జౌళి మంత్రిత్వ శాఖ
వస్త్ర రంగంపై కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాలు
Posted On:
18 SEP 2020 5:12PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల మీద పడింది. భౌతిక దూరం పాటించటం, కూలీల వలసలు లాంటివి రైతులు మొదలుకొని వ్యాపారులు, ఎగుమతిదారుల దాకా అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేశాయి అదే సమయంలో కొత్త అవకాశాల ద్వారాలు కూడా తెరుచుకున్నాయి అంతకుముందు అంతగా పట్టించుకోని అవకాశాలు సైతం ఇప్పుడు ప్రధాన వనరుగా మారాయి.
భారత పట్టు పరిశ్రమ మీద కోవిడ్ ప్రభావాన్ని ప్రభుత్వం అధ్యయనం చేయించింది. దీనివలన ఈ రంగానికి జరిగిన నష్టం తెలియవచ్చింది. ఉత్పత్తిలో తగ్గుదల ఉన్నట్టు, ప్రతి దశలోనూ నష్టం వాటిల్లినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. ఉత్పత్తి పడిపోవటం, పట్టుగూళ్ళు , ముడి పట్టు ధరలు కుప్పకూలటం, రవాణా సమస్యలు, నైపుణ్యం గల కార్మికుల అందుబాటులో లేకపోవడం, ముడి పట్టు, పట్టు ఉత్పత్తుల అమ్మకంలో సమస్యలు, నిర్వహణ మూలధనం నగదు ప్రవాహ సమస్యలు, ముడి సరుకు అందుబాటులో లేకపోవడం, పట్టు బట్టకు డిమాండ్ తగ్గటం, ఎగుమతులు/ దిగుమతుల ఆర్డర్లు రద్దు కావటం, ఎగుమతులు/ దిగుమతులపై ఆంక్షలు లాంటి ఎన్నో సమస్యలు ఈ అధ్యయనంలో బయటపడ్డాయి. జౌళి రంగం ప్రధానంగా అసంఘటిత రంగం కావడంతో ఈ రంగం ఎంత నష్టపోయిందో ప్రభుత్వం ఎలాంటి లాంఛన పూర్వకమైన అంచనా వేయలేకపోయింది. అందువలన ఈ రంగం ఎంత నష్టపోయింది స్పష్టంగా తెలిసే అవకాశం లేకపోయింది.
కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారత ప్రభుత్వం ఆత్మ భారత్ అభియాన్ పేరుతో ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, భారతదేశం స్వయం సమృద్ధి అవుతుందని భావిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహా వివిధ రంగాలకు అనేక రాయితీలు, ఋణ సహాయ చర్యలు ప్రకటించారు. చేనేత కార్మికులు, హస్త కళాకారులు ఈ రాయితీ ప్రయోజనాలను, రుణాలను ఉపయోగించుకొని లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న తమ వ్యాపారాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ ను సాకారం చేసే దిశలో ఒక అడుగేస్తూ చేనేత ఎగుమతుల ప్రోత్సాహక మండలి దేశం నలుమూలలా ఉన్న చేనేత కార్మికులను అంతర్జాతీయ మార్కెట్ తో వర్చువల్ విధానంలో అనుసంధానం చేయటానికి కృషి చేసింది.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా పాల్గొని తమ ఉత్పత్తులను, నైపుణ్యాన్ని, విశిష్టమైన డిజైన్లను ప్రదర్శించిన ఈ భారత జౌళి ప్రదర్శన ఆగస్టు 7, 10, 11 తేదీలలో జరిగింది. ఈ ప్రదర్శన అంతర్జాతీయ కొనుగోలుదారులను గణనీయంగా ఆకర్షించింది. చేనేత, హస్త కళలకు మద్దతుగా నిలిచేందుకు, వాళ్ళ ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెటింగ్ కల్పించేందుకు చేనేత, హస్తకళాకారులను ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ లోకి తీసుకువచ్చి వివిధ ప్రభుత్వ శాఖలకు వారి ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించింది.
చేతి తయారీ ఉత్పత్తులకోసం గొంతెత్తమన్న సామాజిక మాధ్యమ ప్రచారాన్ని 6వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించింది. భారత చేనేత వారసత్వ సంపదను సంప్రదాయాన్ని ప్రోత్సహించి చేనేత కార్మికులకు ప్రజల మద్దతు కూడగట్టటం దీని లక్ష్యం.
రాష్ట్రాలలో చేనేత సహకార సంఘాల దగ్గర. చేనేత కార్మికుల దగ్గర ఉన్న నిల్వలను వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను కోరారు. దీనివలన చేనేత కార్మికులకు కొంత నగదు చేతిలో ఉంటుందని ఇళ్లలో అవసరాలు కొంత మేరకైనా తీరతాయని కేంద్రం భావించింది.
ఈ సంక్షోభాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం, ఉత్పత్తిదారులకోసం ఆన్ లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేనేత కార్మికుల సేవా కేంద్రాలతో ఈ-చౌపల్స్ ఏర్పాటు చేయించింది. దీనివలన నేత పనివారిలో ప్రభుత్వ పథకాలపట్ల అవగాహన పెరుగుతుందని భావిస్తోంది. చేనేత ఉత్పత్తుల ఈ-మార్కెటింగ్ ను ప్రోత్సహించటానికి ఒక విధాన పరమైన చట్రానికి రూపకల్పన జరిగింది. తగిన అనుభవమున్న ఏ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అయినా చేనేత ఉత్పత్తుల ఆన్ లైన్ మార్కెటింగ్ చేయటానికి అవకాశమిచ్చింది. ఆ విధంగా 23 ఈ కామర్స్ సంస్థలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి.
కేంద్ర జౌళి శాఖామంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలోని సమాచారం ఇది.
***
(Release ID: 1656524)
Visitor Counter : 186