యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణా కేంద్రాల్లో క్రీడా కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రమాణ బద్ధమైన నిర్వహణా నిబంధనావళి
“ఖేలో ఇండియా ఫిర్ సే” పేరిట క్రీడల సందడి: కిరెన్ రిజిజు
Posted On:
19 SEP 2020 5:23PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ మహమ్మారి ప్రబలడంతో దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్.ఎ.ఐ.) కేంద్రాల్లో సంప్రదాయ శిక్షణా కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. క్రీడలకు ప్రోత్సాహం కోసం క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టిన పలు పథకాల కింద శిక్షణా కార్యక్రమాలన్నీ తాత్కాలికంగా రద్దయ్యాయి. భారతీయ క్రీడాకారుల విదేశీ శిక్షణ కూడా నిలిచిపోయింది. అయితే, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు క్రీడా శిక్షణా కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి.
కోవిడ్ -19 మహమ్మారి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ సందర్భంగా క్రీడాకారుల, అథ్లెట్ల రక్షణ కోసం ఈ కింది చర్యలు తీసుకున్నారు:
శిక్షణా కేంద్రాల్లో క్రీడా కార్యకలాపాల పునఃప్రారంభం కోసం “ఖేలో ఇండియా ఫిర్ సే” పేరిట ప్రమాణ బద్ధమైన నిర్వహణా నిబంధనావళిని అమలు చేస్తున్నారు. శిక్షణా కేంద్రాల్లోని భాగస్వామ్య వర్గాలన్నిటికీ ఈ నిబంధనావళి వర్తిస్తుంది. క్రీడాకారులు, సాంకేతిక సిబ్బంది, ఇతర సిబ్బంది, పరిపాలనా సిబ్బంది, హాస్టల్ ఫెసిలిటీ మేనేజిమెంట్ సిబ్బందికి, సందర్శకులకు కూడా ఈ నిబంధనావళి వర్తిస్తుంది.
శిక్షణా కేంద్రాలన్నింటిలో మార్గదర్శక సూత్రాలను కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు కోవిడ్ టాస్క్ ఫోర్స్ పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంతపు పరిపాలనా యంత్రాంగం జారీ చేసే ఆరోగ్య సంబంధమైన నిబంధనలను పటిష్టంగా అమలు జరిగేలా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
అథ్లెట్ల భద్రత, రక్షణకోసం ఎస్.ఎ.ఐ. శిక్షణా కేంద్రాలను రెడ్, బ్లూ, యెల్లో రంగుల పేరిట 3 జోన్లుగా విభజించారు. ఆరోగ్య, పారిశుద్ధ్య కార్యకల్పాల నిర్వహణకు ఒక హైజీన్ ఆఫీసర్ ను నియమించారు. నర్సులు, ఫిజియో తెరపిస్టు, సైకాలజిస్టు, పౌష్టికాహార నిపుణుడు వంటి సహాయక సిబ్బందిని నియమించారు. వీరందరినీ పారిశుద్ధ్య వ్యవహారాల కార్యాచరణ బృందంగా శిక్షణా కేంద్రాలకు తరలించారు. కోవిడ్-19నుంచి రక్షణ కల్పించే విషయంలో జాతీయ క్యాంపు సిబ్బంది, కోచ్ లు, ఇతర సహాయక సిబ్బందితో ఈ కార్యాచరణ బృందం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.
లాక్ డౌన్ సందర్భంగా ఎస్.ఎ.ఐ. పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాలు, స్డేడియంలలో నిర్వహణా కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మొత్తం రూ.28.75 కోట్లు ఖర్చు పెట్టారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి కిరెణ్ రిజిజు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలియజేశారు.
*****
(Release ID: 1656836)
Visitor Counter : 232