పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

జబల్పూర్‌ విమానాశ్రయం ఆధునీకరణ

రద్దీ గంటల్లో 500 మంది ప్రయాణీకులను నిర్వహించే సామర్థ్యం

కొత్త టెర్మినల్‌ భవనం, రన్‌ వే విస్తరణ పనులు

స్థిరమైన పట్టణ మురుగు పారుదల వ్యవస్థతో పర్యావరణహితం

Posted On: 29 SEP 2020 4:58PM by PIB Hyderabad

మధురానుభూతులను అందించే పర్యాటక ప్రాంతాలున్న జబల్పూర్‌ మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. జబల్పూర్‌ విమానాశ్రయం పర్యాటకుల రద్దీని చూడబోతోంది. ఉత్తమ విమాన సేవలు అందించేలా ఆధునికత సంచరించుకుంటోంది. కొత్త టెర్మినల్‌ భవనం, ఏటీసీ టవర్‌, సాంకేతిక బ్లాక్‌, ఏడో కేటగిరీ అగ్నిమాపక కేంద్రం, మరికొన్ని కొత్త భవనాలు, రన్‌ వే విస్తరణ పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనుల కోసం 468.43 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకి 2015లో అప్పగించింది. మొత్తం విస్తీర్ణం 775 ఎకరాలకు చేరింది.

    రద్దీ గంటల్లో 500 మంది ప్రయాణీకులను నిర్వహించేలా కొత్త టెర్మినల్‌ భవనంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలుంటాయి. టెర్మినల్‌ భవనం విస్తీర్ణం 115180 చ.అ. ఇందులో మూడు ఏరో బ్రిడ్జిలు, సామగ్రి పరిశీలన కోసం ఆధునిక వ్యవస్థ, ఆధునిక ఆహారశాల, 250కి పైగా కార్లు, బస్సులు నిలిపేలా పార్కింగ్‌ ప్రాంతాన్ని నిర్మించనున్నారు. గోండుల చిత్రకళలు, స్థానిక హస్తకళలు, కుడ్య చిత్రాలు, మధ్యప్రదేశ్‌లో దర్శనీయ స్థలాల సమాహారంగా టెర్మినల్‌ భవనం ప్రయాణీకులకు స్వాగతం పలుకనుంది. 

    పర్యావరణహిత సామగ్రితో కొత్త భవనాన్ని నిర్మిస్తారు. సౌర విద్యుత్‌ ప్లాంట్‌, విద్యుత్‌ ఆదా పరికరాలు, సమర్థవంత ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ, ఉద్యానవన సాగు కోసం వాడిన నీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ, స్థిరమైన పట్టణ మురుగుపారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. 

    కొత్త టెర్మినల్‌ భవనం నిర్మాణం కాకుండా; రూ.412 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఇందులో, ఎయిర్‌బస్‌ 320 వంటి విమానాలు దిగేందుకు అనువుగా రన్‌ వే విస్తరణ, 32 మీటర్ల ఎత్తైన కొత్త ఏటీసీ టవర్‌, అన్ని ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక భవనం (జీ+2‌), ఏడో కేటగిరీ అగ్నిమాపక కేంద్రం, యుటిలిటీ బ్లాక్‌, గేట్‌ హౌస్‌ వంటి ఇతర సహాయక భవనాలను నిర్మిస్తున్నారు.

    వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. 2022 మార్చి నాటికి కొత్త టెర్మినల్‌ భవనం అందుబాటులోకి రావచ్చు. కన్హా నేషనల్‌ పార్కు‌, బాంధవ్‌ఘర్‌ నేషనల్‌ పార్కు, భేదాఘాట్ సమీపంలో ఉన్న పాలరాతి శిఖరాలు, జలపాతాల వంటి పర్యాటక ఆకర్షణలున్న తూర్పు మధ్యప్రదేశ్‌కు, ముఖ్యంగా మహాకౌషల్ ప్రాంతానికి ఈ విమానాశ్రయం సేవలు అందిస్తుంది. జబల్పూర్‌ నగరాభివృద్ధికి, ఆ ప్రాంతంలో పర్యాటక పరిశ్రమ వృద్ధికి విమానాశ్రయ ఆధునీకరణ తోడ్పడుతుంది.


                    TERMINAL BUILDING –AIR SIDE VIEW

TERMINAL BUILDING –CITY SIDE VIEW

TERMINAL BUILDING –SIDE VIEW

 

WORK IN PROGRESS

***                                             


(Release ID: 1660184) Visitor Counter : 259