజిక భద్రతా నిధి, ఉద్యోగాలు కోల్పోయే వారికోసం రీస్కిల్లింగ్ నిధి కల్పించడం, వలస కూలీల నిర్వచనాన్ని మరింత విస్తృతం చేయడం, మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు అందేలా వలస కూలీల సమాచారాన్ని నమోదు చేయడం కార్మిక చట్టాల్లో కొత్తగా తీసుకువచ్చిన సంస్కరణలని అన్నారు. కార్మిక సంస్కరణలనే గొప్ప మలుపు తిప్పేలా కొత్త కార్మిక చట్టాలు రూపొందాయన్నారు. ఎందుకంటే కొన్ని ప్రాచీన చట్టాలు ఎలాంటి సంస్కరణలకూ నోచుకోకుండా గత 73 సంవత్సరాలుగా అలాగే ఉండిపోయాయన్నారు. కొత్తగా తీసుకువచ్చిన ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్ విధానంతో సులభతర వాణిజ్య నిర్వహణకు ఎన్నో చర్యలు తీసుకున్నామని అన్నారు. కార్మిక చట్టాల రూపకల్పనపై తుది నిర్ణయం తీసుకునే ముందు, సంబంధిత వర్గాలన్నింటితో విస్తృత స్థాయిలో చర్చలు జరిపినట్టు గాంగ్వార్ చెప్పారు. చారిత్రాత్మక ప్రయోజనాలను అందించే ఈ చట్టాలపై పార్లమెంటులో చర్చించరాదని ప్రతపక్షాలు నిర్ణయించుకోవడం శోచనీయమని అన్నారు.

   కార్మికుల సంక్షేమంపై ప్రస్తుత ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధిని కేంద్ర మంత్రి తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. అసంఘటిత రంగంలోని కార్మికులకోసం ఇప్పటికే చేపట్టిన పి.ఎం. శ్రమయోగి మంధన్ పథకం, ప్రసూతి సెలవులను 12వారాలనుంచి 26వారాలకు పెంచడం, ఇ.పి.ఎఫ్., ఇ.ఐ.సి. సేవలకు పోర్టబిలిటీ, విస్తరణ సదుపాయం కల్పించడం, గనుల్లో పనిచేసేందుకు వీలుగా మహిళలకు సాధికారత కల్పించడం తదితర కార్యక్రమాలను కేంద్ర మంత్రి ఉదహరించారు.

   వేతనాలపై గత ఏడాది ఆమోదించిన చట్టంతోపాటుగా,.. సామాజిక భద్రతా చట్టం, పారిశ్రామిక సంబంధాల చట్టం, వృత్తిగతమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల చట్టం వంటివి ఇటీవల పార్లమెంటు ఆమోదించింది.

*****




(Release ID: 1661456) Visitor Counter : 154