వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఒక జిల్లా ఒక ఉత్పత్తి భావనతో స్వదేశీ తయారీకి ప్రోత్సాహం
Posted On:
18 SEP 2020 3:07PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధన దిశగా, జిల్లాల సిసలైన సామర్థ్యాలను సమర్థంగా వాడుకునేందుకు, ఆర్థిక ప్రగతిని పెంపొందించేందుకు, ఉపాధికల్పనకు, గ్రామీణరంగంలో ఔత్సాహిక పారిశ్రామిక, వ్యవస్థాపనా స్వభావాన్ని పరిపుష్టం చేసేందుకు ఒక జిల్లా, ఒక ఉత్పత్తి (ఒ.డి.ఒ.పి.) అనే భావన సమర్థంగా పనిచేస్తుంది.. స్వదేశీ తయారీని ప్రోత్సహించే గణనీయమైన పరివర్తన చర్యగా దీన్ని పేర్కొనవచ్చు. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో 2020, ఆగస్టు 27న ఒక చర్చ జరిగింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే స్ఫూర్తి అమలు విషయమై చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే భావనను ముందుకు తీసుకుపోయే అంశంపై పారిశ్రామిక, అంతర్జాతీయ వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) ఎంతో కసరత్తు చేస్తోంది.
ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయమై, వాణిజ్య శాఖ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. డైరెక్టర్ జనరల్ (డి.జి.ఎఫ్.టి.) ద్వారా వివిధ రాష్ట్రాల సంస్థలతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విదేశీ వాణిజ్య విభాగం చర్చలు, సంప్రదింపులు జరుపుతోంది. జిల్లాలో ఎగుమతి చేయదగిన ఉత్పత్తులను గుర్తించడం, సదరు ఉత్పాదనల ఎగుమతిలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడం, తయారీ ప్రక్రియకు ఊతం ఇచ్చేందుకు వీలుగా స్థానిక ఎగుమతిదారులను, తయారీదార్లను ప్రోత్సహించడం, విదేశాల్లో సదరు ఉత్పత్తులను తీసుకునే కొనుగోలుదార్లను కనుక్కోవడం, జిల్లాలో తయారీ, సేవా పరిశ్రమను ప్రోత్సహించడం, జిల్లాలో ఉపాధి కల్పనను పెంపొందించడం తదితర చర్యలతో దేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.
దీనికి తోడు ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా ఎగుమతి ప్తోత్సాహక కమిటీ (డి.ఇ.పి.సి.) పేరిట ఒక సంస్థాగతమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా మెజిస్ట్రేట్/కలెక్టర్/ డి.సి./జిల్లా అభివృద్ధి అధికారి ఈ కమిటీకి అధ్యక్ష్యత వహిస్తారు. విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ జనరల్ పర్యవేక్షణలో పనిచేసే ప్రాంతీయ అధికారి ఈ కమిటీకి సహాధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఎగుమతి వ్యవహారానికి సంబంధించిన ఆయా జిల్లాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయడం జిల్లాల ఎగుమతుల ప్రోత్సాహ కమిటీలు నిర్వర్తించవలసిన ప్రధాన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో సంబంధిత భాగస్వామ్య వర్గాలతో కలసి ఈ ప్రణాళికలను రూపొందించవలసి ఉంటుంది.
ఇందుకు సంబంధించి, డి.జి.ఎఫ్.టి. వెబ్ సైట్ తో అనుసంధానించే ఒక వైబ్ పోర్టల్ ను కూడా రూపొందించారు. ఆయా జిల్లాల్లో ఎగుమతికి అవకాశం, ఆస్కారం ఉన్న ఉత్పత్తుల సమాచారాన్ని అంతటినీ పొందుపరుచేందుకు వీలుగా ఈ పోర్టల్ ఉంటుంది. ఇప్పటికే రూపకల్పన పూర్తయిన ఈ పోర్టల్ ఇపుడు ప్రయోగాత్మక దశలో ఉంది. వివిధ జిల్లాల్లో,..ఎగుమతికి అవకాశాలున్న ఉత్పత్తులను గుర్తించే ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అందుకు తగినట్టుగానే ఆయా రాష్ట్రాల ఎగుమతి వ్యూహాలు తయారవుతున్నాయి.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలిపారు.
****
(Release ID: 1656210)
Visitor Counter : 172