భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
“ఫేమ్” పథకం కింద 670 కొత్త విద్యుత్ బస్సులు, 241 చార్జింగ్ స్టేషన్ల మంజూరు
పర్యావరణహిత రవాణాపై ప్రధాని దార్శనికత దిశగా
ఇది గొప్ప ముందడుగు : మంత్రి జవదేకర్
Posted On:
25 SEP 2020 9:56AM by PIB Hyderabad
విద్యుత్ (ఎలెక్ట్రిక్) వాహనాలతో రవాణా ఏర్పాట్లలో దేశం గొప్ప ముందడుగు వేసింది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, చండీగఢ్ రాష్ట్రాల్లో రవాణా కోసం 670 ఎలెక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే ఫేమ్ పథకం 2వ దశ కింద మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, పోర్ట్ బ్లయర్ లలో 241 చార్జింగ్ స్టేషన్లను కూడా మంజూరు చేసింది.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్ ద్వారా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వాహన కాలుష్యాన్ని నివారించడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించుకోవాలన్న అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇది తెలియజేస్తున్నదని జవదేకర్ తన ట్విట్టర్ సందేశాల్లో తెలిపారు. ప్రజారవాణాలో పర్యావరణహితమైన వాహనాల వినియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఎలెక్ట్రిక్ బస్సులపై నిర్ణయం తీసుకున్నామన్నారు.
భారతదేశంలో వేగంగా హైబ్రిడ్ / విద్యుత్ వాహనాల వినియోగం, తయారీ (ఫేమ్- ఇండియా) అనే పథకాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల మంత్రిత్వశాఖ పరిధిలోని భారీ పరిశ్రమల శాఖ చేపట్టింది. ఈ పథకం కింద 2015 ఏప్రిల్ నుంచి దేశంలో ఎలెక్ట్రిక్/హెబ్రిడ్ వినియోగాన్ని ప్రారంభించింది.
పథకం తొలిదశలో 2019 మార్చి వరకూ రూ. 359కోట్లతో 2,80,987 ఎలెక్ట్రిక్/హెబ్రిడ్ వాహనాలను డిమాండ్ ప్రోత్సాహక పద్ధతి ద్వారా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కేంద్ర భారీ పరిశ్రమల శాఖ దాదాపు రూ. 280 కోట్ల ఖర్చుతో 425 ఎలెక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులను వివిద నగరాలకు మంజూరు చేసింది. ఫేమ్-ఇండియా పథకం తొలిదశలోనే రూ. 43కోట్ల ఖర్చుతో 520 చార్జింగ్ స్టేషన్లను బెంగుళూరు, చండీగఢ్, జైపూర్, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి (ఎన్.సి.ఆర్.కు) మంజూరు చేశారు.
ప్రస్తుతం ఫేమ్-ఇండియా రెండవ దశను 2019 ఏప్రిల్ 1వ తేదీనుంచి మూడేళ్లపాటు అమలు చేస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు కేటాయించారు.
ఫేమ్-ఇండియా పథకం రెండవ దశలో ప్రజా రవాణాను, భాగస్వామ్యంతో నిర్వహించే ప్రజా రవాణాను విద్యుదీకరించేందుకు దృష్టిని కేంద్రీకకరిస్తున్నారు. సబ్సిడీల ద్వారా మద్దతు అందిస్తున్నారు. దాదాపుగా 7,000 ఎలెక్ట్రిక్ బస్సులు, 5లక్షల ఎలెక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, 55,000 ఎలెక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు, 10లక్షల ఎలెక్ట్రిక్ ద్విచక్రవాహనాలు ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనాలు వినియోగించే వారిలో ఆందోళనను తొలగించేందుకు చార్జింగ్.కు సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా అదనంగా ఏర్పాటు చేయబోతున్నారు.
***
(Release ID: 1658933)
Visitor Counter : 276