ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్య నిర్వహణపై పీఎంవో నేతృత్వంలోని అధికార బృందం ముందస్తు చర్యలు
• వివిధ ఏజెన్సీలు చేపట్టిన చర్యలపై సమీక్షసహా రానున్న సీజన్ కోసం ప్రణాళికల ఖరారుకు 18.09.2020న ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కార్యాచరణ బృందం భేటీ;
• వ్యర్థాల దహనం.. ఇతర చర్యలు సకాలంలో చేపట్టడం లక్ష్యంగా ముందస్తు సమావేశం ఏర్పాటుచేసినట్లు సభ్యులందరికీ వివరించిన ముఖ్య కార్యదర్శి;
• పరిస్థితిపై అంచనాలో భాగంగా పొరుగునగల పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నిరుడు అధికమని గుర్తించిన సమావేశం;
• పంట వ్యర్థాల దహనం నిలిపివేత దిశగా ప్రణాళికబద్ధమైన చర్యలు ముమ్మరం చేసే దిశగా పలు ఆదేశాలిచ్చిన ప్రధాని ముఖ్య కార్యదర్శి
Posted On:
19 SEP 2020 6:32PM by PIB Hyderabad
జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో వాయు కాలుష్యం మెరుగు దిశగా ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కార్యాచరణ బృందం సమావేశానికి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా అధ్యక్షత వహించారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారితోపాటు కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు, వ్యవసాయ, రహదారి, పెట్రోలియం మంత్రిత్వశాఖల, విభాగాల కార్యదర్శులుసహా కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ కార్యదర్శి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా- పంటకోతలు, శీతాకాలం ప్రవేశానికి ముందుగానే వాయు కాలుష్యంపై సముచిత ముందుజాగ్రత్త-నిరోధక చర్యలు సకాలంలో తీసుకోవడం లక్ష్యంగా ఈ ముందస్తు సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి వివరించారు. వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వశాఖలు తీసుకున్న చర్యలు-వాటి ప్రగతిపైనా సమావేశం సమీక్షించింది. కాగా, గడచిన రెండేళ్లలో పంట వ్యర్థాల దహనం సంఘటనలు 50 శాతందాకా తగ్గడంతోపాటు చక్కని వాయునాణ్యత సూచీ అనుగుణమైన రోజుల సంఖ్య కూడా పెరిగినట్లు గుర్తించింది.
పంట వ్యర్థాల దహనం నియంత్రణ కోసం పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు రచించిన ప్రణాళికలు, చేసిన కృషిపైనా సమావేశం సవివరంగా పరిశీలించింది. అంతేగాక అవసరాలకు తగినట్లు యంత్రాల లభ్యతసహా పంట అవశేషాల క్షేత్రస్థాయి నిర్వహణ గురించి ఆరాతీసింది. అలాగే రుణ మంజూరుకు సంబంధించి పంట అవశేషాల ఆధారిత విద్యుత్/ఇంధన ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును రిజర్వు బ్యాంకు ఇటీవల ప్రాధాన్య రంగాల జాబితాలో చేర్చడాన్ని ప్రస్తావించింది. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇటువంటి ఉత్పాదక యూనిట్లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయపడింది. అలాగే పంట వైవిధ్యీకరణ, సరఫరా గొలుసుల బలోపేతం సంబంధిత చర్యలపైనా చర్చించింది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ రూపొందించిన ప్రస్తుత పంట వ్యర్థాల నిర్వహణ పథకాన్ని రాష్ట్రాలు సమర్థంగా అమలు చేయడంలోని ప్రాధాన్యాన్ని ముఖ్య కార్యదర్శి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుత సంవత్సరంలో పంటకోతల కాలం మొదలయ్యేసరికి కొత్త యంత్రాలను వినియోగంలోకి తేవడంతోపాటు అవి రైతులకు అందుబాటులో ఉండేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని నొక్కిచెప్పారు. దీనికి సంబంధించి అవసరమైన సహకారాన్ని అందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖను ఆదేశించారు. ఇక పంట వ్యర్థాల దహనం నియంత్రణ కోసం క్షేత్రస్థాయిలో తగు సంఖ్యలో సంబంధిత బృందాలను ఏర్పాటు చేయడంపై దృష్టిసారించాలని చెప్పారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లలో వ్యర్థాల దహనం చోటచేసుకోకుండా చూసుకోవాలని సూచించారు. ఆ మేరకు ఆయా రాష్ట్రాలు సంబంధిత జిల్లాల్లో అదనపు చర్యలు చేపట్టాలని, తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఇక స్థానిక కాలుష్య మూలాల నియంత్రణకు ఢిల్లీ జాతీయ ప్రాదేశిక ప్రాంత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యర్థాల బహిరంగ దహనాన్ని అరికట్టడంపై నియంత్రణ బృందాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే రోడ్లు ఊడ్చే యంత్రాలపై సమాచార సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అంతేగాక నిర్మాణ/కూల్చివేత వ్యర్థాల మెరుగైన వినియోగం, గుర్తించిన కాలుష్య కారక ప్రదేశాలను బట్టి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యకార్యదర్శి చెప్పారు. జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే తమ ప్రాంతాల్లో ఇలాంటి ప్రదేశనిర్దిష్ట ప్రణాళికల రూపకల్పన, అమలుకు హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి. పరిస్థితులు తీవ్రం కాకముందే సమావేశంలో తీర్మానించిన మేరకు అన్ని చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యకార్యదర్శి స్పష్టం చేశారు. దీంతోపాటు శివారు పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమలు కాలుష్య ఉద్గార నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని నిర్దేశించారు.
***
(Release ID: 1656810)
Visitor Counter : 229
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam