పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ ప్రయణీకులకు కోవిడ్-19 పరీక్షలు

విమానాశ్రయ ప్రవేశ ద్వారం దగ్గరే ప్రయోగాత్మక పరీక్షకు అనుమతి

Posted On: 16 SEP 2020 4:53PM by PIB Hyderabad

అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేస్తూ పౌర విమానయాన శాఖ విమానాశ్రయపు ప్రవేశ ద్వారం దగ్గరే ఆర్ టి - పిసిఆర్ పరీక్షలను ప్రయోగాత్మకంగా అనుమతిస్తోంది. ఈ మార్గదర్శకాల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

(i)  విమానాశ్రయ నిర్వాహకుడు శాంపిల్ సేకరణ, వెయిటింగ్ లాంజ్ ఒకేచోట ఉండేలా చూసి ఆర్ టి-పిసిఆర్ పరీక్షకు ఏర్పాటు చేస్తాడు

(ii) వెయిటింగ్ లాంజ్ మిగతా కార్యకలాపాల ప్రదేశానికి దూరంగా ఉండాలి.  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన అన్ని మార్గదర్శకాలతో అన్ని శానిటైజేషన్ పద్ధతులూ, భౌతిక దూరమూ పాటించాలి. ప్రయాణికులకు అవసరమయ్యే వైఫై, ఎఫ్ అండ్ బి ఎంపిక అవకాశం, బాత్రూంలు లాంటి కనీస సౌకర్యాలన్నీ కల్పించాలి. పరీక్షలు, ఇతర సౌకర్యాలకు నగదు రహిత లావాదేవీలకు అవకాశం కల్పించాలి.

(iii)  ప్రయాణీకుడు కోవిడ్ పరీక్ష ఫలితాలకోసం వెయిటింగ్ లాంజ్ లో ఉండాలన్నా, లేదా అప్పటివరకు కేటాయించిన హోటల్ గదిలో ఐసొలేషన్ లో వేచి ఉండటమా ఎంచుకునే అవకాశాన్ని విమానాశ్రయ నిర్వాహకుడు కల్పించాలి.

(iv) ఐసి ఎంఆర్, ఎన్ ఎ బి ఎల్  వారి నియమనిబంధనలకు కచ్చితంగా లోబడి మాత్రమే శాంపిల్ సేకరణ జరగాలి 

(v) ప్రయాణీకులు ఆర్ టి -పిసిఆర్ పరీక్షలకోసం సంబంధిత వెబ్ సైట్ ద్వారా  లేదా తగిన ఆన్ లైన్ వేదికల ద్వారాఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి. విమానాశ్రయ నిర్వాహకుడు ఈ పరీక్షల ప్రక్రియ సాఫీగా సాగటానికి తగిన చర్యలు తీసుకోవాలి.

(vi) ప్రయాణీకుఇ పాస్ పోర్ట్ ను అధికారులు శాంపిల్ సేకరణ జరిపే వెయిటింగ్ లాంజ్ దగ్గరే తీసుకొని పరీక్ష ఫలితం వచ్చేదాకా తమదగ్గరే  ఉంచుకోవాలి.

(vii) పరీక్ష ఫలితం నెగటివ్ అయిన పక్షంలో ప్రయాణీకుణ్ణి  వెయిటింగ్ లాంజ్ నుంచి  వెలుపలికి వెళ్ళే ద్వారం గుండా డిపార్చర్స్ వైపు వెళ్ళి విమానం ఎక్కటానికి  అనుమతిస్తారు.  ఒకవేళ ఫలితం పాజిటివ్ అయితే, ఐసిఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. 

(viii) ఏ ప్రయాణీకుడూ అనధికార ద్వారం గుండా వెలుపలికి వెళ్ళే అవకాశం ఇవ్వకూడదు.

పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనిదే  ఈ సమాచారం.

****



(Release ID: 1655449) Visitor Counter : 166