ఆయుష్
ఆయుర్వేద బోధన, పరిశోధనాసంస్థ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
Posted On:
16 SEP 2020 3:41PM by PIB Hyderabad
ఆయుర్వేదంలో బోధన, పరిశోధనా సంస్థ బిల్లు- 2020 కి రాజ్య సభ ఈరోజు ఆమోద ముద్ర వేసింది, ఇంతకుముందు 2020 మార్చి19 న దీనిని లోక్ సభ ఆమోదించిన సమ్గతి తెలిసిందే, దీంతో గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆయుర్వేదంలో అత్యాధునికమైన ఆయుర్వేద బోధన, పరిశోధనాసంస్థ (ఇట్రా) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పైగా దీనికి జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థ (ఐఎన్ ఐ) గా గుర్తింపు లభిస్తుంది.
గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అనేక ఆయుర్వేద సంస్థలను ఏకం చేయటానికి ఈ కొత్త సంస్థ ఉపయోగపడుతుంది. బాగా పేరున్న విద్యా సంస్థలైన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, శ్రీ గులాబ్ కున్వెర్బ ఆయుర్వేద మహావిద్యాలయ, ఇన్ స్టిటూట్ ఆఫ్ ఆయుర్వేదిక ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మహర్షి పతంజలి ఇన్ స్టిట్యూట్ ఫర్ యోగ నాచురోపతి ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే సమ్స్థలన్నీ ఇప్పుడు ఒకే గొడుగు కిందికి వస్తాయి. ఈ సంస్థలన్నీ గత కొన్ని దశాబ్దాలుగా ఎదుగుతూ అన్నీ కలిసి దగ్గర దగ్గరగా ఉంటూ ఆయుర్వేద కుటుంబానికి చెందినవి కావటం గమనార్హం.
ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందటంతో ఈ కొత్త సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కూడా లభిస్తుంది. ఆయుర్వేదం లోను, ఫార్మసీ లోను అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు పాఠ్యప్రణాళికలు రూపొందించటం సాధ్యమవుతుంది. వివిధ ఆయుర్వేద సంస్థల మధ్య సహోత్తేజనం ఏర్పడుతుంది. ఇది మొత్తం ఆయుష్ రంగానికే ఒక దీపస్తంభంలా నిలుస్తుంది. శిక్షణనిచ్చే వారికి ఆయుర్వేద, ఫార్మసీ విభాగాలలో ఇది అత్యున్నత స్థాయి శిక్షణ ఇవ్వగలుగుతుంది. ఆయుర్వేద రంగంలో లోతైన పరిశోధనలను చేపట్టగలుగుతుంది.
ఆయుష్ రంగంలో ఇట్రా ఇప్పుడు జాతీయ ప్రాధాన్యమున్న తొలిసంస్థగా గుర్తింపు పొందటం వలన స్వతంత్రంగా సరికొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు, కోర్సు నిర్మాణాన్ని ఖరారు చేయటానికి, బోధనావిధానాన్ని ప్రామాణీకరిం చటానికి వెసులుబాటు కలుగుతుంది. సంప్రదాయ విజ్ఞానం మీద ఆధారపడిన ఆరోగ్య పరిష్కారమార్గాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో ఇట్రా ఇప్పుడు ఆయుర్వేద విద్యను కొత్తపుంతలు తొక్కించటానికి వీలు కలుగుతోంది.
***
(Release ID: 1655119)
Visitor Counter : 280